ఏప్రిల్‌లో విశాఖకు కొత్త విమాన సర్వీసులు
ABN , Publish Date - Mar 28 , 2024 | 03:58 AM
విశాఖపట్నం విమానాశ్రయంలో గత నాలుగు నెలలుగా జరుగుతున్న రన్ వే రీ సర్ఫేసింగ్ పనులు పూర్తి కావడంతో విమానాల రాకపోకలపై నేవీ ఆంక్షలను తొలగించింది.
ఢిల్లీ, హైదరాబాద్‌కు అదనపు విమానాలు
9 నుంచి బ్యాంకాక్‌కు.. 26 నుంచి కౌలాలంపూర్ సర్వీసు
విశాఖపట్నం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం విమానాశ్రయంలో గత నాలుగు నెలలుగా జరుగుతున్న రన్ వే రీ సర్ఫేసింగ్ పనులు పూర్తి కావడంతో విమానాల రాకపోకలపై నేవీ ఆంక్షలను తొలగించింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 24/7 రాకపోకలకు అవకాశం కల్పిస్తామని విమాన సంస్థలకు ముందుగానే తెలియజేయడంతో వేసవి షెడ్యూళ్లను రూపొందించాయి. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయానికి రోజుకు 30 విమానాలు రాకపోకలు సాగుతున్నాయి. ఏప్రిల్‌లో మరో నాలుగు అదనపు సర్వీసులు రానున్నాయి. ఇందులో ఒకటి ఢిల్లీకి, మరొకటి హైదరాబాద్‌కు నడవనున్నాయి. రాత్రి సమయాల్లో ఈ రెండు నగరాల నుంచి రాకపోకలకు సర్వీసులు అవసరం ఉందని విశాఖ విమాన ప్రయాణికుల సంఘం కోరడంతో ఆ మేరకు అనుకూల సమయాల్లో కొత్త సర్వీసులు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి ఓ విమానం రాత్రి 10.55 గంటలకు ఇక్కడకు వచ్చి తిరిగి 11.35 గంటలకు బయలుదేరి వెళుతుంది. అలాగే ఢిల్లీ విమానం రాత్రి 8.10 గంటలకు విశాఖ వచ్చి తిరిగి 8.55 గంటలకు బయలుదేరి వెళుతుంది.
అంతర్జాతీయ సర్వీసులు
కరోనాకు ముందు మలిండో విమాన సంస్థ మలేసియాకు సర్వీసులు నడిపింది. ఆ తరువాత నిలిపివేసింది. ఇప్పుడు ఎయిర్ ఏషియా సంస్థ ఏప్రిల్ 26వ తేదీ నుంచి కౌలాలంపూర్ (మలేసియా)కు విమానాలు నడుపుతామని తెలిపింది. ఈ విమానం రాత్రి 9.30 గంటలకు ఇక్కడికి వచ్చి తిరిగి 10 గంటలకు బయలుదేరి వెళుతుంది. థాయ్‌ల్యాండ్ (బ్యాంకాక్)కు విమానం ఏప్రిల్ 9వ తేదీ నుంచి మొదలవుతుంది. వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శనివారం) ఈ విమాన సర్వీసు అందుబాటులో ఉంటుంది. బ్యాంకాక్ నుంచి రాత్రి రాత్రి 11.20 గంటలకు విశాఖపట్నం వస్తుంది. ఇక్కడి నుంచి అర్ధరాత్రి 11.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 4.15 గంటలకు బ్యాంకాక్ చేరుతుంది.