త్వరలో ఆపరేషన్ బుడమేరు!
ABN , Publish Date - Sep 16 , 2024 | 03:31 AM
వరదల బారి నుంచి ప్రజలను రక్షించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘ఆపరేషన్ బుడమేరు’
రాష్ట్రవ్యాప్తంగా కాలువలు, చెరువులు ఆక్రమణకు
గురికాకుండా పకడ్బందీ చర్యలువరద ప్రాంతాల్లో
ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి రేపటి నుంచి పరిహారం
బుడమేరు ప్రాంతంలోని ప్రజలకు టిడ్కో ఇళ్లు
‘ఆంధ్రజ్యోతి’తో మంత్రి నారాయణ
అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): వరదల బారి నుంచి ప్రజలను రక్షించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘ఆపరేషన్ బుడమేరు’ ప్రారంభమవుతుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. దీని ద్వారా కాలువలు ఎంత వెడల్పు ఉండాలో.. అంతే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో కాలువలు, చెరువులు ఆక్రమణకు గురి కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. బుడమేరు ప్రాంతంలో ఆక్రమణలను తొలగించి.. అక్కడివారికి టిడ్కో ఇళ్లు ఇచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. సీనియర్ అధికారులు పరిశీలించిన తర్వాత సీఎంకు నివేదిస్తామని.. ఈ నెల 17 నుంచి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రి ఆదివారం తన నివాసంలో ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. విజయవాడలో వరదలు, ప్రభుత్వ సహాయ చర్యలను వివరించారు. అనూహ్య వర్షాలు, వరదతో విజయవాడ నగరంలోని 32 డివిజన్లు ముంపునకు గురయ్యాయని, సుమారు 7 లక్షల మంది ప్రజలు ప్రభావితులయ్యారని తెలిపారు. నగరం మధ్యలో నుంచి వెళ్లే బుడమేరు కాలువకు 11,500 క్యూసెక్కుల నీటి సామర్థ్యం ఉంటే.. 30 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందన్నారు.
‘భారీ వర్షాలకు ఈ కాలువ, కృష్ణానది ఒకేసారి నిండిపోయాయి. ప్రకాశం బ్యారేజీకి మునుపెన్నడూ లేని విధంగా 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సకాలంలో స్పందించడం వల్లనే వందల మంది ప్రాణాలు కాపాడుకోగలిగాం. 10 రోజుల తర్వాత నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. మొదట్లో ఒకట్రెండు రోజులు ప్రజలు అసహనానికి గురైనా.. ఆ తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రజల మన్ననలు పొందింది’ అని చెప్పారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేంద్ర వ్యవసాయ మంత్రితో చర్చించారని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు బ్యాంకుల సాయం తీసుకుని బాధితులకు పరిహారం అందజేస్తామన్నారు. అమరావతి మునిగిపోయిందని వైసీపీ వాళ్లు వదంతులు పుట్టించారని ఆక్షేపించారు. కృష్ణా నదిలో భారీ వరద వచ్చినా.. రాజధాని చెక్కుచెదరలేదన్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రచారాలు చేసి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. కృష్ణా కరకట్ట ఎత్తు పెంచి రోడ్లు నిర్మించేలా మరో 2-3 నెలల్లో టెండర్లు పిలుస్తామన్నారు.
డ్రైనేజీ కాలువలు పూర్తయి ఉంటే..
2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం మున్సిపల్ శాఖ ద్వారా మురుగునీటి ప్రవాహ కాలువలు తీసుకొచ్చిందని, వాటిని వైసీపీ ప్రభుత్వం పూర్తిచేయకపోవడం వల్లే ఇప్పుడీ పరిస్థితి ఏర్పడిందని మంత్రి చెప్పారు. భవన నిర్మాణాలకు గతంలో ఆన్‌లైన్ ద్వారా అనుమతులిచ్చామని.. ఈ విషయంలో అధికారులు 15 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదికలు సిద్ధం చేశారని తెలిపారు. వాటన్నిటినీ క్రోడీకరించి మెరుగైన విధానాన్ని తీసుకొస్తామని, అనుమతుల నిబంధనలు కఠినతరం చేసి ప్రమాదాలను నివారిస్తామని చెప్పారు.