ఉత్త నోటీసులే!
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:04 AM
పట్టణంలోని వైసీపీ కార్యాలయం అక్రమ కట్టడంగా తేలిపోవడంతో హడావుడి చేసిన మునిసిపల్ అధికారులు కేవలం నోటీసు జారీ చేసి మిన్నకుండిపోవడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.

అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ
కార్యాలయంపై అధికారులు వెనకడుగు
ఆదోని టౌన్, జూన్ 26: పట్టణంలోని వైసీపీ కార్యాలయం అక్రమ కట్టడంగా తేలిపోవడంతో హడావుడి చేసిన మునిసిపల్ అధికారులు కేవలం నోటీసు జారీ చేసి మిన్నకుండిపోవడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ప్లాను మంజూరుకు అదనంగా నిర్మించిన కట్టడాలను వెంటనే కూల్చివేసే అధికారులు వైసీపీ కార్యాలయం పూర్తిగా అక్రమ కట్టడంగా బహిర్గతమైనా, కేవలం నోటీసు జారీ చేసి వారి సమాధానం కోసం వేచిచూడడాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తప్పుపడుతున్నారు. అధికారుల అలసత్వాన్ని సహించే ప్రసక్తే లేదని, ప్రజలకు మంచి పాలనను అందించడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అన్నారు. కోర్టు నుంచి స్టే పొందడానికి అధికారులే సహకరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్లాను మంజూరు లేకుండా నిర్మాణం జరుగుతున్న సమయంలో పనులను అడ్డుకోకపోవడంపై విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలలో వైసీపీకు సంబంధించిన పలు అక్రమ కట్టడాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో స్థానిక టీడీపీ నాయకుడు ఉమ్మి సలీమ్, బీజేపీ నాయకులు దేశాయి చంద్రన్న, నాగరాజ్ గౌడ్, స్థానిక ఎస్కేడీ కాలనీలో ఇటీవల నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనంపై ఆరా తీయగా అక్రమ కట్టడంగా బయట పడింది. నాయకులు ఆరోపించే వరకు అధికారులకే ఈ విషయం తెలియకపోవడం వారి బాధ్యతారహిత పనితీరుకు నిదర్శనమంటూ పలువురు విమర్శిస్తున్నారు. ప్లాను మంజూరు లేకుండా నిర్మించిన భవనాన్ని సీజ్ చేస్తామని విలేకరులకు తెలిపిన మునిసిపల్ కమిషనర్, కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చారు. అక్రమ నిర్మాణం జరుగుతున్న సమయంలో నోటీసుల ఇవ్వకుండా కాలయాపన చేసి, నిర్మాణం పనులు పూర్తయిన చాలాకాలానికి విషయం బయటపడటంతో నోటీసులు ఇచ్చారని తప్పుపడుతున్నారు. పట్టణంలో ఇలాంటి మరిన్ని అక్రమ పట్టడాలు జరిగినట్లు తమ వద్ద సమాచారం ఉందని, వాటిపై కూడా ఆరాతీస్తామని టీడీపీ, బీజేపీ నాయకులు తెలిపారు.