Share News

హోదా ఉద్యమానికి సహకరించకుంటే ప్రతిఘటనే

ABN , Publish Date - Jan 21 , 2024 | 02:05 AM

విభజన హామీలు, ప్రత్యేక హోదా ఉద్యమానికి సహకరించి తోడ్పడని అందరూ తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు.

హోదా ఉద్యమానికి సహకరించకుంటే ప్రతిఘటనే

ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి

ఢిల్లీలో పార్లమెంటు ముట్టడి.. 30న గాంధీ విగ్రహాల వద్ద నిరసన

విజయవాడ(గవర్నర్‌పేట), జనవరి 20: విభజన హామీలు, ప్రత్యేక హోదా ఉద్యమానికి సహకరించి తోడ్పడని అందరూ తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలు, ప్రత్యేక హోదా అమలు చేయకతప్పదని స్పష్టం చేశారు. శనివారం విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అఖిలపక్ష నేతలు ప్రసంగించారు. దాదాపు 30సంఘాలు అనేక పార్టీలు పాల్గొన్న విస్తృత స్థాయి సమావేశంలో సమితి నేతలు కీలక ప్రకటన చేశారు. పార్లమెంటు సమావేశాలు ముగించే ముందు ఢిల్లీలో పార్లమెంటు ముట్టడి చేపడతామని హెచ్చరించారు. 30న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద నిరాహారదీక్షలు చేపడతామని చలసాని ప్రకటించారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యతిరేక చర్యల్ని ఎదుర్కొంటామన్నారు. జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రత్యేక హోదా సాధన సమితి కార్యదర్శి వి.వి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోరుతూ ప్రతి ఒక్కరూ బ్యాడ్జీలు పెట్టుకోవాలని కోరారు. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో పర్యటిస్తామని, ప్రధాన మంత్రికి ట్వీట్లు ద్వారా మెయిల్‌ ద్వారా ప్రజల ఆందోళన, డిమాండ్‌ను తెలియజేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - Jan 21 , 2024 | 07:56 AM