Share News

Pawan Kalyan : హ్యాట్సాఫ్‌ కల్యాణ్‌ బాబు

ABN , Publish Date - Jun 07 , 2024 | 02:51 AM

అచ్చమైన ఆప్యాయత పూల వర్షమై కురుస్తుండగా.. స్వచ్ఛమైన ప్రేమానురాగాలు నిండిన గుండెల నడుమ..

Pawan Kalyan : హ్యాట్సాఫ్‌ కల్యాణ్‌ బాబు

ఎన్నికల్లో గెలిచాక తొలిసారి చిరంజీవి ఇంటికి పవన్‌

కుటుంబ సభ్యులందరి నుంచి అపూర్వ రీతిలో స్వాగతం

భారీ పూలమాల మెడలో వేసి ముద్దాడిన మెగాస్టార్‌

తల్లి, అన్నా, వదినలకు జన సేనాని పాదాభివందనం

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): అచ్చమైన ఆప్యాయత పూల వర్షమై కురుస్తుండగా.. స్వచ్ఛమైన ప్రేమానురాగాలు నిండిన గుండెల నడుమ.. గౌరవాభిమానాలు పాదాభివందనాలుగా మారిపోయాయి..! హర్షాతిరేకంతో ఆలింగనాలు వెల్లువెత్తగా.. భావోద్వేగాలతో కళ్లు చెమర్చాయి..! జగమంత కుటుంబం నాది అంటూ ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కదంతొక్కి ఘన విజయం అందుకున్న జన సేనాని పవన్‌ కల్యాణ్‌కు సొంత కుటుంబ సభ్యుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఢిల్లీలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సాగిన ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న అనంతరం పవన్‌ కల్యాణ్‌ గురువారం తొలి సారిగా హైదరాబాద్‌లోని తన పెద్దన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవి ఇంటికి వచ్చారు. దీంతో యావత్‌ మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. భార్య అన్నా లెజ్‌నోవా, కుమారుడు అకీరా నందన్‌తో కలిసి వచ్చిన పవన్‌ను కారు దిగిన వెంటనే అన్న కుమారులు, హీరోలు రాంచరణ్‌, వరుణ్‌తేజ్‌ కౌగిలించుకుని సాదరంగా ఆహ్వానించారు. వదిన సురేఖ చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకువచ్చి వీరతిలకం దిద్దారు. అమ్మ అంజనాదేవి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అక్కచెల్లెలు హారతిచ్చిన అనంతరం.. బయటకు వచ్చిన చిరంజీవికి పవన్‌ చెప్పులు విడిచి మరీ పాదాభివందనం చేశారు.

చిన్న తమ్ముడిని గట్టిగా హత్తుకుని చిరు ముద్దాడి.. భారీ పూలమాలను మెడలో వేశారు. ఈ దృశ్యం చూసి సోదరుడు నాగబాబు భావోద్వేగంతో కంటతడి పెట్టారు. తల్లిదండ్రుల సమక్షంలో బాబాయ్‌ పవన్‌కు పుష్పగుచ్ఛం అందించిన రాంచరణ్‌ పాదాభివందనం చేశారు. ఇంతలో ఆయన భార్య ఉపాసన రావడంతో అందరూ కలిసి గ్రూప్‌ ఫొటోకు పోజిచ్చారు. నాగబాబు, ఆయన భార్య, కుమారుడు వరుణ్‌తేజ్‌, ఆయన భార్య లావణ్య త్రిపాఠిలూ పవన్‌ దంపతులకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ‘‘డియర్‌ కల్యాణ్‌ బాబు హ్యాట్సాఫ్‌’’ అని రాసి ఉన్న కేక్‌ను అమ్మ, వదినలతో కలిసి పవన్‌ కట్‌ చేశారు. పవన్‌-లెజ్‌నోవాలకు చిరంజీవి దంపతులు కొత్త దుస్తులు పెట్టారు. ఈ కార్యక్రమం అనంతరం పవన్‌ అమ్మ అంజనాదేవి, వదిన సురేఖకు పాదాభివందనం చేశారు. వేడుకలో నిర్మాత అల్లు అరవింద్‌, ఆయన కుమారుడు, హీరో అల్లు అర్జున్‌ మాత్రం కనిపించలేదు. మరోవైపు అకీరా నందన్‌ తండ్రిపై రూపొందించిన ఓ వీడియోను రేణూదేశాయ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. పవన్‌ నటించిన చిత్రాల్లోని పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు, యాక్షన్‌ స్టిల్స్‌ను వాడుతూ.. దివంగత మైకేల్‌ జాక్సన్‌ పాట ‘దే డోంట్‌ కేర్‌ అబౌట్‌ అజ్‌’ను బ్యాక్‌ గ్రౌండ్‌లో ఉపయోగించారు. ఈ వీడియోను పవన్‌ అభిమానులు షేర్‌ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే దీనిని అకీరా ఎడిట్‌ చేశారని రేణూదేశాయ్‌ తెలిపారు.

Updated Date - Jun 07 , 2024 | 02:51 AM