Share News

‘ఓర్‌’ మాస్‌ దోపిడీ

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:24 AM

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో 3143.02 ఎకరాల్లో ఐరన్‌ ఓర్‌ (మాగ్నటైడ్‌-అయస్కాంత విలువ కలిగినది) ఉంది.

‘ఓర్‌’ మాస్‌ దోపిడీ

నిన్న బీచ్‌శాండ్‌.. ఇప్పుడు ఐరన్‌ ఓర్‌ జగన్‌ సమర్పించు భారీ దోపిడీ టెండర్‌

మొన్న బీచ్‌శాండ్‌...ఇప్పుడు ఐరన్‌ఓర్‌. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థను (ఏపీఎండీసీ) ముంచేసి, ఓ కార్పొరేట్‌ క ంపెనీని లాభాల్లో ముంచె త్తేలా జగన్‌ సర్కారు మరో స్కీమ్‌కు రూపకల్పన చేసింది. ఐరన్‌ఓర్‌ను తవ్వి, శుద్ధిచేసి హైగ్రేడ్‌గా మార్చి అమ్మేందుకు సంయుక్త భాగస్వామి ఎంపిక కోసం టెండర్లు పిలవాలనుకుంటోంది. ఇందుకోసం జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ఏర్పాటు చేయాలనుకుంటోంది. ప్రైవేటు భాగస్వామి ఎంపిక కోసం ముసాయిదా టెండర్‌ డాక్యుమెంట్‌ను సిద్ధం చేసింది. ఇదంతా కార్పొరేట్‌కు దోచిపెట్టేందుకే...అని ఆ డాక్యుమెంట్‌లోని అక్షరాలు స్పష్టం చేస్తున్నాయి. అదేమిటో మీరే చదవండి..

ప్రకాశం జిల్లాలో 3143 ఎకరాల్లో ఐరన్‌ ఓర్‌

ఏడాదికి 5 మిలియన్‌ టన్నుల తవ్వకం, అమ్మకం

ఏపీఎండీసీ యజమాని.. భాగస్వామి కోసం వేట

దీనికోసం జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ఏర్పాటు

ఎండీసీకి 11ు వాటా ఇస్తే చాలు..

మిగతా 89 శాతం ప్రైవేటుకు ఇచ్చేందుకు ఓకే

కేంద్ర ప్రభుత్వ మైనింగ్‌ చట్టాలకు తూట్లు

వైఎస్‌ హయాంలోనే ఏపీఎండీసీకి 51 శాతం

జిందాల్‌కు దోచిపెట్టడానికే.. : నిపుణుల ఆగ్రహం

న్యాయకమిషన్‌ ఆమోదానికి ఐరన్‌ ఓర్‌ ఫైలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో 3143.02 ఎకరాల్లో ఐరన్‌ ఓర్‌ (మాగ్నటైడ్‌-అయస్కాంత విలువ కలిగినది) ఉంది. ఇందులో 1307.26 ఎకరాల్లోని మైన్‌ను ఏపీఎండీసీకి అప్పగించారు. సంవత్సరానికి కనీసం 5 మిలియన్‌ టన్నుల ఐరన్‌ ఓర్‌ను తవ్వొచ్చు. ఇందులో అయస్కాంత విలువ కలిగిన మినరల్‌ ఉంది. నిజానికి 27 శాతమే ముడి ఇనుము ఉంటుంది. కాబట్టి దాన్ని శుద్ధిచేసి హైగ్రేడ్‌ ముడి ఇనుముగా మార్చి అమ్మాలి. 2004లోనే ఈ లీజుకు సర్కారు అనుమతి ఇచ్చింది. 2009లోనే ఒంగోలు ఐరన్‌ఓర్‌ మైనింగ్‌ కంపెనీని ఏర్పాటు చేసి జింపెక్స్‌ అనే కంపెనీనీ జాయింట్‌ వెంచర్‌ భాగస్వామిగా ఎంపిక చేసింది. ఇందులో ఏపీఎండీసీకి 51 శాతం, మిగతాది జింపెక్స్‌కు ఉండేలా ఒప్పందం కుదిరింది. దీనిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో విషయం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ప్రాజెక్టు ఆగిపోయింది. చివరకు న్యాయపోరాటం నుంచి 2019లో ఎంఎ్‌సపీఎల్‌ తప్పుకొంది. తర్వాత ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తుందనుకున్నారు. కానీ అనూహ్యంగా జగన్‌ సర్కారు ఇనుప ఖనిజం ఉన్న భూములను పేదలకు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుపై ఒంగోలు మైనింగ్‌ కంపెనీ హైకోర్టుకు వెళ్లగా, ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు నిలుపుదల చేసింది. దీంతో జింపెక్స్‌ కంపెనీనే మైనింగ్‌ చేపట్టాలి. కానీ ఆ కంపెనీ సైలెంట్‌గా తప్పుకొంది.

పెద్దల ప్లాన్‌...

