Share News

హింస, రీ పోలింగ్‌ ఉండొద్దు..

ABN , Publish Date - Mar 14 , 2024 | 04:27 AM

రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో హింసకు తావులేకుండా, రీ పోలింగ్‌కు అవకాశం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

హింస, రీ పోలింగ్‌ ఉండొద్దు..

వచ్చే ఎన్నికల్లో ఇదే లక్ష్యం: మీనా

అమరావతి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో హింసకు తావులేకుండా, రీ పోలింగ్‌కు అవకాశం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లాల అధికారులను ఆదేశించారు. తదనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అమరావతి సచివాలయం నుంచి బుధవారం ఆయన అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల సన్నద్ధతకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జీరో వయెలెన్స్‌, నో రీపోలింగ్‌ అనేవి ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుని పనిచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం) చక్కగా పనిచేసేలా చూసుకోవాలని సూచించారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్న నేపథ్యంలో దానికి ముందు, తర్వాత జిల్లాల అధికారులు తీసుకోవాల్సిన చర్యలను మీనా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఓటర్లను ఆకర్షించేందుకు పలు పార్టీలు నగదు, బహుమతులను విరివిగా పంపిణీ చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయని, పలు ఫిర్యాదులు కూడా వస్తున్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత నివేదికలను తమకు వెంటనే పంపాలని ఆదేశించారు.

Updated Date - Mar 14 , 2024 | 04:27 AM