Share News

అద్దంకిలో పల్నాడు జిల్లా ఓట్లు!

ABN , Publish Date - Mar 09 , 2024 | 02:19 AM

Palanadu district votes in Addanaki!

అద్దంకిలో పల్నాడు జిల్లా ఓట్లు!

ఓటరు నమోదులో చిత్ర విచిత్రాలు

ఎమ్మెల్యే రవికుమార్‌ ఫిర్యాదుతో గుట్టు రట్టు

నివేదిక కోరిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

అద్దంకి, మార్చి 8: రాష్ట్రంలో ఓట్ల నమోదులో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పల్నాడు జిల్లాకు చెందిన వారి ఓట్లు నమోదయ్యాయి. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం రట్టయింది. అసలేం జరిగిందంటే... వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం దొడ్లేరుకు చెందిన పాణెం హనిమిరెడ్డిని గత డిసెంబరులో నియమించారు. ఈనేపథ్యంలో దొడ్లేరుకు చెందిన హనిమిరెడ్డి కుటుంబసభ్యులు, బంధువులకు చెందిన 19 మంది ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా అద్దంకి నియోజకవర్గంలో ఓటర్లుగా చేర్చించారు. దీనిపైనే ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై మూడు రోజుల్లో నివేదిక అందజేయాలని స్థానిక అధికారులను ఎన్నికల ప్రధానాధికారి ఆదేశించారు. ఆమేరకు గతనెల 29వ తేదీన ఉత్తర్వులు అందాయి. కానీ ఇప్పటి వరకూ నివేదిక పంపలేదు. అందుకు కారణం ఏమిటని పలువురు టీడీపీ నేతలు... రాజకీయ పార్టీలతో ఈసీ గురువారం జరిపిన సమావేశంలో ప్రశ్నించారు. ఆలస్యం చేస్తే మరోసారి ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్లడంతోపాటు కోర్టును కూడా ఆశ్రయించేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఓట్ల చేర్పులకు ప్రధాన మూలం అయిన ఆధార్‌కార్డు మార్పునకు ఇద్దరు అధికారులు బాధ్యులుగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే నివేదిక అందజేయాల్సి రావటంతో వారిలో వణుకు మొదలైనట్లు తెలుస్తోంది.

బాబ్బాబ్బాబు..

ఎమ్మెల్యే రవికుమార్‌ను సదరు ఇద్దరు అధికారులు చిలకలూరిపేట వెళ్లి కలిసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించాలని ప్రాధేయపడినట్లు సమాచారం. అన్ని విషయాల్లో చూసీచూడనట్లు వెళ్లే ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌... ఈవిషయంలో మాత్రం ఒకింత కఠినంగానే వ్యవహరించినట్లు సమాచారం. ‘ఉద్యోగాలు పోతాయని చెబుతున్నారు. అలాంటప్పుడు తప్పుచేసే ముందు ఆలోచించాలి కదా...’ అని తనను కలిసిన వారితో ఆయన ఉన్నట్లు తెలిసింది. ఓట్ల నమోదులో గోల్‌మాల్‌పై స్వయంగా ఫోన్‌ చేసినా ఇదే అధికారులు అప్పట్లో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేసినట్టు సమాచారం. సరిగ్గా నివేదిక ఇవ్వాలని, మరోసారి తప్పు చేస్తే మరికొన్ని ఆధారాలతో మరోసారి ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని వారిని ఆయన హెచ్చరించినట్టు సమాచారం.

బీఎల్‌వోలపై సీరియస్‌

విషయం తెలుసుకున్న మిగిలిన అధికారులు...ప్రస్తుతం తమకు అందుతున్న ఫాం7లు, సెల్ఫ్‌ ఫాం7ల విచారణలో అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే అందిన దరఖాస్తులపై విచారణ సక్రమంగా చేయనట్లు గుర్తించిన ఉన్నతాధికారులు....బీఎల్‌వోలపై సీరియస్‌ అయినట్లు సమాచారం. వైసీపీ శ్రేణుల ఒత్తిడికి తలొగ్గి చేసిన తప్పులు ఇప్పుడు, తమ మెడకే చుట్టుకునే పరిస్థితులు రావడంతో పలువురు అధికారుల్లో ఆందోళన మొదలైంది. తప్పుచేసిన అధికారులకు ఒకసారి శిక్షపడే విధంగా చేస్తే మిగిలిన వారు భయపడతారని, అలా కాకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తే మరిన్ని అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని పలువురు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Mar 09 , 2024 | 07:32 AM