Share News

సింహాలు కాదు.. పందికొక్కులు!

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:12 AM

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన అన్న చిరంజీవిని ఏమైనా అంటే ఊరుకోనని స్పష్టం చేశారు.

సింహాలు కాదు.. పందికొక్కులు!

వైసీపీపై పవన్‌ ఫైర్‌

చిరంజీవిని ఏమైనా అంటే ఊరుకోను.. ఆయన అజాతశత్రువు

సీఎం రమేశ్‌, పంచకర్లను గెలిపించాలని పిలుపిస్తే మీకేంటి బాధ?

జనసేనకు విరాళమివ్వాలని రామ్‌చరణ్‌కు చెబితే రాజకీయమా?

ముగ్గురు పెళ్లాలంటావేంటి మూర్ఖుడా

భారతిని నీ పెళ్లామంటే నీకు కోపం రాదా?

ఒకప్పుడు చంద్రబాబు సాఫ్ట్‌

జైలుకు వెళ్లి వచ్చాక చాలా మార్పు

దుర్మార్గులపై ఇక కఠినంగా ఉంటారు

ఆయనకు నేను తోడు: పవన్‌

జగన్‌ గొడుగు కిందకు వెళ్లిన వారంతా రౌడీలే

ఇక మీ రౌడీయిజం ఆపండి.. ఎర్రి గొర్రి వేషాలు వేస్తే తాటతీస్తాం

సజ్జలా.. నువ్వు, జగన్‌ పద్ధతులు మార్చుకోండి

లేదంటే మేమొచ్చాక మోకాళ్లపై దేకిస్తా.. జనసేనాని హెచ్చరిక

భీమవరం-ఆంధ్రజ్యోతి/నరసాపురం, ఏప్రిల్‌ 21: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన అన్న చిరంజీవిని ఏమైనా అంటే ఊరుకోనని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, భీమవరంలలో జరిగిన ఎన్నికల సభల్లో ఆయన ప్రసంగించారు. ఎన్డీయే అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ‘సజ్జల పులివెందుల నుంచి వచ్చారో.. ఫ్యాక్షన్‌ నేపథ్యం నుంచి వచ్చారో తెలియదు, సింహం సింగిల్‌గా వస్తుందంటాడు.. కానీ రాష్ట్రాన్ని దోచుకున్న పందుకొక్కల సమూహం మీది. మీ అందరికీ డబ్బులు, అధికారం, అహంకారం ఎక్కువయ్యాయి. సజ్జలను హెచ్చరిస్తున్నా.. మా అన్న చిరంజీవి అజాత శత్రువు.. ఆయన జోలికి గానీ, శెట్టి బలిజ, కాపు, ఎస్సీ, ఎస్టీ.. ఇలా ఏ సామాజికవర్గం జోలికి గానీ వచ్చినా ఊరుకోను. చిరంజీవి జనసేనకు రూ.5 కోట్లు ఇచ్చి, ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ను కూడా విరాళం ఇవ్వమని చెప్పినందుకు రాజకీయం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీఎం రమేశ్‌ (అనకాపల్లి లోక్‌సభ), పంచకర్ల రమేశ్‌బాబు (పెందుర్తి)ను గెలిపించాలని సోషల్‌ మీడియా వేదికగా చిరంజీవి చెబితే.. సజ్జలా నీకెందుకంత బాధ? ఒక్కసారి అద్దాల్లో మీ ముఖాలు చూసుకోండి. సింహాల్లా కాదు.. గుంటనక్కల్లా ఉన్నారు. మీరు కలుగుల్లో పందికొక్కుల సమూహం.. చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను కూడా తిడుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు చాలా సాఫ్ట్‌గా ఆలోచించేవారు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. దుర్మార్గులపై కఠినంగా ఉండాలని నిర్ణయానికి వచ్చారు. ఆయనకు నేను తోడు. జగన్‌ అండ్‌ కోకు ఎదురుదెబ్బ తప్పదు. నరసాపురం గడ్డ నుంచి చెబుతున్నా.. సజ్జలా.. నువ్వు, మీ జగన్‌ పద్ధతులు మార్చుకోండి. లేదంటే కూటమి ఆధికారంలోకి వచ్చాక రోడ్డుపై మోకాళ్లపై దేకిస్తా’ అని స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే..

వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు?

