Share News

సభలో ఎలా మెలగాలో తెలిసింది

ABN , Publish Date - Nov 13 , 2024 | 04:55 AM

రాష్ట్ర బడ్జెట్‌పై తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మంగళవారం అమరావతి అసెంబ్లీ కమిటీ హాల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు.

సభలో ఎలా మెలగాలో తెలిసింది

అవగాహన సదస్సుపై కొత్త ఎమ్మెల్యేలు

అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బడ్జెట్‌పై తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మంగళవారం అమరావతి అసెంబ్లీ కమిటీ హాల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. సభలో పాటించాల్సిన అంశాలకు సంబంధించి మెటీరియల్‌ ఇచ్చారు. రాష్ర్టాభివృద్ధికి సభా సమావేశాలు ఎంత కీలకమో అవగాహన కలిగిందని నూతన ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు రుషికొండను చూపించాలని కోరారు.

సభ నియమ నిబంధనలు తెలిశాయి: భాష్యం ప్రవీణ్‌

కూటమి ప్రభుత్వానికి ఇది తొలి బడ్జెట్‌ సమావేశం. సభను హుందాగా నిర్వహించేందుకు సభ నియమ, నిబంధనలు వివరించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు ఏ అంశాలను చర్చించాలి, ఏవిధంగా మాట్లాడాలో చెప్పారు.

బడ్జెట్‌ రూపకల్పన గురించి తెలిసింది: నజీర్‌ అహ్మద్‌

బడ్జెట్‌ రూపకల్పనలో ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటారో తెలిపారు. చర్చలో ఏం మాట్లాడాలి, ఏవిధంగా చర్చించాలి అనేది చెప్పారు. ఏయే శాఖలకు ఎంత కేటాయించారు? ఎలా అభివృద్ధి చేస్తారో తెలిపారు.

సమస్యల ప్రస్తావనకు అసెంబ్లీనే వేదిక: యార్లగడ్డ

ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి అసెంబ్లీ చక్కని వేదిక. సభకు రాకుండానే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని, మైకు ఇవ్వలేదని జగన్‌ చెప్పడం దుర్మార్గం. సభకు రాకుండా మీడియాతోనే మాట్లాడతాం అనడం సిగ్గుచేటు. సభకు రానప్పుడు, ప్రజా సమస్యలు ప్రస్తావించలేనప్పుడు పోటీ చేయడం ఎందుకు?. ప్రతిపక్ష హోదాలేదని సభను బాయ్‌కాట్‌ చేయడం సిగ్గుచేటు.

ప్రతిపక్ష హోదా సర్టిఫికెట్‌ కాదు: గౌతు శిరీష

బడ్జెట్‌పై కొత్త సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. ప్రతిపక్ష హోదా అనేది సర్టిఫికెట్‌ కాదు. నిబంధల ప్రకారం ఇస్తారు.

జీతభత్యాలు తీసుకుంటూ సభకు రారా?: నల్లమిల్లి

సభలో ప్రజా సమస్యలను ఏవిధంగా లేవనెత్తాలి, సభలో ఎలా ప్రశ్నించాలనే విషయాలపై అవగాహన కల్పించారు. వైసీపీ నేత జగన్‌ జీతభత్యాలు తీసుకుంటూ సభకు ఎందుకు వెళ్లరని షర్మిల ప్రశ్నించిన దానికి జగన్‌ సమాధానం చెప్పాలి. .


సభా వ్యవహారాలపై ప్రాఽథమిక అవగాహన: కొలికపూడి

కొత్తగా ఎన్నికైన సభ్యులకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కోసం నిర్వహించిన ఈ సదస్సు అద్భుతంగా ఉపయోగపడుతుంది. బడ్జెట్‌పై, అందులోని టెక్నికల్‌ టెర్మినాలజీపైనా ఢిల్లీ సంస్థతో అవగాహన కల్పించడం శుభ పరిణామం.

చంద్రబాబు సీనియారిటీ ఎవరికీ లేదు: కంచర్ల

బడ్జెట్‌ రూపకల్పన, సభలో ప్రవేశపెట్టడం, సభ నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు, మంత్రి అయినప్పుడు, ముఖ్యమంత్రి అయినప్పుడు సభ ఎలా నడిచేదో, ఇప్పుడెలా జరుగుతుందో చంద్రబాబు చక్కగా వివరించారు. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చే సంప్రదాయాన్ని ప్రతిపక్షం పాటించడంలేదు.

2 గంటల్లోనే చెప్పేశారు: వసంత కృష్ణ ప్రసాద్‌

మేం గత ఐదేళ్లలో ఎమ్మెల్యేగా తెలుసుకున్న అంశాలను ఈ సదస్సులో రెండు గంటల్లోనే చెప్పేశారు. బడ్జెట్‌ అంశాలపై పూర్తి సమాచారం అందించారు. గత ప్రభుత్వం ఎప్పుడూ ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించలేదు. ప్రతిపక్ష సభ్యులు కూడా అసెంబ్లీలో ఉంటే అర్థవంతమైన చర్చ జరిగేది. ప్రజా సమస్యలు చర్చించడానికి సభకు రాకపోతే జగన్‌ రాజీనామా చేయాలి.

జగన్‌ పిరికిపంద: సోమిరెడ్డి

జగన్‌ ఒక పిరికిపంద. అవగాహన సదస్సుకు వచ్చే వారిని సైతం అడ్డుకున్నారు. జగన్‌ తరఫున గెలిచిన వారు కూడా ఇదేం కర్మ అంటూ బాధపడుతున్నారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలి. సాక్షిని సాక్షిగా పెట్టుకుని జగన్‌ తన ఇంట్లో అసెంబ్లీని నడుపుతున్నారు. బడ్జెట్లో ఏ అంశాలుంటాయి, పార్ట్‌ నోటీస్‌ అంటే ఏంటి? వంటి విషయాలు కొత్త సభ్యులకు తెలిశాయి.

Updated Date - Nov 13 , 2024 | 04:56 AM