Share News

ఎస్పీ కాదు.. వాళ్లమ్మ మొగుడికి చెప్పు!

ABN , Publish Date - Jan 12 , 2024 | 04:34 AM

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒకవ్యక్తి 30 మద్యం బాటిళ్లను తీసుకెళుతుండగా ఎస్‌ఈబీ అధికారులు పట్టుకోవడంపై ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నేరుగా ఎస్‌ఈబీ కార్యాలయానికి వెళ్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్పీ కాదు.. వాళ్లమ్మ మొగుడికి చెప్పు!

మద్యం పట్టుకుంటే రోజూ స్టేషనుకు వస్తా

ప్రొద్దుటూరు ఎస్‌ఈబీ అధికారులపై ఎమ్మెల్యే రాచమల్లు ఆగ్రహం

స్టేషనులోనే నిలబెట్టి ఎస్‌ఐపై గద్దింపు

ప్రొద్దుటూరు, జనవరి 11: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒకవ్యక్తి 30 మద్యం బాటిళ్లను తీసుకెళుతుండగా ఎస్‌ఈబీ అధికారులు పట్టుకోవడంపై ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నేరుగా ఎస్‌ఈబీ కార్యాలయానికి వెళ్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్స్‌ ప్రకారం తాము పట్టుకున్నామని ఎస్‌ఈబీ ఎస్‌ఐ అలీబేగ్‌ వివరణ ఇవ్వగా ‘‘ఎస్పీ కాదు.. వాళ్లమ్మ మొగుడికి చెప్పు.. మీరు మద్యం పట్టుకుంటే వారిపక్షాన రోజూ స్టేషనుకు వస్తా’’ అని హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. వివరాలిలా.. ప్రొద్దుటూరు పట్టణ శివారు ఎర్రగుంట్లరోడ్డు వాసవీ సర్కిల్‌ సమీపంలో గురువారం మధ్యాహ్నం పల్లా పుల్లయ్య అనే వ్యక్తి 30 మద్యం బాటిళ్లు బ్యాగులో తీసుకెళుతుండగా ఎస్‌ఈబీ అధికారులు, సిబ్బంది పట్టుకున్నారు. చట్టప్రకారం అతడిని ఎస్‌ఈబీ కార్యాలయానికి తీసుకొచ్చి కేసు నమోదు చేశారు. ఈ విషయం ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి దృష్టికి వైసీపీ నేతలు తీసుకెళ్లగా, ఆయన తన అనుచరగణంతో ఎస్‌ఈబీ కార్యాలయం చేరుకుని ఎస్‌ఐ అలీబేగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తికి రోజుకు ఎన్నిమద్యం బాటిళ్లు ఇస్తారని ఎమ్మెల్యే.. ఎస్‌ఐని ప్రశ్నించారు. రోజుకు మూడు బాటిళ్లు మాత్రమే ఇస్తారని చెప్పగా.. ‘నలుగురు ఐదుగురు మంది తీసుకున్న బాటిళ్లు ఒకరు తీసుకెళితే తప్పా.

పుల్లయ్య అనే వ్యక్తి వాళ్లమ్మ దినం కోసం మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నాడు.. పేదలను పట్టుకుంటారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్స్‌ అతిక్రమించి తాము వ్యవహరించలేమని ఎస్‌ఐ చెప్పగా.. ‘చట్టాన్ని మార్చుకో’ అని ఎమ్మెల్యే బల్లగుద్ది గద్దించారు. ఇలా ప్రభుత్వ మద్యం పట్టుకుంటే రోజూ స్టేషనుకు వస్తానని, ఇలాగే ప్రశ్నిస్తానని ఆవేశం వెలిబుచ్చారు. ’ఎస్పీ కాదు.. వాళ్లమ్మ మొగుడుకి చెప్పు.. మీరు మద్యం పట్టుకోవద్దు’ అని మరోసారి వారిని హెచ్చరించారు. ఆయన వెంట పలువురు వైసీపీ ముఖ్య నేతలు ఉన్నారు. కాగా.. ఎమ్మెల్యే, ఆయన అనుచరులంతా ఎస్‌ఈబీ కార్యాలయానికి వచ్చేటప్పటికి ఎస్‌ఐ అక్కడ లేరు. వీరు కాసేపు చర్చించుకున్న తర్వాత ఎస్‌ఐని పిలిపించారు. అప్పటికే ఎస్‌ఐ కుర్చీలో ఎమ్మెల్యే రాచమల్లు కూర్చొని ఉండగా, మిగిలిన అన్ని కుర్చీల్లో వైసీపీ నేతలంతా కూర్చొని ఉండటంతో తన స్టేషన్‌లో ఎస్‌ఐ నిలబడి ఉండాల్సి వచ్చింది. దీనిపై అలీబేగ్‌ను వివరణ కోరగా..కుర్చీ లేకుండా నిలబెట్టి మాట్లాడడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 06:35 AM