కళ్లాల్లో ధాన్యం రాశులు.. రైతుల ఆందోళన
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:49 AM
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో వీస్తున్న గాలులకు, వర్షానికి ఖరీఫ్ వరి మాసూళ్లకు ఆటకం ఏర్పడింది.
ముమ్మిడివరం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో వీస్తున్న గాలులకు, వర్షానికి ఖరీఫ్ వరి మాసూళ్లకు ఆటకం ఏర్పడింది. నాలుగు రోజులుగా ఆకాశం మేఘావృతమై గాలలు వీస్తున్నప్పటికీ శుక్రవారం మధ్యాహ్నం నుంచి మాత్రమే వర్షం జల్లులు ప్రారంభమయ్యాయి. దీంతో రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. యంత్రాలతో వరి కోతలు పూర్తిచేసిన రైతులు ధాన్యం రాశులను ఒబ్బిడి చేసుకుంటున్నారు. తుఫాన్ దృష్ట్యా వరి మాసూళ్లను నాలుగు రోజులు వాయిదా వేసుకోవాలని వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు సూచించినప్పటికీ వాతావరణంలో పెద్దగా మార్పులు లేకపోవడంతో వరి చేలు కోత దశకు చేరుకోవడంతో వీస్తున్న గాలులకు వరి నేలనంటే ప్రమాదం ఉందని రైతులు వరి కోతలు ప్రారంభించారు. ధాన్యం రాశులు ఎక్కడికక్కడే కళ్లాల్లో ఉన్నాయి. జిల్లాలో 1,57,812ఎకరాల్లో వరి సేద్యం కాగా ఇప్పటి వరకు 98,400 ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. ఎక్కువ మంది యంత్రాల ద్వారానే కోతలు పూర్తి చేశారు. వీటికి సంబంధించి 2.46లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా 1.10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిగతా 1.36లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కళ్లాల్లో రాశుల రూపంలో ఉంది. ఇంకా జిల్లాలో 59,800 ఎకరాల్లో వరి కోత దశకు చేరుకుంది. వరి పంట కోతకు వచ్చే సమయంలో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో నాట్లు ఆలస్యంగా వేయడంతో వరి పంట ఆలస్యంగా పంట దశకు వచ్చింది. ఆయా మండలాల పరిధిలో వరి కోతలు పూర్తి కాలేదు. తుఫాన్ కారణంగా ప్రస్తుతం వీస్తున్న గాలలు, వర్షాలకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.