బదిలీల్లో రాజకీయ జోక్యం వద్దు
ABN , Publish Date - Jun 27 , 2024 | 02:04 AM
ఉపాధ్యాయుల బదిలీల్లో ఇకపై ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టంచేశారు.

టీచర్లపై అనవసర యాప్‌ల భారం తగ్గించాలి: మంత్రి లోకేశ్
అమరావతి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీల్లో ఇకపై ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టంచేశారు. గత ప్రభుత్వం తరహాలో రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదని, ఇందుకోసం స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల సలహాలు తీసుకోవాలని సూచించారు. బుధవారం సచివాలయంలో పాఠశాల విద్యాశాఖపై మంత్రి సమీక్షించారు. టీచర్లకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్‌ల భారాన్ని తగ్గించాలని, పూర్తిస్థాయిలో బోధనపైనే దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు స్పష్టంచేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని నిధులు అవసరమని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతపై పలు సూచనలు చేశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ బడుల నుంచి విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లడానికి కారణాలను సమగ్ర నివేదిక రూపంలో సమర్పించాలన్నారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలు, విద్యా ప్రమాణాల పెంపుపై అధికారులతో చర్చించారు. సమీక్షలో ఉన్నతాధికారులు కోన శశిధర్, సురేశ్ కుమార్, బి.శ్రీనివాసరావు, నిధి మీనా పాల్గొన్నారు.