ఆప్కాస్‌లో ఆక్టోపస్!
ABN , Publish Date - Jul 14 , 2024 | 04:07 AM
తాత్కాలిక ఉద్యోగుల భద్రత కోసం ఏర్పాటుచేసిన ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్(ఆప్కా్‌స) ఓ అధికారికి అప్పనంగా దోచుకునేందుకు కల్పతరువుగా మారింది.
నిధులన్నీ కార్పొరేషన్ ఎండీ జల్సాలకే
జగన్ హయాంలో దొంగ బిల్లులతో సొమ్ములు స్వాహా
కేవలం జిరాక్స్ కాగితాలకే నెలకు 18 లక్షలు
1.14 లక్షల సంస్థ నిధులతో సొంతానికి సెల్‌ఫోన్
ఎండీ ఇంటికి పులస.. రవాణాకే నెలకు 25 వేలు
ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సంక్షేమానికి ఆప్కాస్
కానీ వైసీపీ, జగన్ మనుషుల అడ్డాగా మార్చేశారు
ఆప్కాస్ కమీషన్ల దెబ్బకు బోర్డులు హడల్
ప్రకటించిన నియామక ప్రక్రియ సైతం నిలిపివేత
ఈపీఎఫ్ విషయంలో ఘోర తప్పిదాలు
రూ.10 కోట్లు జరిమానాగా చెల్లించిన వైనం
కొత్త ప్రభుత్వం రావడంతో వెలుగులోకి అక్రమాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
తాత్కాలిక ఉద్యోగుల భద్రత కోసం ఏర్పాటుచేసిన ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్(ఆప్కా్‌స) ఓ అధికారికి అప్పనంగా దోచుకునేందుకు కల్పతరువుగా మారింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఏజెన్సీల దోపిడీకి గురికాకుండా చూస్తామంటూ గత జగన్ ప్రభుత్వం ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది. అయితే, చివరికి.. దీనిని వైసీపీ, అప్పటి సీఎం జగన్ మనుషుల అడ్డాగా మార్చేశారు. ఆప్కాస్ ఎండీ వాసుదేవరావు ఈ సంస్థ పాలిట తిమింగలంగా మారారు. అడ్డగోలు నియామకాలు, కమీషన్ల కక్కుర్తి, నిర్వహణ పేరుతో భారీగా తప్పుడు బిల్లులు పెట్టుకుని నిధులు స్వాహా చేస్తుండటం కార్పొరేషన్‌లో సర్వ సాధారణమైందన్న ఆరోపణలున్నాయి. కొత్త ప్రభుత్వం రావడంతో అప్పటి పాతకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఆప్కా్‌సను ఏర్పాటుచేసిన తర్వాత దానికి ఎండీగా మాజీ మంత్రి బొత్సకు సన్నిహితుడైన వాసుదేవరావును నియమించారు. వాస్తవానికి గతంలో మెడ్‌టెక్‌లో జరిగిన భారీ స్కామ్‌లో ఈయన కీలకంగా ఉన్నారు. కార్పొరేషన్‌ను సొంత జేబు సంస్థగా మార్చుకుని ఆయన ఏటా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నుంచి వస్తున్న ఒక్కశాతం నిర్వహణావ్యయాన్ని రకరకాల బిల్లులు పెట్టుకుని అప్పనంగా భోం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సంస్థగా ఏర్పాటైన ఆప్కా్‌సకు ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడంతో ఇష్టారాజ్యంగా నిధులు దుర్వినియోగమయ్యాయని పేర్కొంటున్నారు. కార్యాలయంలో పూలింగ్ కోసం వాహనం ఏర్పాటు చేశామని చెప్పి ప్రతి నెలా రూ.45 వేలు ఈ సంస్థ ఎండీ బిల్లులు డ్రా చేస్తున్నారు.
