Share News

ఇప్పటికైతే ఇబ్బందుల్లేవు!

ABN , Publish Date - Jan 17 , 2024 | 02:52 AM

తమ అధినేత చంద్రబాబుపై జగన్‌ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి ఇంకొంత కాలం యథాతథ స్థితే కొనసాగుతుందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇప్పటికైతే ఇబ్బందుల్లేవు!

ఇంకొంత కాలం యథాతథ స్థితే!!

ఎన్నికలు ముగిసేదాకా ఇంతే?

బాబు కేసులపై టీడీపీ నేతల మనోగతం

నేటి ఫైబర్‌నెట్‌ తీర్పుపై ఉత్కంఠ

అమరావతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): తమ అధినేత చంద్రబాబుపై జగన్‌ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి ఇంకొంత కాలం యథాతథ స్థితే కొనసాగుతుందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ కేసుల విషయంలో ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్యలు ఏమీ లేవని, ఎన్నికలు ముగిసేవరకూ ఇదే పరిస్ధితి కొనసాగే అవకాశం ఉందని అంటున్నాయి. చంద్రబాబుపై ఈ ప్రభుత్వం మొత్తం 5 కేసులు నమోదు చేసింది. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో అరెస్టు చేసింది. కొంతకాలం జైల్లో ఉన్న తర్వాత ఆయనకు ఆ కేసులో బెయిల్‌ లభించింది. మరో మూడు కేసుల్లో హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరుచేసింది. ఫైబర్‌ నెట్‌ కేసులోముందస్తు బెయిల్‌ దరఖాస్తును హైకోర్టు తిరస్కరించింది. దానిపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 17ఏ సెక్షన్‌ వర్తింపుపై తీర్పు వెలువడేవరకూ ఆయన్ను అరెస్టు చేయొద్దని అప్పట్లో సుప్రీం ఆదేశించింది. మంగళవారం తీర్పు వెలువడినా అందులో ఏమీ తేలలేదు. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో దానిని మరో ధర్మాసనానికి పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ ధర్మాసనం ముందుకు పంపాలో ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారు. ఆ ధర్మాసనం ముందు మరోసారి వాదనలు జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాత తుది నిర్ణయం వెలువడుతుంది. దీనికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. ఫైబర్‌నెట్‌ కేసులో బెయిల్‌ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. 17ఏ సెక్షన్‌ వర్తింపుపై పిటిషన్‌ మరో బెంచ్‌ ముందుకు వెళ్తున్నందున.. అప్పటివరకూ అరెస్టు వద్దని ఆదేశాలిస్తారా.. లేక ముందస్తు బెయిల్‌ ఇస్తారా లేక మరేదైనా ఆదేశాలు వస్తాయా అన్నది ఉత్కంఠగా మారింది. ఈ కేసు తప్ప మిగిలిన కేసుల్లో ఇప్పటికే బెయిల్‌ వచ్చినందువల్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ చంద్రబాబు తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించడానికి ఆటంకాలు ఉండవని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసులపై మాట్లాడవద్దని మినహా మరే ఆంక్షలూ కోర్టులు విధించలేదు.

17ఏ వర్తింపుపై తీర్పు వెలువడడం అంత తేలికైన వ్యవహారం కాదని టీడీపీ కేసులు చూస్తున్న న్యాయకోవిదులు చెబుతూనే ఉన్నారు. దీనిపై సుప్రీం ఇచ్చే తీర్పు.. దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నందున మరింత లోతుగా పరిశీలన జరిపిన తర్వాతే కోర్టు నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆ అభిప్రాయానికి బలం చేకూరుస్తూ విస్తృత ధర్మాసనానికి స్కిల్‌ కేసు బదిలీ కాబోతోంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మంగళవారం వెలువరించిన భిన్నాభిప్రాయాలు రాజకీయంగా రాష్ట్రంలో చూపే ప్రభావంపై రాజకీయ వర్గాల్లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఎవరికీ అనుకూలం.. ఎవరికీ వ్యతిరేకం కాకపోవడంతో ప్రధాన రాజకీయ పక్షాలు వైసీపీ, టీడీపీ కొన్నిరోజులు పరస్పరం విమర్శలు చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ తీర్పు బీజేపీ భావి రాజకీయ సంబంధాలను ఎలా ప్రభావితం చేసే అవకాశముందన్నది కూడా రాజకీయ వర్గా ల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ-జనసేన కూటమితో రాష్ట్రంలో బీజేపీకి పొత్తు కుదిరే అవకాశముందని కొన్నివర్గాలు మొదట్లో అంచనా వేశా యి. ఇప్పుడా వాదనకు బలం తగ్గినట్లు కనిపిస్తోంది. ఏం జరుగుతుందో కొన్నిరోజులు వేచిచూడాల్సి ఉంటుందని ఈ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Jan 17 , 2024 | 06:45 AM