Share News

AP CS : సీఎస్‌గా నీరబ్‌ కుమార్‌

ABN , Publish Date - Jun 08 , 2024 | 04:02 AM

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు.

AP CS : సీఎస్‌గా నీరబ్‌ కుమార్‌

జీఏడీ ఉత్తర్వులు.. వెంటనే బాధ్యతల స్వీకరణ

అమరావతి, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఆయనను సీఎ్‌సగా నియమిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ శుక్రవారం జీవో 1034 జారీచేసింది. ఆ వెంటనే సచివాలయంలోని సీఎస్‌ చాంబర్‌లో టీటీడీ, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానాల వేద పండితుల ఆశీస్సుల మధ్య నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సీఎ్‌సగా అవకాశం కల్పించిన చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యాల కు అనుగుణంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జీఏడీ కార్యదర్శి సురేశ్‌ కుమార్‌, స్పెషల్‌ సీఎ్‌సలు ద్వివేది, రజత్‌ భార్గవ, విజయానంద్‌, పలువురు అధికారులు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని నీరబ్‌ కుమార్‌కు శుభాక్షాంక్షలు తెలిపారు.

ఉద్యోగ ప్రస్థానం ఇలా...

బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేసిన నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ 1988లో పశ్చిమ గోదావరి జిల్లాలో అసిస్టెంట్‌ కలెక్టర్‌(ట్రైనీ)గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 1990 లో తూర్పుగోదావరి సబ్‌ కలెక్టర్‌గా పని చేశారు. 1996లో ఖమ్మం కలెక్టర్‌గా, 1998 లో చిత్తూరు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1999లో యువజన సంక్షేమశాఖ డైరెక్టర్‌, శాప్‌ ఎండీగా పనిచేసి 2000లో కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. 2005లో రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ వీసీ అండ్‌ ఎండీగా, 2007లో పరిశ్రమలశాఖ కమిషనర్‌గా, 2009లో మత్స్యశాఖ కమిషనర్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జీఏడీ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2017లో కార్మిక ఉపాధి కల్పన శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2019 నవంబరు నుంచి చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌(సీసీఎల్‌ఏ)గా బాధ్యతలు నిర్వర్తించారు. 2022 ఫిబ్రవరి నుంచి రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు.

Updated Date - Jun 08 , 2024 | 04:56 AM