Share News

గౌరవ వేతనానికీ దిక్కులేదు!

ABN , Publish Date - Jun 03 , 2024 | 03:30 AM

ఏపీ రైతుసాధికార సంస్థ ఆధ్వర్యంలోని ప్రకృతి వ్యవసాయ విభాగంలో పని చేస్తున్న కార్యకర్తలకు దాదాపు 16 నెలలుగా ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం అందడం లేదు. 9,352 మంది కార్యకర్తలకు మొత్తం రూ.100కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందని సమాచారం.

గౌరవ వేతనానికీ దిక్కులేదు!

ప్రకృతి సేద్య విభాగం కార్యకర్తల గగ్గోలు

16నెలలుగా రూ.100 కోట్ల వేతన బకాయిలు

కేటాయించిన నిధులు దారిమళ్లించిన సర్కారు

అమరావతి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): ఏపీ రైతుసాధికార సంస్థ ఆధ్వర్యంలోని ప్రకృతి వ్యవసాయ విభాగంలో పని చేస్తున్న కార్యకర్తలకు దాదాపు 16 నెలలుగా ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం అందడం లేదు. 9,352 మంది కార్యకర్తలకు మొత్తం రూ.100కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందని సమాచారం. ఈ విభాగానికి కేటాయించిన నిధుల్ని జగన్‌ సర్కార్‌ దారి మళ్లించడంతో సమస్య జఠిలమైంది. పైగా కేంద్ర ప్రభుత్వం ద్వారా స్వచ్ఛంద సంస్థలు అందించే నిధులు కూడా నిలిచిపోవడంతో ప్రకృతి సేద్య విభాగం మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. వేతన బకాయిలపై రైతు సాధికార సంస్థ ఉన్నతాధికారులు భరోసా ఇస్తున్నా.. నెలల తరబడి వేతనాలు రాకపోతే.. కుటుంబ పోషణ ఎలా సాధ్యమని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. దీంతో జూన్‌ 15లోగా కనీసం ఆరు నెలల వేతనం ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని అధికారు లు చెప్తున్నారు. ఇందుకోసం బ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ, తోటి రైతులకు రసాయన రహిత, సేంద్రియ సాగుపై అవగాహన కల్పించి, ప్రోత్సహించే ఈ కార్యకర్తల సేవల్ని వినియోగించుకుంటూ, కనీసం గౌరవ వేతనం కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా, డివిజన్‌ స్థాయిలో పని చేసే కార్యకర్తలకు పనితీరు, అనుభవం ఆధారంగా వేతనాలు నిర్ణయించారు. నెలకు ఒక్కో కార్యకర్తకు రూ.6వేల నుంచి రూ.36వేల వరకు వేతనాలున్నాయి. 16నెలలుగా వేతనాలు రాకపోవడంతో.. కార్యకర్తలు తీవ్ర ఆవేదన లో ఉన్నారు. దీనిపై ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీ వీ ప్రసాద్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. మళ్లీ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రకృతి సేద్య కార్యకర్తలకు తక్షణం వేతన బకాయిలు చెల్లించాలని కోరారు.

Updated Date - Jun 03 , 2024 | 03:30 AM