మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేయొద్దని పోలీసులకు సూచిస్తాం
ABN , Publish Date - Mar 08 , 2024 | 03:24 AM
తనను వేధింపులకు గురిచేస్తున్నారని తన మరదలు పొంగూరు కృష్ణప్రియ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నెల్లూరు బాలాజీ నగర్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని
హైకోర్టుకు అదనపు పీపీ మౌఖిక హామీ
ముందస్తు బెయిల్‌పై విచారణ 11కి వాయిదా
అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): తనను వేధింపులకు గురిచేస్తున్నారని తన మరదలు పొంగూరు కృష్ణప్రియ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నెల్లూరు బాలాజీ నగర్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ దాఖలు చేసిన పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. సెక్షన్ 498 కింద కేసు నమోదు చేసినందున నారాయణ అరెస్టుతోపాటు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచిస్తామని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి మౌఖికంగా హామీ ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ... విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు గురువారం ఆదేశాలిచ్చారు. అంతకుముందు నారాయణ తరఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. సంబంధం లేని కేసులో ఆయనపై సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేశారని.. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో నారాయణ పోటీ చేయబోతున్నారని.. ఆయన్ను అరెస్టు చేస్తారనే ఆందోళన ఉందని.. రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు.