Pawan Kalyan : పనుల పండుగ
ABN , Publish Date - Oct 15 , 2024 | 04:20 AM
పల్లె పండుగ’ పనుల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పిలుపిచ్చారు.
ప్రజలంతా పాలుపంచుకోవాలి: పవన్
30 వేల పనులు.. 4,500 కోట్ల వ్యయం
జనమే గ్రామ సభల్లో తీర్మానించుకున్నారు
వీటిలో ప్రజాప్రతినిధుల ప్రమేయం లేదు
సంక్రాంతికి పనులు పూర్తయ్యేలా ప్రణాళిక
అధికార యంత్రాంగం బాధ్యతగా మెలగాలి
గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ మంత్రి
ఎవరో కూడా తెలియని దౌర్భాగ్యం బ్రహ్మ పదార్థంలా నిధుల మళ్లింపు
కంకిపాడు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘పల్లె పండుగ’ పనుల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పిలుపిచ్చారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సోమవారం కృష్ణా జిల్లా కంకిపాడులో ఆయన ప్రారంభించారు. కంకిపాడు, పునాదిపాడుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. గ్రామగ్రామానా వారం రోజులపాటు సాగే పల్లె పండుగ ఇంత నిండుగా జరుగుతుంటే మదిలో ఆనందంగా ఉందన్నారు. ‘ప్రజల కోసం తీసుకునే ఏ నిర్ణయమైనా వారి మధ్యనే జరగాలి.. వారితోనే జరగాలి.. వారి వల్లనే జరగాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం’ అని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 23న నిర్వహించిన గ్రామ సభల్లో రూ.4,500 కోట్లతో 30 వేల పనులు చేపట్టాలని తీర్మానాలు చేశారని.. ప్రజలంతా కలిసి తమ గ్రామాల్లో కావలసిన అభివృద్ధి పనులను వారే తీర్మానించుకున్నారని తెలిపారు. దీనిలో ప్రజాప్రతినిధుల ప్రమేయం ఏమీ లేదన్నారు. శంకుస్థాపన చేసిన చోటే ఆయా పనుల పూర్తి వివరాలు ఉంటాయని తెలిపారు. పూర్తి పారదర్శకతతో పనులు జరగాలన్నది తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు. పవన్ ఇంకా ఏం చెప్పారంటే..
విధ్వంసం కళ్లముందే..!
ప్రతిసారీ గత ప్రభుత్వాన్ని విమర్శించాలనుకోను. కానీ ఆ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం మాత్రం కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. గత సర్కారు విధానాలు ఎలాఉన్నాయి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయో ప్రజలకు చెప్పాలి.. అందుకే పోలిక తప్పడం లేదు. వైసీపీ హయాంలో కనీసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో కూడా తెలియని దౌర్భాగ్యం ఉండేది. అసలు పంచాయతీరాజ్ నిధులు ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితి. నేను ఈ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక సార్లు సమీక్షించినా నిధులు ఎలా, ఎటు వెళ్లాయనేది బ్రహ్మపదార్థంలా మిగిలిపోయింది. కాకినాడలో ఓ అటవీశాఖ అధికారి నా పేరు ఉపయోగించి చేస్తున్న కొన్ని పనులు నా దృష్టికి ప్రజలే తీసుకొచ్చారు. వెంటనే దీనిపై విచారించాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించాను. వచ్చిన ఆరోపణలు రుజువైతే సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడేది లేదు. అలాంటి అధికారుల అవసరం ఈ ప్రభుత్వానికి లేదు.
రాష్ట్రవ్యాప్తంగా పల్లెపండుగ
అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): గ్రామ సీమల్లో మళ్లీ సిమెంటు రోడ్ల పండుగ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 3 వేల కి.మీ సిమెంట్ రోడ్ల నిర్మాణానికి సోమవారం వేడుకగా భూమి పూజలు జరిగాయి. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ.. తమ కార్యక్రమాలన్నీ వదిలేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో సిమెంట్ రోడ్లకు భూమిపూజ చేశారు.
మోదీ ఫోటో ఉండాల్సిందే!
పల్లె పండుగ వారోత్సవాలకు సంబంధించిన ప్రతి ఫ్లెక్సీ, వాల్‌పెయింట్, సిటిజన్ నాలెడ్జ్ బోర్డులపై కచ్చితంగా మోదీ, సీఎం చంద్రబాబు, రాష్ట్రప్రభుత్వ అధికార చిహ్నం, పంచాయతీరాజ్ శాఖ లోగో, ఉపాధి పథకం లోగో ఉండాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
ముందు బాధ్యత.. ఆ తర్వాతే వినోదం
ముందు మన కడుపు నిండాలని.. ఆ తర్వాతే వినోదమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. ఆయన మాట్లాడుతుండగా ప్రజలు పెద్దఎత్తున ఓజీ ఓజీ అంటూ నినదించారు. దీంతో ఆయన తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి తర్వాత మాట్లాడారు. ‘మనకు వినోదం, సినిమా అవసరం.. నాకు అర్థమైంది.. చాలా కాలంగా మీరు ఓజీ ఓజీ అంటుంటే నాకు మోదీ... మోదీ అని వినిపించేది. మనం ఈ పల్లె పండుగ ఎందుకు చేస్తున్నామో మీకు తెలుసా? రేపు మీరు సినిమాకు వెళ్లాలి.. అలా వెళ్లాలంటే వాటికి డబ్బులు పెట్టాలి. ముందు మీ కడుపు నిండాలి. రోడ్లు బాగు చేసుకుందాం, స్కూల్స్ బాగు చేసుకుందాం, ముందు బాధ్యత నెరవేరుద్దాం. ఆ తర్వాత వినోదం. మీరు సినిమాకు వెళ్లినా రోడ్లు బాగుండాలి కదా’’ అన్నారు.