జగన్ అక్రమాస్తుల కేసులో ‘నాట్ బిఫోర్ మీ’
ABN , Publish Date - Nov 13 , 2024 | 04:51 AM
మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ మరోసారి వైదొలిగారు.

విచారణ నుంచి మరోసారి వైదొలగిన సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్
న్యూఢిల్లీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ మరోసారి వైదొలిగారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని, విచారణను హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రానికి మార్చాలని అప్పటి వైసీపీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నిరుడు నవంబరు 1న సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అవి ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ముందు మంగళవారం విచారణకు వచ్చాయి. విచారణ ప్రారంభం కాగానే.. ఆంధ్రప్రదేశ్‌లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. ఈ క్రమంలో జస్టిస్ సంజయ్‌కుమార్ కేసును తాను విచారించనంటూ ‘నాట్ బిఫోర్ మీ’ అని అన్నారు. దీంతో విచారణను మరో ధర్మాసనానికి సీజేఐ బదిలీ చేశారు. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు డిసెంబరు 2న విచారణకు పంపాలని రిజిస్ర్టీని ఆదేశించారు. గతంలోనూ జగన్ అక్రమాస్తులకు సంబంధించిన మరో పిటిషన్ విచారణ నుంచి జస్టిస్ సంజయ్‌కుమార్ వైదొలగడ గమనార్హం. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతే ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) కేసుల్లో తీర్పులు ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినా ఆ పద్థతినే అనుసరించాలని అప్పట్లో స్పష్టం చేసింది. ఈ తీర్పును గతేడాది మే నెలలో ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్ సైతం గతంలో జస్టిస్ సంజయ్‌కుమార్ ఉన్న ధర్మాసనం ఎదుటే విచారణకు రాగా ఆయన మరో ధర్మాసనానికి పంపాలని సూచించారు.