‘కృష్ణపట్నం సిటీ’కి మహర్దశ
ABN , Publish Date - Nov 15 , 2024 | 03:42 AM
రాష్ట్రంలో తొలి గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ సిటీగా ‘కృష్ణపట్నం సిటీ’ రూపుదిద్దుకోనుందని నేషనల్ ఇండస్ర్టియల్ కారిడార్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఐసీడీసీ) సీఈవో, ఎండీ రజత్‌కుమార్ సైనీ పేర్కొన్నారు.
సీబీఐసీకి త్వరలో ప్రధాని మోదీ శంకుస్థాపన
2026 నాటికి పారిశ్రామిక స్మార్ట్ సిటీ ఏర్పాటు
మూడు దశల్లో 11,098 ఎకరాలు అభివృద్ధి
తొలి దశలోనే దాదాపు లక్ష మందికి ఉపాధి
జగన్ హయాంలో నత్తనడకన నోడ్‌ల పనులు
శరవేగంగా భూసేకరణ పూర్తిచేసిన చంద్రబాబు
‘ఆంధ్రజ్యోతి’తో ఎన్‌ఐసీడీసీ ఎండీ రజత్ కుమార్
న్యూఢిల్లీ, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తొలి గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ సిటీగా ‘కృష్ణపట్నం సిటీ’ రూపుదిద్దుకోనుందని నేషనల్ ఇండస్ర్టియల్ కారిడార్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఐసీడీసీ) సీఈవో, ఎండీ రజత్‌కుమార్ సైనీ పేర్కొన్నారు. ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సిటీ సమగ్ర వివరాలను వెల్లడించారు. కృష్ణపట్నం రూపురేఖలు మార్చనున్న చెన్నై-బెంగళూరు ఇండస్ర్టియల్ కారిడార్ (సీబీఐసీ)కు ప్రధాని మోదీ త్వరలో శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. కృష్ణపట్నం నోడ్‌లో పోర్ట్ ఆధారిత అభివృద్ధి పూర్తయి భవిష్యత్ అవసరాలను దృష్టి పెట్టుకుని నిర్మించే బ్రహ్మండమైన గ్రీన్ ఫీల్డ్ పారిశ్రామిక టౌన్‌షిప్ 2026 నాటికి వెలుస్తుందని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో వేగంగా చర్యలు తీసుకుని ఉంటే ఇప్పటికే అక్కడ భారీ అభివృద్ధి సాధ్యమయ్యేదని అన్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ కారిడార్ ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారని, భూసేకరణ శరవేగంతో పూర్తిచేశారని తెలిపారు. ప్రధాని మోదీ, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్‌తో చంద్రబాబు రెండు, మూడుసార్లు చర్చలు జరిపారని చెప్పారు. మూడు దశల్లో మొత్తం 11,098 ఎకరాలు ఈ కారిడార్‌లో అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ నోడ్ తొలిదశలోనే దాదాపు లక్ష మందికి ఉపాధి లభిస్తుందనిచెప్పారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పోర్టు, రహదారి అనుసంధానంతో పాటు నాణ్యమైన రవాణా సౌకర్యాలు ఇక్కడ ఏర్పడతాయని సైనీ చెప్పారు.
కొప్పర్తి నోడ్‌లో 54,500 ఉద్యోగాలు
ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్‌లకు కూడా భూసేకరణ పూర్తయిందని, పర్యావరణ అనుమతులు వచ్చాయని, మార్చిలోపు ఈపీసీ కాంట్రాక్టు పూర్తవుతుందని సైనీ తెలిపారు. 2027-28లో కొప్పర్తి నోడ్ పూర్తవుతుందన్నారు. జగన్ ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మించకూడదని నిర్ణయిస్తే... కొప్పర్తి నోడ్‌తో కడప జిల్లాను కూడా అభివృద్ధి పరిచేందుకు చంద్రబాబు చర్యలు తీసుకున్నారని కొనియాడారు. ఒక్క కొప్పర్తి నోడ్‌లోనే 54,500 ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా నిర్మిస్తున్న ఓర్వకల్లు నోడ్‌లో కర్నూలు జిల్లాలో 4,742 ఎకరాల మేరకు పెద్దఎత్తున పారిశ్రామికాభివృద్ధి జరుగుతందని, దాదాపు 45వేల మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఆహారోత్పత్తులు, జౌళి, ఇంజనీరింగ్ ఉత్పత్తులపై ఇక్కడ ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని వెల్లడించారు. కొప్పర్తి, ఓర్వకల్లు నోడ్‌లకు సంబంధించి జగన్ హయాంలో పనులు నత్తనడకన సాగాయని ఆరోపించారు. ఈ రెండ్ నోడ్‌లలోనూ స్మార్ట్ సిటీలు ఏర్పడతాయని, వీటికి భారీఎత్తున పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం ఉందని సైనీ పేర్కొన్నారు.