Share News

రాష్ట్రంలో అణు బ్రీడర్‌ రియాక్టర్‌!

ABN , Publish Date - May 29 , 2024 | 04:12 AM

దేశంలో రెండో దశ అణు విద్యుత్‌ పథకంలో భాగంగా అణు విద్యుత్‌ ప్లాంట్ల (ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్‌ యూనిట్లు) స్థాపనకు కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తోంది.

రాష్ట్రంలో అణు బ్రీడర్‌ రియాక్టర్‌!

దాని ఏర్పాటుతో ముప్పు లేదు: కేంద్రం

తీరంలో 625 హెక్టార్ల భూమి చాలు.. దానికి దూరంగా వేరే చోటైతే 960 హెక్టార్లు కావాలి

సిబ్బందికి టౌన్‌షి్‌ప కోసం ఇంకో 125 హెక్టార్లు.. సీఎ్‌సకు అణు శక్తి సంస్థ లేఖ

అన్ని రాష్ట్రాల్లోనూ ప్లాంట్ల ఏర్పాటుకు యోచన

అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): దేశంలో రెండో దశ అణు విద్యుత్‌ పథకంలో భాగంగా అణు విద్యుత్‌ ప్లాంట్ల (ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్‌ యూనిట్లు) స్థాపనకు కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తోంది. దీర్ఘకాల విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు వీలుగా రాష్ట్రంలోనూ అణు విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఆలోచన చేయాలని భారత అణు శక్తి సంస్థ సూచించింది. దీని స్థాపనతో ఎలాంటి ప్రమాదమూ ఉండదని తెలిపింది. సౌర, పవన విద్యుత్కేంద్రాల ఏర్పాటుతో ఉద్గారాల ప్రభావం ఎలా ఉండదో.. ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్ల ఏర్పాటుతోనూ అపాయం ఉండదని వెల్లడించింది. ప్రతి రాష్ట్రంలోనూ ఒక బ్రీడర్‌ రియాక్టర్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని.. ఆంధ్రలోనూ ఆ ఆలోచన చేయాలని అణుశక్తి విభాగానికి చెందిన భారతీయ నాభికీయ విద్యుత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ సీఎండీ కేవీ సురేశ్‌కుమార్‌ ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డికి లేఖ రాశారు. సముద్రతీర ప్రాంతంలో 500 మెగావాట్ల అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు కేవలం 625 హెక్టార్లు భూమి అవసరమని పేర్కొన్నారు. అదే సముద్ర తీరానికి దూరంగా ప్లాంటు ఏర్పాటుచేయాలంటే 960 హెక్టార్లు సేకరించాలని తెలిపారు. రాష్ట్రానికి తీర ప్రాంతం ఉన్నందున సానుకూలంగా ఆలోచించాలన్నారు.

సిబ్బందికి గృహాల వంటి మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా టౌన్‌షి్‌ప నిర్మించేందుకు 125 హెక్టార్ల భూమి కావాలని తెలిపారు. ఈ లేఖలో తమిళనాడులోని కల్పకం అణు విద్యుత్కేంద్రాన్ని ప్రస్తావించారు. ఈ ప్లాంటుకు అనుబంధంగా మరో రెండు యూనిట్లను స్థాపించేందుకు అనుమతులు వచ్చాయని అన్నారు. జాతీయ స్థాయిలో అణు విద్యుత్‌ పథకంలో భాగంగా 25 ప్లాంట్ల నుంచి 8,080 మెగావాట్ల అణ/ విద్యుదుత్పాదన జరుగుతోందని.. మరో నాలుగు ప్లాంట్ల ద్వారా 6800 మెగావాట్ల అణుధార్మిక విద్యుత్‌ ఉత్పత్తి అవుతోందని సురేశ్‌కుమార్‌ వెల్లడించారు. మరో 7,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు స్థాపన దశలో ఉన్నాయన్నారు. మొదటి దశలో 21,880 మెగావాట్ల అణువిద్యుదుత్పత్తిని చేయాలన్నది లక్ష్యమని తెలిపారు. అణు ప్లాంటుతో ప్రమాదం లేనందున.. రాష్ట్రంలో ఏర్పాటు చేయడంపై ఆసక్తిని తెలియజేయాలని సీఎ్‌సను కోరారు. దీనికి సానుకూలంగా స్పందిస్తే ఈ ప్రతిపాదనపై తదుపరి చర్చలు జరుపుదామని పేర్కొన్నారు. గతంలో శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు ప్లాంటు ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. కానీ స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో ప్లాంటు ఏర్పాటు సందిగ్ధంలో పడింది. ఇప్పుడు అణుశక్తి సంస్థే రాష్ట్రంలో బ్రీడర్‌ రియాక్టర్‌ యూనిట్‌ స్థాపించాలని సూచన చేయడంతో.. మళ్లీ కొత్త చర్చకు తెరలేచింది. కొత్త ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Updated Date - May 29 , 2024 | 04:12 AM