వైసీపీకి కొత్త సలహాదారు
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:16 AM
సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీసీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఆ పార్టీ నేతలు సింహంతో పోల్చారు. జగన్ కూడా ఎందరు కలసి వచ్చినా తన వెంట్రుక కూడా పీకలేరంటూ బహిరంగ సమావేశాల్లో వ్యాఖ్యానించారు.
పార్టీ నిర్మాణం, బలోపేతం కోసం ఆళ్ల మోహన సాయిదత్ నియామకం
కీలక బాధ్యతల నుంచి సజ్జల అవుట్
ఎన్నికల వ్యూహకర్త పీకే, రిషిరాజ్‌తో కటీఫ్
తల్లి, చెల్లెలు ఏకంగా పార్టీకి దూరం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీసీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఆ పార్టీ నేతలు సింహంతో పోల్చారు. జగన్ కూడా ఎందరు కలసి వచ్చినా తన వెంట్రుక కూడా పీకలేరంటూ బహిరంగ సమావేశాల్లో వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయాక తత్వం బోధపడింది. ఇప్పుడు ఆయన పార్టీ నిర్మాణం, బలోపేతం కోసం సలహాదారు సేవలు అవసరమయ్యాయి. వైసీపీ నిర్మాణాత్మక సలహాదారుగా ఆళ్ల మోహన సాయిదత్‌ను నియమించినట్టు జగన్ అధికారికంగా ప్రకటించారు. పార్టీని స్థాపించక ముందో, స్థాపించిన తొలినాళ్లలోనో, తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న సమయంలోనో నిర్మాణాత్మక సలహాదారులను నియమించుకోవడం రాజకీయ పార్టీలకు ఆనవాయితీ. కానీ వరుసగా ఉప ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు రెండుసార్లు సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్న పార్టీకి ఇప్పుడు కొత్తగా నిర్మాణాత్మక సలహాదారుడిని జగన్ నియమించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
ఒక్కొక్కరు దూరం...
జగన్ ఎవరినీ ఎక్కువ కాలం నమ్మరని ఆయనతో సన్నిహితంగా మెలిగినవారే చెబుతుంటారు. పార్టీ స్థాపించిన కొత్తలో జగన్ వెంట నడిచి, ఆయన జైలుకు వెళ్లిన సమయంలో ప్రజల్లో వైసీపీని బలోపేతం చేసిన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిల సైతం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక తొలి నుంచి జగన్‌ను నమ్ముకుని ఉన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపినా.. 2019లో అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెట్టారు. పార్టీలో అంతా తానై వ్యవహరించేలా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని అందలం ఎక్కించారు. ప్రభుత్వ శాఖలేవైనా వాటిపై మాట్లాడే అధికారాన్ని మంత్రులకు కూడా లేకుండా సజ్జలకు కట్టబెట్టారు. సజ్జలతో పాటు ఆయన కుమారుడు భార్గవరెడ్డిని కూడా జగన్ అందలం ఎక్కించారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా నియమించారు. ఇప్పుడు వారిద్దరినీ జగన్ దూరం పెట్టారని పార్టీ నేతలు అంటున్నారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పడు జగన్ పార్టీ నిర్మాణం, బలోపేతం కోసం ఐప్యాక్ ప్రశాంత్ కిశోర్ (పీకే)తో ఒప్పందం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చాక జగన్... ప్రశాంత్ కిశోర్‌ను దూరం పెట్టారు. ఐప్యాక్ టీమ్ రిషిరాజ్‌ను చేరదీశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయాక రిషిరాజ్ టీమ్‌కు కూడా జగన్ ప్యాకప్ చెప్పేశారు.
నియంతృత్వ పోకడలు
సాధారణంగా రాజకీయ పార్టీలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకుంటాయి. ఇందుకోసం కార్యవర్గాన్ని నియమిస్తాయి. కార్యవర్గ సమావేశాలను నిర్వహించి మార్గదర్శకం చేయడంతో పాటు సలహాలూ సూచనలూ తీసుకుంటాయి. అయితే నియంతృత్వ పోకడలకు పోయే జగన్ ఏనాడూ ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీని నడపలేదన్న విమర్శలున్నాయి. తనను జీవితకాల అధ్యక్షుడిగా జగన్ ప్రకటన చేయించుకున్నారు. ఎన్నికల కమిషన్ నుంచి అభ్యంతరాలు రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు వందలాది మందిని సలహాదారులుగా నియమించిచినా వారి నుంచి ఏనాడూ ఒక్క సలహా కూడా తీసుకోలేదు. ఎవరైనా సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే వారిని తొలగించేవారు. అలాంటిది ఇప్పుడు పార్టీకి ఓ సలహాదారుని నియమించారు. ఆయన మాటైనా వింటారా లేక గతంలోలా జగన్ వ్యవహరిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆకస్మిక నియామకంపై పార్టీలో చర్చ జరుగుతోంది.