ముగ్గురు పెళ్లాలంటావేంట్రా మూర్ఖుడా.. వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్‌? ప్రతి జీవితంలో ఒడిదొడుకులుంటాయి. సమస్యలు లేని కుటుంబం ఎక్కడుంటుంది? మీ సతీమణి భారతిని నీ పెళ్లాం అంటే నీకు కోపం రాదా..? వ్యక్తిగత జీవితాల జోలికోస్తే ఊరుకునేది లేదు. ఈ సీఎంకు రౌడీ గ్యాంగులు, బ్లేడ్‌బ్యాచ్‌లున్నాయి, వంతపాడే అధికారులున్నారు. ఈయనలా నాది రాజకీయాల్లో మూడో తరం కాదు.. మొదటి తరం. కింది స్థాయి కుటుంబం నుంచి వచ్చాను. పార్టీ పెట్టాను. రెండు చోట్ల ఓడిపోయాను. దెబ్బలు పడ్డా, రాజకీయాలు నుంచి పారిపోలేదు. పదేళ్లపాటు పార్టీని నిలబెట్టాను. జగన్‌ అధికారంలోకి వచ్చాక రౌడీ మూకలు పెరిగిపోయాయి. చంద్రబాబు సతీమణిని, షర్మిలను, చివరకు పినతండ్రి కుమార్తె చెల్లెలు సునీతనూ వదలలేదు. జగన్‌కు మళ్లీ అధికారమిస్తే ఆస్తులు కూడా మిగలవు. ఆస్తులపై ఆంధ్ర ప్రభుత్వ రాజముద్ర ఉండాలి. కానీ జగన్‌ బొమ్మ ఉంటుంది. ఆస్తులన్నీ డిజిటలైజేషన్‌ చేశాడు, ప్రభుత్వ ఆస్తులను అమ్మేశాడు, మళ్లీ అధికారమిస్తే ప్రైవేటు ఆస్తులనూ తాకట్టు పెట్టేస్తాడు. జగన్‌కు వంతపాడుతున్న నాయకులను ఇదే హెచ్చరిస్తున్నా.. మీ ఆస్తులూ దక్కవు. మళ్లీ ఆయనకు చాన్సిస్తే ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ ఉండదు. ఆలోచించి ఓటేయండి.. ఎన్డీయేని గెలిపించండి.

జగన్‌ గొడుకు కిందకు వెళ్తే ఎవరైనా రౌడీలే

జగన్‌ గొడుగు కిందకు వెళ్లిన వారంతా రౌడీలుగా మారిపోతున్నారు. జక్కంపూడి రాజా నుంచి ముదునూరి ప్రసాదరాజు వరకు ఎవరైనా ఇంతే. ఐదేళ్ల పాటు రాష్ర్టాన్ని దోచుకుతిన్నారు, కోట్లు సంపాదించారు. బ్లేడ్‌ బ్యాచ్‌, రౌడీలను అడ్డం పెట్టుకుని విధ్వంసం సృష్టించారు. ఇక మీ రౌడీయిజం ఆపండి. నేను బయటకు రాగానే జగన్‌ కాపలా కుక్కలు బూతులు మాట్లాడతారు. సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేస్తారు. ఎన్నికల సమయంలో ఎర్రి గొర్రి వేషాలు వేస్తే తాటతీస్తాం. ఇప్పటి వరకు రాజకీయం వేరు.. ఇక నుంచి రాజకీయం వేరు. ఇప్పటి వరకు బూతుల అసెంబ్లీ చూశారు, ఆడపడుచులు, మహిళలపై నీచంగా మాట్లాడారు, ఇంట్లో నుంచి బయటకు రాని ఆడబిడ్డలను తిట్టే బ్యాచ్‌ మీది. మేం వచ్చాక అసెంబ్లీ పనితీరు ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం. నా ఆశయం ఒక్కటే.. రాష్ర్టాన్ని బాగు చేయడం. అందుకు ఎన్టీయేకి ఓటేయండి.. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్‌ కోసం బీజేపీ పెద్దలను ఒప్పించి.. పొత్తు కోసం నేను తగ్గాను. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తాం. పోలవరాన్ని నిర్మిస్తాం. అన్న క్యాంటీన్లతో సమానంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసి పేదల కడుపు నింపుతాం.

మత్స్యకారులకు 10 లక్షల బీమా..

ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక మత్స్యకారులకు ఏ ప్రమాదం జరిగినా రూ.10 లక్షలు బీమా కల్పిస్తాం. మత్స్యకార వృత్తికి ప్రమాదంగా మారిన 217 జీవోను రద్దు చేస్తాం. మత్స్యకార సొసైటీలకు పూర్తి స్థాయిలో రుణాలందిస్తాం. గౌడ, శెట్టిబలిజలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తాం. మీరు చేయాల్సింది ఒక్కటే.. ఈ ఎన్నికల్లో మాకు అండగా నిలబడండి. జగన్‌ అధికారంలోకి వచ్చి ఆక్వా రైతులను ముంచేశాడు. విద్యుత్‌ యూనిట్‌ ధరను రూ.5కు పెంచాడు. హేచరీలకు రూ.8 చేశాడు.. రొయ్య రైతులకు గిట్టుబాటు లేకుండా చేశాడు. కూటమి అధికారంలోకి రాగానే ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. ధరలను పెంచేందుకు కృషి చేస్తాం. రాయితీలు, విద్యుత్‌ సబ్సిడీలు కల్పిస్తాం.

జగన్‌ కులాలను విడగొట్టి రాజకీయం చేయాలని చూస్తున్నాడు. కానీ నేను ఏకం చేస్తాను. నేను ఓటు బ్యాంకు రాజకీయాలు చేయను.. భారత రాజ్యాంగాన్ని నమ్మి రాజకీయం చేస్తున్నా.

జగన్‌లా నాపై 32 కేసులు లేవు. నా తెగింపు ఏమిటో ఆయనకు తెలియదు. ఆయన ఊహించుకునేదానికి పదిరెట్లు ఉంటుంది. ఆయనలా చిల్లర రాజకీయాలు చేయను. - పవన్‌ కల్యాణ్‌

Updated Date - Apr 22 , 2024 | 04:12 AM