Share News

బాధితుల సమస్యలు విన్న పవన్‌

ABN , Publish Date - Jul 30 , 2024 | 03:13 AM

సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు.

బాధితుల సమస్యలు విన్న పవన్‌

జనసేన కార్యాలయానికి పోటెత్తిన వైసీపీ బాధితులు

అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి తమ సమస్యలు చెప్పుకొనేందుకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్దకు సోమవారం భారీగా బాధితులు తరలివచ్చారు. దీంతో డిప్యూటీ సీఎం నేరుగా వారి వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ నాయకుల కబ్జాలు, గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ఒప్పంద ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు తమకు న్యాయం చేయాలంటూ వినతిపత్రాలు సమర్పించారు. సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడతానని పవన్‌ హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్‌ విధానంలో పని చేస్తున్న స్టాఫ్‌ నర్సులను రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలని, కాంట్రాక్ట్‌ నర్సింగ్‌ ఉద్యోగులకు బీమా సదుపాయం కల్పించడంతో పాటు పరస్పర అంగీకార బదిలీలు అమలు చేయాలని పలువురు కోరారు. వైసీపీ నాయకులు తమ ఎకరన్నర భూమిని కబ్జా చేసి సగానికిపైగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం భావరాజుపాలెంకు చెందిన కృష్ణవేణి తెలిపారు. తమ కుమారుడిని స్నేహితులే హత్య చేసి రోడ్డు మీద పడేయగా, పోలీసులు అనుమానస్పద మృతిగా నమోదు చేసి, కేసు క్లోజ్‌ చేశారని చోడవరానికి చెందిన సోమాదుల కృప డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. తమకు సొంత ఇళ్లు లేదని, రేషన్‌ కార్డు లేదని, ఒంటరి మహిళ పెన్షన్‌ రావడం లేదని, వెంటనే ఇప్పించాలని పలువురు మహిళలు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 30 , 2024 | 08:21 AM