త్వరలో కొత్త రాజకీయ పార్టీ: హర్షకుమార్
ABN , Publish Date - Sep 17 , 2024 | 03:36 AM
వర్గీకరణకు వ్యతిరేకంగా కలసివచ్చే వ్యక్తులు, సంఘాలతో త్వరలోనే రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నాం’ అని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ప్రకటించారు.
గుంటూరు(తూర్పు), సెప్టెంబరు 16: ‘వర్గీకరణకు వ్యతిరేకంగా కలసివచ్చే వ్యక్తులు, సంఘాలతో త్వరలోనే రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నాం’ అని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ప్రకటించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ - క్రీమీలేయర్‌ను వ్యతిరేకిస్తూ గుంటూరులో సోమవారం సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన హర్షకుమార్ మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే విధి, విధానాలు, నాయకుడు ఎవరు? అనే విషయాలను ప్రకటిస్తాం. దేశం మొత్తం వర్గీకరణను వ్యతిరేకిస్తుంటే ఉమ్మడి ఏపీలో మాత్రం మాదిగలు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఓ వ్యక్తి సృష్టించిన ఉద్యమంతో ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన మాదిగలు పోరాటంలోకి వెళ్తున్నారు. క్రీమీలేయర్‌ను పొందుపరిచిన కారణంగా ఉద్యోగస్తుల పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయంలో కేంద్రం మరోసారి సమీక్షకు వెళ్లే అవకాశం ఉంది. జిల్లాల వారీగా వర్గీకరణ ఎలా చేపడతారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి’ అని అన్నారు. మరో అతిథి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ... ‘సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వర్గీకరణ చేపడతాం. జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తామని చంద్రబాబు చెప్పడం అభినందనీయం. వర్గీకరణ కంటే ముందు ప్రభుత్వ కొలువుల కోసం పోరాడాలి. దీనిపై యువతను చైతన్య పరచాలి’ అని అన్నారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్‌పర్సన్ కూచిపూడి విజయమ్మ, విశ్రాంత న్యాయమూర్తి దేవి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.