ఐరన్‌ఓర్‌ ప్రాజెక్టును జిందాల్‌ అనే బడా కార్పొరేట్‌ కంపెనీకి ఇవ్వాలని జగన్‌ సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఓ ముఖ్యనేత కొద్దిరోజుల క్రితం మీటింగ్‌ ఏర్పాటు చేశారు. దాని తర్వాత జింపెక్స్‌ తప్పుకొన్నట్లు తెలిసింది. పాత జాయింట్‌ వెంచర్‌ కంపెనీ స్థానంలో కొత్తసంస్థను ఏర్పాటు చేయాలని, జేవీ భాగస్వామి కోసం టెండర్లకు వెళ్లాలని పెద్దలు ఆదేశించినట్లు తెలిసింది. దరిమిలా ఏపీఎండీసీ... శరవేగంగా ముసాయిదా టెండర్‌ డాక్యుమెంట్‌ను తయారు చేసింది. దాన్ని న్యాయకమిషన్‌ ఆమోదం కోసం పంపించింది. ఐరన్‌ మైనింగ్‌ చేసేంత శక్తిసామర్ధ్యాలు ఏపీఎండీసీకి లేవు. కాబట్టి ప్రైవేటు భాగస్వామితో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేయాలి. ఇదేమీ తప్పుకాదు. అయితే, ఎవరికి ఎంత వాటా ఉండాలన్నదాంట్లోనే ఏపీఎండీసీతో తప్పటడుగులు వేయించారు. కేంద్ర మైనింగ్‌ చట్టం(ఎంఎండీఆర్‌)-1956 ప్రకారం ఏపీఎండీసీకి 76 శాతంపైనే వాటా ఉండాలి. మిగతాది ప్రైవేటుకి ఇవ్వాలి. అలా కాదనుకుంటే, ఏపీఎండీసికి 51 శాతంపైన వాటా ఉండాలి. కానీ, ఐరన్‌ఓర్‌ జేవీసీ విషయంలో ఏపీఎండీసికి కేవలం 11 శాతం వాటా ఉంటుందని ప్రతిపాదించారు. మిగతా 89 శాతం ప్రైవేటుకు ఇస్తారన్నమాట. ఇది కేంద్ర మైనింగ్‌ చట్టాలకు పూర్తి విరుద్దం. వైఎస్‌. రాజశేఖర రెడ్డి హయంలో జరిగిన ఒప్పందంలో ఐరన్‌ఓర్‌ తవ్వకాల కోసం ఏర్పాటుచేసిన జేవీసీలో ఏపీఎండీసీకి 51 శాతం వాటా అని నిర్ధారించారు. ఇప్పుడు జగన్‌ పాలనలో ఏపీఎండీసీకి 11 శాతం వాటా చాలని, ప్రైవేటుకు మాత్రం 89 శాతం ఇవ్వాలని నిర్ధారించారు. మొన్నటి మొన్న బీచ్‌శాండ్‌ డెవలపర్‌ టెండర్లలో ఏపీఎండీసీకి 8 శాతం, ప్రైవే టు భాగస్వామికి 92 శాతం వాటా అని టెండర్లు పిలిచారు. హైకోర్టు ఆదేశాలతో ఆ టెండర్‌ నిలిచిపోయింది. ఇప్పుడు ఐరన్‌ఓర్‌ జేవీసీ ముసాయిదా డాక్యుమెంట్‌లో 11 శాతం వాటా ఏపీఎండీసీకి ఉంటుందని ప్రతిపాదించారు.

కార్పొరేట్‌ కోసమే..

టంగుటూరు మండలం కొణిజేడు, మర్లపాడు, సర్విరెడ్డిపాలెం, కండలూరు, ఎర్రజెర్ల, టంగుటూరులోని 1307 ఎకరాల పరిధిలోని భూముల్లో ఐరన్‌ ఓర్‌ నిక్షేపాలున్నాయి. ప్రాసె్‌సచేసి, హైగ్రేడ్‌ ముడిఇనుముగా మార్చడానికి బెనిఫిసికేషన్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలి. మైనింగ్‌తోపాటు, హై గ్రేడ్‌ ఇనుమును తయారుచేసి అమ్మే బాధ్యత ఈ జాయింట్‌ వెంచర్‌ కాంట్రాక్టులో ఉంది. ఏటా 5 మిలియన్‌ టన్నుల ఐరన్‌ఓర్‌ తవ్వితీయాలి. ఏటా 1.5 లక్షల టన్నుల ప్రాసెస్‌ ప్లాంటు నిర్వహణ ఉండాలి. జేవీసీలో భాగస్వామిగా ఉండే కంపెనీకి ఏడేళ్ల వ్యవధిలో (వరసగా నాలుగేళ్లు) 680 కోట్ల టర్నోవర్‌ ఉండాలన్న నిబంధన విధించారు. ఆ కంపెనీ వరుసగా నాలుగేళ్లుగా 250 కోట్ల నెట్‌వర్త్‌ కలిగి ఉండాలని, చేతిలో 45 కోట్ల నగదు ఉండాలని చేర్చారు. టెండర్‌ దక్కించుకునే సంస్థ ఈఎండీగా 4.5 కోట్లు, కార్వనిర్వాహణ గ్యారంటీ నిధిగా 45 కోట్లు చెల్లించాలన్న నిబంధన విధించారు. బిడ్‌ డాక్యుమెంట్‌ ఫీజు 5 లక్షలు. 18 శాతం జీఎస్టీతో కలిపితే 5.90 లక్షలు. అయితే, జిందాల్‌ కోసమే ఈ టెండర్‌ పిలిచినట్లుగా ఉందని గనుల శాఖ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Updated Date - Feb 07 , 2024 | 04:24 AM