పర్మిట్ రూమ్‌లు లేవు
ABN , Publish Date - Oct 19 , 2024 | 04:10 AM
మద్యం షాపుల పక్కన పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కొత్త పాలసీలో పెట్టకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది.
ప్రభుత్వ నిర్ణయంతో 170 కోట్ల నష్టం.. నూతన మద్యం పాలసీ అమల్లోకి
గతంలో ఒక్కో షాపు నుంచి 5 లక్షల ఆదాయం.. జగన్ హయాంలో తొలగింపు
ఫలితంగా రోడ్లపై తాగే సంస్క ృతి.. ఇప్పుడు పాలసీ మారినా పాత రూలే.. బార్లకు మేలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మద్యం షాపుల పక్కన పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కొత్త పాలసీలో పెట్టకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. కొత్త మద్యం పాలసీలో తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా రూ.170 కోట్ల ఆదాయం కోల్పోయింది. మరోవైపు బార్ల యాజమాన్యాలకు భారీగా మేలు చేకూరనుంది. షాపుల పక్కన మద్యం తాగేందుకు పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వకపోవడంతో బార్లకు ఆదాయం పెరిగే అవకాశం ఏర్పడింది. గతంలో ప్రైవేటు పాలసీల్లో పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చారు. దీంతో ఒక్కో షాపు నుంచి ప్రభుత్వానికి రూ.5 లక్షలు ఆదాయం వచ్చేది. అయితే జగన్ సర్కారు దశలవారీగా మద్యపాన నిషేధమంటూ పర్మిట్ రూమ్‌ల విధానం తొలగించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ప్రైవేటు మద్యం పాలసీ ప్రకటించినా, పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వలేదు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించడంపై అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా బార్లకు మేలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మద్యం షాపుల పక్కన రోడ్లపై విచ్చలవిడిగా మద్యం తాగే సంస్కృతి కొనసాగుతుందనే విమర్శలూ వస్తున్నాయి. గత ప్రభుత్వంలో రోడ్లపై మద్యం తాగి వాహనదారులతో గొడవలు పెట్టుకోవడం, కేసులు పెట్టడం అనేకం జరిగాయి.
గత విధానం ఇలా...
గతంలో ప్రైవేటు మద్యం షాపుల పాలసీలో పర్మిట్ రూమ్‌లు ఉండేవి. షాపు పక్కనే మద్యం తాగేందుకు చిన్న గదిని ఏర్పాటు చేసేవారు. అక్కడ కుర్చీలు, బల్లలు లేకుండా కేవలం నిల్చొని మద్యం తాగేందుకు అవకాశం కల్పించేవారు. షాపు లైసెన్సీకి వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు, స్నాక్స్ లాంటివి విక్రయించుకోవడం ద్వారా అదనపు ఆదాయం సమకూరేది. పర్మిట్ రూమ్‌ల వల్ల మద్యం విక్రయాలు పెరిగేవి. వ్యాపారికి, ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చేది. అయితే గత వైసీపీ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ హడావిడి చేసి అందులో భాగంగా అంటూ పర్మిట్ రూమ్‌ల విధానాన్ని రద్దు చేసింది. రోడ్లపై తాగినా ఫరవాలేదన్నట్టుగా పర్మిట్‌రూమ్‌లను తొలగించింది.
మరో 17 కోట్లు నష్టం!
పర్మిట్ రూమ్‌లు పెట్టుకోవాలంటే లైసెన్సీ అదనంగా ఏడాదికి రూ.5 లక్షలు చెల్లించాలి. సాధారణంగా పర్మిట్ రూమ్‌లు అక్కర్లేదనే లైసెన్సీలు ఉండరు. ఇటీవల నిర్వహించిన లాటరీలో 3,396 ప్రైవేటు షాపులకు రూ.5లక్షల చొప్పున రూ.169.8 కోట్లు ఒక్క విడతలో వచ్చేవి. త్వరలో గీత వృత్తి కులాలకు కోసం రిజర్వ్ చేసిన 340 షాపులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. వాటిద్వారా మరో రూ.17 కోట్లు వచ్చేవి. పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వని కారణంగా ఎక్సైజ్‌శాఖ ఈ ఆదాయాన్ని కోల్పోయింది. పర్మిట్ రూమ్‌లు వద్దనడం వెనుక రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి.. బార్ల యాజమాన్యాల కోరిక మేరకు ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదని, మరొకటి.. మంత్రివర్గ ఉపసంఘం పర్మిట్ రూమ్‌లు వద్దని సిఫారసు చేసిందని ప్రచారం జరుగుతోంది. 2022లో కొత్త బార్ పాలసీ ప్రకటించినప్పుడు ప్రభుత్వ షాపుల పాలసీలో పర్మిట్‌రూమ్‌లు లేవని, అందుకే బార్‌లు తీసుకున్నామని, ఇప్పుడు ప్రైవేటు షాపుల్లో పర్మిట్ రూమ్‌లు పెడితే తమ వ్యాపారం దెబ్బతింటుందని యాజమాన్యాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. పర్మిట్ రూమ్‌లు పెడితే కోర్టుకు వెళ్తామని అన్నట్లు తెలిసింది. ఏదేమైనా ప్రభుత్వానికి తక్షణం రూ.170 కోట్లు, త్వరలో వచ్చే మరో రూ.17 కోట్ల ఆదాయం పోయింది.