Share News

మన యుద్ధం రాక్షసులతో!

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:08 AM

మనం రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థులతో అన్నారు. ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లాలని సూచించారు.

మన యుద్ధం రాక్షసులతో!

సానుభూతితో గెలిచేందుకు జగన్‌ యత్నం: బాబు

ఐదేళ్లలో ఏం చేశాడో చెప్పుకోలేక డ్రామాలు

చీకట్లో గులకరాయి దాడి చేశానంటూ

నాపై తప్పుడు ప్రచారం బొండా ఉమను ఇరికించే కుట్ర

జనం ఛీత్కరిస్తున్నారు

పెన్షన్ల పంపిణీపైనా విషప్రచారం

ప్రజలు, శ్రేణుల అభీష్టం మేరకే అభ్యర్థులను ఎంపిక చేశాం

గెలిచి అసెంబ్లీకి రండి

ప్రచారానికి ఇంకా 20 రోజులే

సంకల్పంతో ముందుకెళ్లాలి

3 పార్టీల మధ్య సమన్వయంతో ఓట్ల బదిలీ జరగాలి: చంద్రబాబు

అభ్యర్థులకు బీఫారాల అందజేత

వారితో ప్రతిజ్ఞ చేయించిన బాబు

అమరావతి/మంగళగిరి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): మనం రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థులతో అన్నారు. ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లాలని సూచించారు. ‘లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పడంలో జగన్‌ నేర్పరి. ప్రతిసారీ సానుభూతితో గెలవాలని చూస్తున్నాడు’ అని మండిపడ్డారు.ఆదివారమిక్కడ ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ తరఫున లోక్‌సభ, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు ఆయన బీఫారాలు అందించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెట్టి అన్ని జిల్లాల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలో ఏం చేశాడో చెప్పుకోలేక జగన్‌ డ్రామాలకు తెరతీస్తున్నాడని విమర్శించారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు రూ.43 వేల కోట్లు అక్రమంగా సంపాదించారని సీబీఐ నిర్ధారిస్తే.. దానిని నిరూపించుకోకుండా తనపై అక్రమ కేసులు పెట్టారని ప్రచారం చేసుకుంటున్నాడని ధ్వజమెత్తారు. ‘ఆయన బస్సుయాత్రలో వాళ్లే కరెంటు తీసేసుకున్నారు. చీకట్లో నేను గులకరాయి దాడి చేయించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఘటన జరిగిన కొద్ది క్షణాలకే ప్లకార్డులు పట్టుకుని వచ్చి ధర్నాలు చేశారు. రాయి విసిరాడంటున్న వ్యక్తితో బొండా ఉమామహేశ్వరరావు ప్రమేయం ఉందని చెప్పించేందుకు కుట్రలు చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీకి నిధుల్లేకుండా చేశారు. కానీ వలంటీర్లతో పంపిణీ చేయొద్దనడంతోనే పెన్షన్లు ఆగిపోయాయని విషప్రచారం చేశారు. జగనే అందరినీ అంతం చేయడానికి ప్రయత్నిస్తూ.. తనను అంతం చేయడానికి వస్తున్నారంటూ ఎదుటివారిపై బురదజల్లుతున్నారు. అమరావతి, పోలవరాన్ని విధ్వంసం చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు’ అని విరుచుకుపడ్డారు.

‘ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి’

బీఫాం పొందిన ప్రతి ఒక్కరూ గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. ‘రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలన్నదే మన నినాదం. మూడు పార్టీల మధ్య సమన్వయం ఉండాలి. ఓటు బదిలీ జరగాలి’ అని ఉద్బోధించారు. తాను ఇప్పటికి 40కి పైగా ప్రజాగళం సభలు నిర్వహించానని, పవన్‌ కల్యాణ్‌తోనూ కలిసి సభలు నిర్వహించానని గుర్తుచేశారు. అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

147 మంది అభ్యర్థులు హాజరు

జనసేన, బీజేపీలతో పొత్తుల కారణంగా 144 అసెంబ్లీ స్థానాల్లో, 17 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ పోలీచేస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో 17 మంది ఎంపీ అభ్యర్థులూ ఉండవల్లి వచ్చి తొలుత బీ ఫారాలు తీసుకున్నారు. అసెంబ్లీ అభ్యర్థుల్లో 144 మందికిగాను 130 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 14 మంది గైర్హాజరయ్యారు. అనపర్తి టికెట్‌తో ముడిపడి ఉండడం.. తంబళ్లపల్లె, దెందులూరు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయకపోవడంతో వారిని పిలవలేదు. మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకేశ్‌ కూడా చంద్రబాబు నుంచి బీ ఫారం స్వీకరించి, తండ్రి కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

Updated Date - Apr 22 , 2024 | 04:08 AM