Share News

వృద్ధుల ప్రాణాలతో చెలగాటం

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:23 AM

‘సీఎం జగన్‌ బాధ్యతను విస్మరించి శవాలపై రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయ స్వార్థం కోసం వృద్ధుల ప్రాణాలను పణంగా పెడతారా..

వృద్ధుల ప్రాణాలతో చెలగాటం

పెన్షన్‌ డబ్బు బ్యాంకు ఖాతాల్లో వేస్తారా?

అన్ని గ్రామాల్లో బ్యాంకులు ఉన్నాయా?

5-10 కిలోమీటర్లు వెళ్లాలి

గత నెలలో 33 మంది చనిపోయారు

ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలి: చంద్రబాబు

కర్నూలు, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘సీఎం జగన్‌ బాధ్యతను విస్మరించి శవాలపై రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయ స్వార్థం కోసం వృద్ధుల ప్రాణాలను పణంగా పెడతారా..? ఆ అధికారం మీకెవరు ఇచ్చారు..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. వలంటీర్లతో పంపిణీ చేయించొద్దని ఎన్నికల సంఘం చెప్పడం జీర్ణించుకోలేక ప్రభుత్వం వితండవాదంతో రాజకీయం చేస్తోందన్నారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అందరికి ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. సోమవారం కర్నూలు జిల్లా గూడూరు క్యాంప్‌ సైట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో 65.49 లక్షలు పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. 45.92 లక్షల మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయని అంటున్నారు. 25 లక్షల మంది అనారోగ్యంతో ఉన్నారని.. బ్యాంకుల వద్దకు రాలేరని.. వారికి నేరుగా ఇస్తామంటున్నారు. అంతమంది అనారోగ్యంతో ఉన్నారని మీకెలా తెలిసింది? గత నెలలో లేని బ్యాంక్‌ అకౌంట్లు ఇప్పుడెలా వచ్చాయి..? దొంగ రిపోర్టులతో వృద్ధుల పింఛన్ల పంపిణీపై రాజకీయ కుట్ర చేస్తారా..? రాష్ట్రంలో 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, 15 వేల మంది పంచాయతీ కార్యదర్శులు, 5 వేల మంది వెలుగు, మరో ఐదువేల మంది వ్యవసాయ శాఖ, 3 వేల మంది ఉద్యాన శాఖ సిబ్బంది 1.45 లక్షల మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఒక్కొక్కరూ ఒక్క రోజులో 45 పింఛన్లు పంపిణీ చేయవచ్చు. ఎందుకు చేయడం లేదు? స్వార్థ రాజకీయాల కోసం మండుటెండల్లో వృద్ధులను బ్యాంకుల చుట్టు తిప్పుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడతారా..’ అని విరుచుకుపడ్డారు.

ఖాతాలు ఇప్పుడెలా వచ్చాయి?

గత ఘటనలు పునరావృతం కాకుండా పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్‌ కూడా చెప్పిందని, ఆ మాట లెక్కచేయకుండా.. బ్యాంకుల ద్వారా ఎలా ఇస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ‘అధికారులకు ఇళ్లు తెలియవని ఉన్నతాధికారులు చెబుతున్నారు.. మరి గత నెలలోని లేని ఖాతాలు ఇప్పుడెలా వచ్చాయి? వృద్ధుల ఖాతాల్లో పింఛన్‌ వేస్తామంటున్నారు. ఖాతాల్లో డబ్బులు పడ్డాయని వారికెలా తెలుస్తుంది..? అందరి వద్దా సెల్‌ఫోన్లు ఉంటాయా..? అన్ని గ్రామాల్లో బ్యాంకులు ఉన్నాయా..? డబ్బులు తీసుకోవడానికి 5-10 కిలోమీటర్లు వెళ్లాలి. బ్యాంకు సిబ్బంది లేకుంటే పడిగాపులు కాయాలి. 46 డిగ్రీల ఎండల్లో.. మంచి నీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో పండుటాకులను తిప్పడం సమంజసమా..?’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆందోళన వద్దు.. పింఛన్‌ లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని చంద్రబాబు కోరారు. ‘జూన్‌ 4 తర్వాత మన ప్రభుత్వం వస్తుంది.. బకాయితో కలసి ఏప్రిల్‌ 1 నుంచి పెంచిన రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేల పింఛన్లు పంపిణీ చేస్తాం’ అని వెల్లడించారు.

Updated Date - Apr 30 , 2024 | 04:26 AM