Share News

సిఫారసులకే ‘నైటింగేల్‌’..?

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:08 AM

రోగులకు అందించే విశిష్ఠ సేవలకు గుర్తింపుగా ప్రతి ఏటా నర్సులకు ప్రదానం చేసే ‘ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌’ అవార్డుల విషయంలో సిఫారసు ఉంటేనే పని అవుతోంది.

సిఫారసులకే ‘నైటింగేల్‌’..?

నిజాయితీగా సేవ చేసిన నర్సులకు మొండిచేయి

ప్రతిష్ఠాత్మక అవార్డుకు పదుల సంఖ్యలో దరఖాస్తులు

కానీ.. మూడు విభాగాల్లో కలిపి ఒకరి పేరే ప్రతిపాదన

స్ర్కూటినీ పారదర్శకంగా లేదని నర్సుల అభ్యంతరం

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): రోగులకు అందించే విశిష్ఠ సేవలకు గుర్తింపుగా ప్రతి ఏటా నర్సులకు ప్రదానం చేసే ‘ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌’ అవార్డుల విషయంలో సిఫారసు ఉంటేనే పని అవుతోంది. ఈ అవార్డు కోసం ప్రతి ఏటా రాష్ట్రాలు కొంతమంది నర్సుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాయి. ఆ జాబితా ఆధారంగా కేంద్రం ప్రతి సంవత్సరం మే 12న రాష్ట్రపతి చేతుల మీదగా ‘ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌’ అవార్డులు ప్రదానం చేస్తుంది. నర్సు అడ్మినిస్ట్రేటర్‌, నర్సు ఎడ్యుకేటర్‌, హాస్పిటల్‌ సర్వీసెస్‌(మూడు విభాగాల్లో అవార్డులు అందిస్తారు. ఈ ప్రక్రియ కోసం ఈ ఏడాది కూడా దరఖాస్తులు ఆహ్వానించగా.. ఏపీ నుంచి మూడు విభాగాల్లో పదుల సంఖ్యలో నర్సులు కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసుల లేఖలను జతచేసి దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఈ సారి మూడు విభాగాల్లో కలిపి అనేక దరఖాస్తులు వచ్చినప్పటికీ డీఎంఈ అధికారులు మాత్రం నర్సు అడ్మినిస్ట్రేటర్‌ విభాగంలో ఒకే ఒక పేరు పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నర్సింగ్‌ ఎడ్యుకేషన్‌, హాస్పిటల్‌ సర్వీసెస్‌ విభాగాల్లో మరికొంత మంది పేర్లు పంపించే అవకాశం ఉన్నా.. వారందరినీ లిస్టు నుంచి తొలగించి.. నర్సు అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో ఒకరి పేరు మాత్రమే పంపించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎంఈ సిఫారసు చేస్తున్న ఆ మహిళా ఉద్యోగినిపై డీఎంఈ విజిలెన్స్‌లో అనేక ఫిర్యాదులున్నాయి. ప్రతిష్ఠాత్మక నైటింగేల్‌ అవార్డు కోసం పంపించే లిస్ట్‌లో అలాంటి వ్యక్తి పేరు ఎందుకు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నర్సుల పేర్లను స్ర్కూటినీ చేసిన కమిటీ కూడా పారదర్శకంగా లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం రాత్రి 8 గంటల వరకూ స్ర్కూటినీ నిర్వహించి, అందులో సిఫారసులున్న వారి పేర్లను మాత్రమే డీఎంఈకి ప్రతిపాదించినట్లు తెలిసింది. ఏదీ ఏమైనా అధికారులు రాష్ట్రం పరువు తీయకుండా, నిజాయతీగా సేవలందించిన వారికి ఈ అవార్డు దక్కేలా చూడాలని సూచనలు వినిపిస్తున్నాయి.

Updated Date - Feb 15 , 2024 | 09:30 AM