Share News

ముగ్గురు ఐఏఎస్‌లకు ఓపీఎస్‌!

ABN , Publish Date - Mar 01 , 2024 | 03:11 AM

ఉద్యోగులకు జగన్‌ సర్కారు అడుగడుగునా అన్యాయం చేస్తోందని మరోసారి తేలిపోయింది. ప్రస్తుతం సీపీఎ్‌సలో ఉన్నప్పటికీ కేంద్రం ధ్రువీకరించిన నిబంధనల మేరకు అర్హులైన ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను తాజాగా ఓపీఎస్‌ పరిధిలోకి

ముగ్గురు ఐఏఎస్‌లకు ఓపీఎస్‌!

ఇటీవల గుట్టుగా జీవో విడుదల

10 వేల మందికి పైగా ఉద్యోగులపై

జగన్‌ సర్కారు కాఠిన్యం

అమరావతి, ఫిబ్రవరి 29(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు జగన్‌ సర్కారు అడుగడుగునా అన్యాయం చేస్తోందని మరోసారి తేలిపోయింది. ప్రస్తుతం సీపీఎ్‌సలో ఉన్నప్పటికీ కేంద్రం ధ్రువీకరించిన నిబంధనల మేరకు అర్హులైన ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను తాజాగా ఓపీఎస్‌ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఇటీవల జీవో 2140ను రహస్యంగా జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ఐఏఎస్‌ అధికారులు రేవు ముత్యాలరాజు, కాటమనేని భాస్కర్‌, ప్రవీణ్‌కుమార్‌ ఓపీఎ్‌సలోకి రానున్నారు. ముత్యాలరాజు సీఎంవోలో కార్యదర్శిగా పని చేస్తున్నందుకే ప్రభుత్వం వీరికి ఈ అవకాశం ఇచ్చిందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఓపీఎ్‌సలోకి రావడానికి అర్హులైన ఉద్యోగులు 10వేల మందికి పైగా ఉన్నారని, తమను కూడా పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉద్యోగ సంఘాలతో పది రోజుల క్రితం జరిగిన సమావేశంలోనూ అర్హులైనవారిని ఓపీఎ్‌సలోకి తీసుకొస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఓపీఎస్‌ అమలు కోసం వీరంతా ఏడాదిన్నర నుంచి మొరపెట్టుకుంటున్నారు. అయినా వీరిపట్ల ఏమాత్రం కనికరం చూపని ప్రభుత్వం, ఆ ముగ్గురిని మాత్రమే ఓపీఎస్‌ పరిధిలోకి తీసుకొచ్చింది. కేంద్ర నిబంధనల మేరకు తమను ఓపీఎస్‌ పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ వారు వినతిపత్రాలు ఇచ్చినట్టే, ఉద్యోగుల తరపున ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అనేకసార్లు వినతులు సమర్పించాయి. ప్రభుత్వం వాటిని కనీసం పరిశీలించిన దాఖలాలు కూడా లేవు. ఐఏఎస్‌ అధికారుల సమస్యలు తప్ప, సాధారణ ఉద్యోగుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగులకు నమ్మకద్రోహం

అధికారంలోకి వచ్చిన వారంలోగా సీపీఎస్‌ రద్దు చేస్తానని ఇచ్చిన హామీని సీఎం జగన్‌ తుంగలో తొక్కారు. ఓపీఎస్‌ కోసం పోరాడుతున్న ఉద్యోగులకు అంతకంటే లోపభూయిష్ఠమైన జీపీఎస్‌ విధానాన్ని తెచ్చి ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు వారికి మరింత నమ్మకద్రోహం చేసింది. సీపీఎస్‌ అమలుకు 2003 డిసెంబరు 22 కటాఫ్‌ తేదీ. అ రోజు నాటికి ఖాళీగా ఉన్న పోస్టుల్లో చేరిన ఉద్యోగులకు ఓపీఎస్‌ వర్తిస్తుందని కేంద్రం ధ్రువీకరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మెమో కూడా పంపింది. ఇలాంటి ఉద్యోగులు అందరినీ ఓపీఎస్‌ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశాలిచ్చింది. తమకు జరుగుతున్న అన్యాయాలపై ఉద్యోగులు, ముఖ్యంగా సీపీఎస్‌ ఉద్యోగులు నిరసనలు తెలిపిన ప్రతిసారీ కటాఫ్‌ తేదీ కంటే ముందే వచ్చిన నోటిఫికేషన్‌ ద్వారా లేదా 2003 డిసెంబరు 22 నాటికి ఉన్న ఖాళీల్లో చేరిన ఉద్యోగులను ఓపీఎస్‌ పరిధిలోకి తెస్తామంటూ బూటకపు హామీలిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇలాంటి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో శాఖల వారీగా, కేడర్ల వారీగా వివరాలు పంపాలంటూ ఒక సర్క్యులర్‌ ఇచ్చి ప్రభుత్వం ఒక్క పూట హడావుడి చేస్తుంది. తర్వాత దీని గురించి పట్టించుకొనే నాథుడే ఉండటం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 01 , 2024 | 09:47 AM