ఒక్క నెలలోనే రవాణా ఖర్చుల కోసమంటూ రూ.2,07,892 డ్రా చేశారు. ఈ వాహనాలను ఎన్నికల్లో ప్రచారానికి వాడుకున్నారో? లేక ఎండీ దొంగ బిల్లులు పెట్టి స్వాహా చేశారో తెలియని పరిస్థితి. ఈ కార్యాలయంలో సుమారు 45 మందిని నియమించుకుంటే నిబంధనల ప్రకారం వారిలో కేవలం 18 మందిని మాత్రమే నియమించారు. మిగిలిన వారంతా అడ్డగోలుగా వైసీపీ కార్యకర్తలు, జగన్ ఇంట్లో మనుషులు, విజయసాయిరెడ్డి అనుచరులు, బొత్స మనుషులను నియమించుకున్నారు. నిరుద్యోగికి దక్కాల్సిన ఉద్యోగాలు ఫక్తు రాజకీయ నేతలకు, వ్యాపారవేత్తలకు కట్టబెట్టడం బరితెగింపే! కార్పొరేషన్‌లో జనరల్ మేనేజర్లుగా వీరిని రూ.లక్ష జీతం కట్టబెట్టి నియమించుకున్నారు. వీరిలో ఒకరు రాయలసీమలోని ఓ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సోదరుడు. మరొకరు జగన్ నివాసం లోట్‌సపాండ్‌లో పనిచేసిన వ్యక్తి. సదరు మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఎన్నికల ప్రచారానికి వెళ్లినా, ఎస్సీ, ఎస్టీలను కించపరిచారన్న ఆరోపణలున్నా... ఆయనను కొనసాగించడమే కాకుండా ప్రతి నెలా జీతం ఇచ్చి పోషిస్తున్నారు. లోట్‌సపాండ్‌లో పనిచేసిన జగన్ కుటుంబం అనుయాయుడికి ప్రైవేట్ రీసార్ట్ బిజినెస్ ఉన్నప్పటికీ ఆయనను జనరల్ మేనేజర్‌గా తీసుకున్నారు. తద్వారా ఆప్కా్‌సను పూర్తిగా జగన్ కుటుంబం, వైసీపీ నేతల సొంత కార్పొరేషన్‌గా మార్చేశారని ఆరోపిస్తున్నారు. ఎండీ అనుచరుడితో పాటు మరో ఇద్దరికి విధులకు రాకున్నా ప్రతి నెలా జీతాలివ్వడం ఈ కార్పొరేషన్‌లో జరుగుతోంది. సజ్జల రామకృష్ణారెడ్డి పీఏ భార్యను అవసరం లేకున్నా ఐటీ కన్సల్టెంట్‌గా నియమించుకోవడం విశేషం. ఎన్నికల కోడ్‌ను సైతం ఉల్లంఘించి ఆ సమయంలో నియామకాలు చేపట్టడం గమనార్హం.
ఆప్కాస్ నిధులు జల్సాలకే...
ఆప్కాస్ నిధులతో దొంగ బిల్లులు పెట్టుకుని స్వాహా చేసిన తీరు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. తన సొంత అవసరాలకు వాడుకునే సెల్‌ఫోన్‌లను సైతం ఆప్కాస్ నిధులతో ఎండీ కొనుగోలు చేసి బిల్లులు పెట్టుకున్నారు. అయితే ఆఫీసు కార్యకలాపాలకు కూడా మరో సెల్‌ఫోన్‌ను రూ.1.14 లక్షలకు కొనుగోలు చేసినట్లు బిల్లులు పెట్టారు. లీగల్ కన్సల్టెన్సీ పేరుతో ప్రతి నెలా రూ.45 వేలు డ్రా చేస్తున్నారు. ఏ శాఖలో లేని విధంగా ప్రతి నెలా బెస్ట్ ఎంప్లాయీ పేరుతో తనకు నచ్చిన ఉద్యోగికి రూ.5 వేలు పారితోషికం అందించడం ఈ కార్పొరేషన్‌లోనే చేస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వ పేపర్‌లెస్ అని చెప్తున్నా జెరాక్స్ పేరిట ఈ కార్పొరేషన్ ఎండీ రూ.లక్షలు స్వాహా చేశారు. జెరాక్స్ మిషన్‌లు తెచ్చి 14 లక్షల కాపీలు జెరాక్స్‌లు తీసి సుమారు రూ.8 లక్షల దాకా ఒకే నెలలో ఖర్చు చేశారు. ఫర్నిచర్ కొనరాదని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్ స్పష్టంగా ఉత్తర్వులు జారీచేసినా.. లెక్క చేయకుండా ఎండీ రూ.2 లక్షలకు పైగా దానికోసం ఖర్చు చేశారు. స్వీట్లు, ఇతర ఖర్చుల కోసం రూ.లక్షలు తగలేశారు. ఢిల్లీకి వెళ్లే అవసరం ఎండీకి గానీ, కార్యాలయ సిబ్బందికిగానీ ఉండదు. అయినా ఢిల్లీ విమాన టికెట్లు, ఇతర ఖర్చులు కార్పొరేషన్ నుంచి బిల్లులు పెట్టి లాగేశారు. ప్రతి బిల్లూ అశోకా ట్రావెల్స్ పేరుతో పెట్టడం, కొందరు ఉద్యోగుల పేరుతో క్రెడిట్ కార్డుల నుంచి చెల్లించడం, కార్పొరేషన్ సేవింగ్స్ ఖాతాల నుంచి వారికి పంపించడం నిత్య కృత్యంగా మారింది.
