Share News

30 వరకు వివేకా హత్య ఊసెత్తవద్దు

ABN , Publish Date - Apr 19 , 2024 | 03:54 AM

వివేకా హత్య కేసుపై ఈ నెల 30 వరకు బహిరంగంగా ప్రస్తావించరాదని ప్రతిపక్షాల నేతలను కడప జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో పెండింగ్‌లో ఉండగా.. వివేకాను ఎంపీ, వైసీపీ లోక్‌సభ అభ్యర్థి వైఎస్‌ అవినాశ్‌రెడ్డి చంపారంటూ పీసీసీ

30 వరకు వివేకా హత్య ఊసెత్తవద్దు

షర్మిల, సునీత, బాబు, లోకేశ్‌కు కడప జిల్లా కోర్టు ఆదేశం

పురందేశ్వరి, పవన్‌, రవికీ పార్టీల అభ్యర్థులు, శ్రేణులనూ నియంత్రించాలని మధ్యంతర ఉత్తర్వులు

కడప(రూరల్‌), ఏప్రిల్‌ 18: వివేకా హత్య కేసుపై ఈ నెల 30 వరకు బహిరంగంగా ప్రస్తావించరాదని ప్రతిపక్షాల నేతలను కడప జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో పెండింగ్‌లో ఉండగా.. వివేకాను ఎంపీ, వైసీపీ లోక్‌సభ అభ్యర్థి వైఎస్‌ అవినాశ్‌రెడ్డి చంపారంటూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, సునీత, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, మాజీ ఎమ్మెల్సీ ఎం.రవీంద్రనాథరెడ్డి (బీటెక్‌ రవి) ఆరోపణలు చేస్తున్నారని.. వారీ ప్రస్తావన తేకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు కొత్తమద్ది సురేశ్‌బాబు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కడప జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.శ్రీదేవి 16న పైఉత్తర్వులు జారీచేశారు. వివేకా హత్య కేసులో సీఎం జగన్డ్‌, అవినాశ్‌రెడ్డిపై 30వరకు ఎలాంటి ఆరోపణలు చేయవద్దని.. వారేగాక వారి పార్టీల శ్రేణులు, అభ్యర్థులను కూడా నియంత్రించాలని నిర్దేశించారు. వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో ఉన్న వివరాలు కూడా తొలగించాలని ఆదేశించారు. తదుపరి విచారణను 30కి వాయిదా వేశారు. ‘వివేకా హత్య కేసు నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణలో ఉంది. ప్రస్తుతం కోడ్‌ అమలులో ఉంది. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని ప్రకటించారు. పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్మోహన్‌రెడ్డి పోటీ చేయనున్నారు. వీరిద్దరిపై పై ఏడుగురూ పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ఈ నెల నుంచి 7వరకు జరిగిన పలు రాజకీయ సమావేశాల్లో వైఎస్‌ షర్మిల, డాక్టర్‌ సునీత, చంద్రబాబు, లోకేశ్‌, పురందేశ్వరి, పవన్‌ కల్యాణ్‌, ఎం.రవీంద్రనాథరెడ్డి.. పదేపదే అవినాశ్‌రెడ్డే హత్య చేయించాడంటూ ఆరోపణలు చేశారు. కోర్టులో ఉన్న అంశంపై బహిరంగంగా మాట్లాడడం నిబంధనలకు విరుద్ధం. పైగా ఇప్పుడు కోడ్‌ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో వారు వివేకా హత్య గురించి బహిరంగంగా ప్రస్తావించకుండా ఆదేశాలివ్వండి’ అని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు ఎం. నాగిరెడ్డి, కేఎస్‌ సుదర్శన్‌రెడ్డి కోర్టును కోరారు.

Updated Date - Apr 19 , 2024 | 03:54 AM