Share News

మన గెలుపును ఎవరూ ఆపలేరు!

ABN , Publish Date - May 09 , 2024 | 04:07 AM

ఆంధ్రప్రదేశ్‌లో మన కూటమి అత్యద్భుత విజయాన్ని నమోదు చేయబోతోంది. కూటమి గెలుపును ఎవరూ ఆపలేరు’

మన గెలుపును ఎవరూ ఆపలేరు!

జనంలో అవధుల్లేని ఉత్సాహం

ప్రభుత్వాన్ని మార్చాలని వారిలో బలమైన కోరిక: ప్రధాని

రోడ్‌షో ముగిశాక చంద్రబాబు, పవన్‌తో భేటీ

కూటమి వైపే ప్రజల మొగ్గు.. అత్యద్భుత విజయం సాధిస్తున్నాం

ఇక పోలింగ్‌పై దృష్టి సారించండి.. ఓటింగ్‌ బాగా పెరగాలి

ఉదయం 10లోపే ఎక్కువ జరగాలి.. ఇద్దరికీ మోదీ సూచనలు

అమరావతి, మే 8 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రప్రదేశ్‌లో మన కూటమి అత్యద్భుత విజయాన్ని నమోదు చేయబోతోంది. కూటమి గెలుపును ఎవరూ ఆపలేరు’ అని ప్రధాని మోదీ ప్రకటించారు. బుధవారం విజయవాడ నగరంలో రోడ్‌ షో ముగిసిన తర్వాత ఆయన పది నిమిషాలపాటు టీడీపీ అధినేత చందబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లతో సమావేశం అయ్యారు. బెంజ్‌ సర్కిల్‌ సెంటర్‌లో ఒక పక్కన వీఐపీలు కాసేపు కూర్చుని మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా ఒక గుడారాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. అందులోనే బాబు, పవన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఘన విజయాన్ని సాధించబోతున్నారంటూ వారిద్దరినీ అభినందించారు. ‘నేనీ రాష్ట్రంలో ప్రజల్లో అవధుల్లేని ఉత్సాహాన్ని చూస్తున్నాను. ప్రభుత్వాన్ని మార్చాలన్న బలమైన కోరిక ఉన్నప్పుడే ప్రజల్లో ఇంత దూకుడు కనిపిస్తుంది. కూటమి పట్ల వారి మొగ్గు స్పష్టంగా కనిపిస్తోంది. మామూలు విజయం కాదు... చాలా పెద్ద విజయాన్ని మీరు సాధించబోతున్నారు. ఈ రోజు రోడ్‌షో బ్రహ్మాండంగా జరిగింది. ప్రజల స్పందన చూస్తే ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోందో ముందే తెలిసిపోతోంది. నేను రాష్ట్రంలో పాల్గొన్న సభలన్నీ బాగా జరిగాయి. అన్ని చోట్లా ఒకే మాదిరి ఉత్సాహం, ఘనమైన హాజరు కనిపించాయి. నేను సంతోషంగా ఉన్నాను’ అని ఆయన వారితో అన్నారు. ప్రజల్లో ఉన్న ఈ సానుకూలతను సంపూర్ణంగా అందుకోవడానికి పోలింగ్‌ రోజు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలింగ్‌ శాతం బాగా పెరగాలన్నారు. ‘ఎండలు మామూలుగా లేవు.


చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా పోలింగ్‌ బాగా జరిపించుకుంటేనే మనం అనుకున్న ఫలితాలు సాధించుకోగలుగుతాం. ఉదయం ఏడు నుంచి పది గంటల్లోపు వీలైనంత ఎక్కువ ఓటింగ్‌ జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓటర్లు బయటకు వచ్చి ఓటు వేసేలా మన యంత్రాంగాన్ని కదిలించాలి. రాలేని వారి కోసం ఏర్పాట్లు చేయండి. పోలింగ్‌ బూత్‌ల వద్ద మంచినీళ్లు, కాస్త నీడ ఉండేలా చూడండి. బయటి ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తప్పనిసరిగా వచ్చి ఓటు వేసేలా పిలుపివ్వండి. కూటమి కార్యకర్తలు, అభ్యర్థులను ఈ విషయంలో ఇప్పటి నుంచే అప్రమత్తం చేయండి’ అని వారికి సూచించారు. ఇవి మంచి సూచనలని, వీటిని అనుసరిస్తామని చంద్రబాబు, పవన్‌ ఆయనతో చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితికి సంబంధించి తమ సొంత సర్వేల్లో వస్తున్న సమాచారాన్ని చంద్రబాబు ఆయనకు వివరించారు. కూటమి అఖండ విజయం సాధించబోతోందని, అధికార పార్టీ అభ్యర్థుల్లో కొందరు ఇప్పటికే కాడి కిందపడేశారని తెలిపారు. కూటమిలోని పార్టీల మధ్య ఓట్ల బదిలీ ఎలా ఉంటుందని మోదీ వారిని ఆరా తీశారు. ఆ ఇబ్బందేమీ లేదని, నూటికి నూరు శాతం ఓట్లు కూటమి అభ్యర్థులకు పడతాయని, ఆయా పార్టీల మద్దతుదారులు ఇతరులకు వేసే ఆలోచనలో లేరని పవన్‌ పేర్కొన్నారు. రోడ్‌షో పూర్తయిన తర్వాత బెంజ్‌సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక విశ్రాంతి గదిలో మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కాసేపు భేటీ అయ్యారు. అనంతరం రోడ్డు మార్గాన విమానాశ్రయానికి వెళ్లారు.

Updated Date - May 09 , 2024 | 04:07 AM