వెలిగొండ కాదు.. ఖాళీ కుండ
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:24 AM
ప్రజలకు లబ్ధి చేకూరడం కన్నా రాజకీయ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యం ఇచ్చే సీఎం జగన్...

నీళ్లు లేవు.. ప్రాజెక్టు పనులూ పూర్తి కాలేదు
అయినా ప్రారంభోత్సవానికి సిద్ధమైన జగన్
నేడు సొరంగాలు జాతికి అంకితం పేరిట కార్యక్రమం
ఎన్నికల లబ్ధే లక్ష్యం.. కదలిక లేని పునరావాసం
గత ఐదేళ్లలో జగన్ ఖర్చు చేసింది 978 కోట్లే
రూ.1,450 కోట్ల పనులు చేసిన టీడీపీ సర్కారు
ప్రాజెక్టు పూర్తికి మరో నాలుగు వేల కోట్లు
ఒంగోలు/మార్కాపురం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు లబ్ధి చేకూరడం కన్నా రాజకీయ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యం ఇచ్చే సీఎం జగన్... ఎన్నికల వేళ మరో పాచిక విసిరారు. అసంపూర్తిగా ఉన్న వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు మరో మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, బుధవారం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి నీరిచ్చే అవకాశం ఏమాత్రం లేదు. కీలకమైన నిర్వాసితుల తరలింపులో ఏమాత్రం కదలిక లేదు. అయినా, రెండు సొరంగాలను జాతికి అంకితం పేరుతో శిలాఫలకాన్ని జగన్ ఆవిష్కరించి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. వెలిగొండ పూర్తికి ఇంకా రూ. నాలుగు వేల కోట్లు వెచ్చించాల్సిన అవసరం ఉంది. నిజానికి, తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలో వెలిగొండ పూర్తి చేసి నీరిస్తామని గత ఎన్నికల ముందు జగన్ పదేపదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కావస్తున్నా దానిని పూర్తి చేయలేకపోయారు. అంతేకాక సుమారు రూ.5వేల కోట్లు అవసరం ఉన్నా ఈ ప్రాజెక్టు కోసం ఈ ఐదేళ్లలో కేవలం రూ.978 కోట్లను మాత్రమే ఖర్చుపెట్టారు. కీలకమైన పలు పనులు గత టీడీపీ కాలంలోనే కొలిక్కి రాగా ఈ ఐదేళ్లు ఒట్టి మాటలకే వైసీపీ ప్రభుత్వం పరిమితమైందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
గత టీడీపీ హయాంలో స్పీడు...
2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చేనాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు ఆగిపోయి రెండేళ్లు అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాల్లో వెలిగొండను చేర్చి ప్రత్యేక దృష్టి సారించారు. పోలవరంతోపాటు వెలిగొండపైనా తరచూ సమీక్షలతోపాటు ప్రాజెక్టును సందర్శించి వాస్తవ పరిస్థితుల ఆధారంగా కాంట్రాక్టర్లను మార్చి పనుల్లో వేగం పెంచారు. 2014 నాటికి 11 కిలోమీటర్లు మాత్రమే తొలి సొరంగం పూర్తి కాగా తర్వాత ఐదేళ్ల కాలంలో దాదాపు 17.50 కిలోమీటర్లు తవ్వడంతోపాటు అత్యంత క్లిష్టమైన హెడ్ రెగ్యులేటరీ పనులు మొదలయ్యాయి. రెండో టన్నెల్ దాదాపు 3 కిలోమీటర్లు తవ్వారు. నిర్వాసితులకు పరిహారం, పునరావాస ప్యాకేజీలపై విస్తృత కసరత్తు చేశారు. 2014-19 మధ్య వెలిగొండపై దాదాపు రూ.1,450 కోట్ల ఖర్చు చేశారు.
వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యం
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వెలిగొండపై ఆరంభంలో హడావుడి చేసినా, అనంతరం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఏడాదిలో వెలిగొండ పూర్తి చేస్తామని జగన్, ఇతర వైసీపీ నేతలు ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేశారు. నిజానికి గత టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చేసిన పనుల వల్ల వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదికే కొరవ ఉన్న తొలి సొరంగం తవ్వకం పూర్తయింది. తద్వారా తొలి సొరంగం నుంచి ప్రాజెక్టులోకి నీరు తీసుకొనే అవకాశం ఏర్పడింది. నిర్వాసితుల తరలింపును వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో అది వీలు కాలేదు.
సొరంగాల లైనింగ్‌కే ఏడాది అవసరం
ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టు కోసం రూ.8,043 కోట్లు కేటాయించగా, దాదాపు రూ.5,974 కోట్లు వెచ్చించారు. అందులో వైసీపీ ప్రభుత్వ కాలంలో చేసింది కేవలం రూ.958 కోట్లు మాత్రమే. ఆ విషయం అలా ఉంచితే తాజాగా అధికారుల అంచనా ప్రకారం ప్రాజెక్టు వ్యయ అంచనా సుమారు రూ.10వేల కోట్లకు చేరింది. అంటే ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ.4వేల కోట్లు అవసరం. అలాగే సొరంగాల లోపల లైనింగ్ పూర్తికి కనీసం ఏడాది, మొత్తం ప్రాజెక్టు పనుల పూర్తికి మరో మూడేళ్లు పడుతుందని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు ప్రభుత్వానికి కూడా వారు నివేదించినట్లు సమాచారం. ఇవేమీ పట్టించుకోకుండా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ లబ్ధి, ఓట్లు దండుకొనే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.