కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పణ
ABN , Publish Date - Jul 15 , 2024 | 04:12 AM
హైదరాబాద్‌కు చెందిన భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు ఆదివారం బంగారు బోనం సమర్పించారు.
విజయవాడ (వన్‌టౌన్), జూలై 14: హైదరాబాద్‌కు చెందిన భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు ఆదివారం బంగారు బోనం సమర్పించారు. కమిటీ ఆధ్వర్యంలో జరిగే బంగారు బోనం ఉత్సవాలు ఈ ఏడాదితో 15 వసంతాలు పూర్తి చేసుకున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ కమిటీ సభ్యులకు శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రాహ్మణవీధిలోని జమ్మిదొడ్డి వద్ద ఈవో రామారావు ఘనంగా స్వాగతం పలికారు. దాదాపు వెయ్యిమంది కళాకారులు, శివశక్తులు, పోతురాజుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బ్రాహ్మణవీధి మీదుగా సాగిన ఊరేగింపు దుర్గాఘాట్ వద్ద కృష్ణానదిలో గంగ తెప్పకు పూజచేసి, అనంతరం కొండపైకి చేరుకుంది. పాడిపంటలు పుష్కలంగా పండాలని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వేడుకుంటూ దుర్గమ్మకు బోనం సమర్పించారు.