Share News

మరోసారి ‘గడప గడపకు...’

ABN , Publish Date - May 03 , 2024 | 04:53 AM

ఒకవైపు సార్వత్రిక ఎన్నికలు ముందుకువస్తున్నాయి. మరోవైపు జగన్‌ సర్కారుపై ప్రజాగ్రహం అంతకంతకూ వెల్లువెత్తుతోంది

మరోసారి ‘గడప గడపకు...’

జగన్‌ పథకాలపై ఇంటింటి ప్రచారం

టైటిల్‌ యాక్టుపై గ్రామాల్లో తిరుగుబాటు

బూత్‌ కమిటీలు తెరపైకి.. మొదలైన ప్రచారం

అమరావతి, మే 2 (ఆంధ్రజ్యోతి): ఒకవైపు సార్వత్రిక ఎన్నికలు ముందుకువస్తున్నాయి. మరోవైపు జగన్‌ సర్కారుపై ప్రజాగ్రహం అంతకంతకూ వెల్లువెత్తుతోంది. దీంతో కొంతయినా ప్రజావ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నంలో వైసీపీ అధిష్ఠానం ఉంది. అందులోభాగంగా బూత్‌ కమిటీలను గడప గడపకు... తిప్పాలని నిర్ణయించారు.

గడచిన 59 నెలలుగా జగన్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించిందంటూ విస్తృతంగా సామాజిక మధ్యమాల్లో, మీడియా చానళ్లలో, ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్న యూట్యూబ్‌ చానళ్లలో వైసీసీ సోషల్‌ మీడియా విభాగం ప్రచారం చేస్తోంది. అయితే.. రాష్ట్రంలో అమలు జరుగుతున్న అరాచక పాలనతో పోల్చితే ఈ ప్రచారం పెద్దగా ప్రజల్లోకి వెళ్లడంలేదు.

ఎన్నికల షెడ్యూల్‌కు ముందు .. పట్టణాలకు మాత్రమే ప్రజా వ్యతిరేకత పరిమితమైందని ప్రభుత్వ పెద్దలు భావించారు.

అయితే.. కోడ్‌ తర్వాత ఈ పరిస్థితి మరింత విస్తరించి, పల్లెలకూ తాకింది. పట్టాదార్‌ పాసుపుస్తకాలపై సీఎం జగన్‌ ఫొటోలు ముద్రించడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆస్తులకు జగన్‌ వారసుడా అంటూ మండిపోతున్నారు. సామాజిక పింఛన్లను పంపిణీ చేయడంలో వరుసగా రెండో నెల కూడా ప్రభుత్వం విఫలం చెందింది.

ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నా, ప్రభు త్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని అవ్వాతాతలు ఆవేదన చెందుతున్నారు.

వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన ప్రకటన వారిపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా మంది వలంటీర్లు రాజీనామా చేయకుండా యథాతథంగా కొనసాగుతున్నారు. దీంతో ఎన్నికల యాజమాన్య వ్యవహారమంతా వలంటీర్ల ద్వారా నడిపిద్దామనుకున్న జగన్‌ వ్యూహం బెడిచికొట్టింది.

ఈ నేపథ్యంలో మరోసారి ‘గడప గడపకు..’ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు. 47,000 బూత్‌ కమిటీలతో గురువారం ఈ కార్యక్రమం ప్రారంభించారు. కమిటీలో పదిమంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీకి ఒక చైర్మన్‌ ఉంటా రు.

వైసీపీ నాయకులెవరూ కమిటీలో లేకుండా జాగ్రత్త పడ్డారు. సామాన్యులుగా, తటస్థులుగా ఉన్నట్టు కనిపిస్తూ, ‘గడప గడపకూ’ బూత్‌ కమిటీ సభ్యులు వెళతారు. సర్కారుపై పెరిగిన వ్యతిరేకతను కొంతైనా తగ్గించేలా... ఇంటింటికీ వెళ్లి జగన్‌ పథకాలపై కుటుంబాల్లోని మహిళల్లో పెద్దఎత్తున ప్రచారం సాగించాలని వైసీపీ పెద్దలు ఆదేశించారు.

Updated Date - May 03 , 2024 | 04:53 AM