కమీషన్ల దెబ్బకు...
రాష్ట్రంలో పలు శాఖలు అవసరం మేరకు ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించుకోవాలంటే ఎండీకి కమీషన్ సమర్పించుకోవాల్సిందే. లేకపోతే ఆమోదం దొరకదు. ఎస్‌ఎ్‌సబీ బోర్డులో 17 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ వేస్తే 7 వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఆప్కాస్ ఎండీకి కమీషన్ ఇవ్వాల్సి రావడంతో పోస్టుల భర్తీ చేసేందుకు బోర్డు అధికారులు సాహసించలేకపోయారు. కొన్ని పోస్టులు తాను చెప్పిన వాళ్లకు ఇవ్వాలని షరతులు పెట్టడంతో నిష్పాక్షిక నియామకాలు చేపట్టలేమన్న ఆందోళనతో బోర్డు అధికారులు నియామకాలను నిలిపేశారు.
ఈపీఎఫ్ విషయంలో ఘోర తప్పిదాలు....
ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కోసం! అంటే వారికి ప్రతి నెలా ఈపీఎఫ్, ఈఎ్‌సఐ వాటా సకాలంలో సక్రమంగా చెల్లించి. ఠంచనుగా జీతాలు అందేలా చేసేందుకు కార్పొరేషన్ పెట్టారు. అయితే ఈపీఎఫ్ విషయంలో ఆప్కాస్ ఎండీ ఘోర తప్పిదాలకు పాల్పడ్డారు. ప్రతి నెలా సకాలంలో ఉద్యోగుల ఈపీఎఫ్ చెల్లించకపోవడంతో ఇప్పటికే రెండు దఫాలు కార్పొరేషన్.... ఈపీఎఫ్ కార్యాలయానికి జరిమానాగా రూ.10 కోట్లు చెల్లించింది. ఎండీ నిర్లక్ష్యం కారణంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సొమ్ము జరిమానా రూపంలో చెల్లించాల్సి వచ్చింది. మొదట్లో ఈపీఎఫ్ చెల్లించేందుకు కన్సల్టెంట్లను నియమించి నిధులు వృధా చేశారు. వి.ఉదయ్‌కుమార్ అనే ఉద్యోగి జీతం నుంచి కట్ చేసి ఈపీఎ్‌ఫకు జమచేసినట్లు రికార్డులు సృష్టించారు. కానీ, ఈపీఎఫ్ కార్యాలయానికి చెల్లించలేదు. దీంతో ఈపీఎఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఆప్కాస్ ఎండీపై కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆ అధికారి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎండీపై పోలీసులు కేసు నమోదు చేయలేని పరిస్థితి గత ప్రభుత్వంలో నెలకొంది. కార్పొరేషన్ నిర్వహణ తీరుపై పలు ఆరోపణలు చేస్తూ కొందరు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే... అక్కడ సిబ్బందిని మేనేజ్ చేసి కనీసం నోటీసులు కూడా ఇవ్వనీయకుండా పావులు కదిపారని ఉద్యోగులు చెప్పుకుంటున్నారు.
సార్ పులస ముచ్చటకు 25వేలు
ఆప్కాస్ ఎండీ నివాసం వైజాగ్‌లో ఉంది. ఆయన కుటుంబం కోసం అక్కడకు పులస కూర పంపడానికి కార్పొరేషన్ నిధులు ప్రతి నెలా రూ.25 వేలు ఖర్చవుతున్నాయంటే వారి బరితెగింపు ఏ మేరకు ఉందో అర్థమవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో పులసను కొనుగోలు చేసి కూర తయారుచేయించి వైజాగ్‌కు తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా కారును, మనిషిని ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఫీల్డ్ విజిట్ అని పేరుపెట్టారు. ఈ విజిట్ పేరిట ప్రతి దఫా రూ.25 వేలు డ్రా చేస్తున్నారు. అలాగే కార్పొరేషన్ దగ్గర జీతం తీసుకుని ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎండీ వైజాగ్ నివాసంలో పనిచేస్తున్నారు. మరో ఉద్యోగి ఆయన తాత్కాలికంగా ఉంటున్న విజయవాడలోని నివాసంలో పనిచేస్తున్నారు.