Share News

పట్టాభి గాంధీగిరి!

ABN , Publish Date - Jun 06 , 2024 | 04:02 AM

తనను అన్యాయంగా అరెస్టు చేసి, చిత్రహింసలు పెట్టిన ఐపీఎస్‌ అధికారి ఇంటికి వెళ్లి టీడీపీ నేత పట్టాభి గాంధీగిరి ప్రదర్శించారు.

పట్టాభి గాంధీగిరి!

అరెస్టు చేసిన ఐపీఎస్‌ ఇంటికి వెళ్లిన టీడీపీ నేత

అప్పటికే బయటకు వెళ్లిపోయిన ఎస్పీ జాషువా

విజయవాడ, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): తనను అన్యాయంగా అరెస్టు చేసి, చిత్రహింసలు పెట్టిన ఐపీఎస్‌ అధికారి ఇంటికి వెళ్లి టీడీపీ నేత పట్టాభి గాంధీగిరి ప్రదర్శించారు. ఆయన ఇంటిలో లేకపోవడంతో ఇంటి ఆవరణలో ఉన్న కుర్చీలో పుష్పగుచ్ఛం, శాలువా పెట్టి వచ్చారు. వివరాలివీ.. జగన్‌ ప్రభుత్వంలో పి.జాషువా కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసిన సమయంలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని అరెస్టు చేసి, అర్ధరాత్రి వేళ తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఈ ఘటనను పట్టాభి గుర్తుకు తెచ్చుకున్నారు. తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌ రోడ్డులో ఉన్న ఆయన ఇంటికి పట్టాభి విజయవాడ నుంచి బుధవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. అప్పటికే జాషువా బయటకు వెళ్లిపోయారు. ఇంటి ఆవరణలో పట్టాభి మాట్లాడుతుండగా చిత్రీకరించిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అయ్యింది. 2023 ఫిబ్రవరి 20వ తేదీన తనను అక్రమంగా అరెస్టు చేసి తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారని పట్టాభి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అర్ధరాత్రి విద్యుత్‌ తీసేసి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి రాచమర్యాదలు చేశారని తెలిపారు. తనకు చేసిన రాచమర్యాదలకు మెచ్చుకుని పుంగనూరు పుడింగి చిత్తూరు జిల్లాలో పోస్టింగ్‌ వేయించారని పేర్కొన్నారు. ఈ కుట్రలు తెలిసి ఎన్నికల సంఘం ఆయనను విధుల నుంచి తప్పించిందన్నారు. ఆయన విజయవాడ సమీపంలో ఏడున్నర ఎకరాల విలాసవంతమైన అతిథిగృహంలో ఉన్నారని తెలుసుకుని ఇక్కడికి వచ్చానని పట్టాభి తెలిపారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఫోన్‌ చేస్తే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చిందని, తనకు చేసిన మర్యాదలకు సత్కరించడానికి ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో కుర్చీలో పుష్పగుచ్ఛం, శాలువాను పెట్టినట్టు చెప్పారు. తమ ప్రభుత్వంలో ఇలాంటి అధికారులను ఎలా సత్కరించాలో తెలుసునని చెప్పారు.

Updated Date - Jun 06 , 2024 | 04:02 AM