Share News

వేతన వెతలు

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:16 AM

: రాష్ట్రంలో ఏపీ సమగ్ర శిక్ష పరిధిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వేతన వెతలు
ఆలూరు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం

రెండు నెలలుగా అర్ధాకలితో విధులు

ఆర్థిక ఇబ్బందుల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులు

బడ్జెట్‌ లేదంటూ చేతులెత్తేసిన అధికారులు

ఆలూరు, మార్చి 10: రాష్ట్రంలో ఏపీ సమగ్ర శిక్ష పరిధిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చాకే ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించండి అంటూ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆన్న మాటలివి. క్షేత్రస్థాయిలో చూస్తే ఉద్యోగులు వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

అప్కాస్‌తో ప్రయోజనం ఏమిటి?

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మేలు చేకూరుస్థామని, ఒకటో తేదీ వేతనాలు అందించేందుకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్సింగ్‌ (అప్కాస్‌)ను ఏర్పాటు చేసినా ఎవ్వరికీ సకాలంలో వేతనాలు చెల్లించింది లేదని కాంట్రాక్టు ఉద్యోగులు మండిపడుతున్నారు.

బడ్జెట్‌ లేదని..

సమగ్ర శిక్ష పరిధిలో జిల్లాల్లో కస్తూర్బా గాంధీ పాఠశాలలు, మోడల్‌ గర్ల్స్‌ హాస్టల్స్‌, ఎంఅర్‌సీ భవన్‌, భవిత భవన్‌లో దాదాపుగా 3 వేలకు పైగా ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ బడ్జెట్‌ లేదంటూ, రెండు నెలలు గడచినా వేతనాలు పడలేదు. ఉన్నత అధికారులను అడిగితే బడ్జెట్‌ లేదంటూ చేతులెత్తేశారు. దీంతో ఎం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. వేతనాలు రాకపోవడంతో ఇంటి అద్దె, కుటుంబ పోషణ భారంగా మారిందని చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేతనాలు మంజూరు చేయాలి

చాలిచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న రెండు నెలల వేతనాలు తక్షణమే మంజూరు చేయాలి. వేతనాలు రాకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం

- రఫీ, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘా జిల్లా నాయకుడు

ఫ బడ్జెట్‌ లేకపోవడం వల్లే వేతనాలు ఆలస్యం

ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ రానందున సమగ్ర శిక్ష ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు మంజూరు కాలేదు. బడ్జెట్‌ వచ్చిన వెంటనే పెండింగ్‌ వేతనాలు చెల్లిస్తాం.

- విజయ కుమారి, అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కో-ఆర్డినేటర్‌ కర్నూలు

Updated Date - Mar 11 , 2024 | 12:16 AM