Share News

జగన్‌ సర్కారు నిర్లక్ష్యం.. నారుమళ్లకు నీళ్లు కరువు

ABN , Publish Date - Jun 11 , 2024 | 02:40 AM

ఏటా జలాశయాల్లో నీటి నిల్వలను బట్టి జూన్‌లోనే ప్రభుత్వం సాగునీటి విడుదలపై షెడ్యూల్‌ ప్రకటించాలి. ఈ ఏడాది జగన్‌ సర్కారు నిర్లక్ష్యం,

జగన్‌ సర్కారు నిర్లక్ష్యం.. నారుమళ్లకు నీళ్లు కరువు

ఎన్నికల హడావుడితో గాలికొదిలేసిన జగన్‌ ప్రభుత్వం

కాలువలకు నీటి విడుదలపై ప్రణాళిక వేయని దుస్థితి

సార్వా వరిపై రైతుల్లో సందిగ్ధం.. కొత్త ప్రభుత్వంపైనే ఆశలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఏటా జలాశయాల్లో నీటి నిల్వలను బట్టి జూన్‌లోనే ప్రభుత్వం సాగునీటి విడుదలపై షెడ్యూల్‌ ప్రకటించాలి. ఈ ఏడాది జగన్‌ సర్కారు నిర్లక్ష్యం, జలవనరుల శాఖ నిర్లిప్తత కారణంగా సార్వా వరి సాగుకు నీటి సరఫరాపై సందిగ్ధత నెలకొంది. మాజీలు కాబోతున్న పాలకులు ఎన్నికలపై పెట్టిన దృష్టి రైతులపై పెట్టలేదు. ఫలితంగా వరిసాగుపై రైతులు అయోమయంలో ఉన్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించి, ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమైంది. వారం రోజులుగా అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తొలకరి వానలకు సాగు మొదలైంది. మెట్ట ప్రాంతాల రైతులు పచ్చిరొట్ట పైర్లతో పాటు అపరాల పంటలు వేస్తున్నారు. పత్తి సాగుకు అనువైన వాన ఇంకా పడలేదు. మిరప సాగుకు ఇంకా నెలపైగా సమయం ఉంది. సాధారణంగా వరినాట్లు జూలై 15 తర్వాత వేయడం ఆనవాయితీ. అయితే ముందుగా వరి నారుమళ్లు పోయడానికి కాలువలకు ప్రభుత్వం నీరు విడుదల చేయాల్సి ఉంది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో మరో వారం రోజుల్లో నారుమళ్లు పోయడం ప్రారంభిస్తారు. వంశధార, నాగావళికి ఎగువ నుంచి నీరు రావాల్సి ఉంది. పెన్నా, తుంగభద్ర ప్రాంతాల్లో వరద నీరు వస్తేనే ఆయకట్టుల్లో వరి సాగు పుంజుకుంటుంది. నాగార్జునసాగర్‌ ఆయకట్టులో నీటి విడుదలపై ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వకుంటే వరి సాగు జరగని పరిస్థితి. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించినా.. ఖరీఫ్‌ కార్యాచరణ ప్రణాళికతో పాటు కాలువలకు నీటి విడుదలపై జగన్‌ సర్కార్‌ ఎలాంటి ముందస్తు ప్రణాళికను ప్రకటించలేదు. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలంతా ఎన్నికలలో తలమునకలు కావడంతో అధికారులు సాగునీటి సరఫరాపై శ్రద్ధ పెట్టలేదు. ఫలితంగా జూన్‌ 10వ తేదీ వచ్చినా రైతులకు వరి నారుమళ్లకు నీటి సరఫరాపై స్పష్టత లేకుండా పోయింది. మరోవైపు జలాశయాల్లో నీటి మట్టాలు కనీన స్థాయి కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో నీటి విడుదలపై స్పష్టత లేక వరి సాగు ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు జలాశయాలపై సమీక్ష జరిపి, వరి సాగుకు నీటి పంపిణీపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించే వరకు రైతులు ఎదురు చూడాల్సిందే.

గతేడాది రైతులకు నష్టం

2022 జూన్‌లో ముందస్తుగా సాగునీరు విడుదల చేసి అక్టోబరులోపు సార్వా, మార్చిలోపు దాళ్వా పంట పూర్తి చేసి మళ్లీ తొలకరి వచ్చేలోపు మూడో పంటగా స్వల్పకాలిక రకాలు సాగు చేయాలని జగన్‌ ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. బోర్ల కింద వరి సాగు చేయకుండా, జలాశయాల ఆయకట్టులో వరి పండించాలంటూ హడావుడి చేసిన జగన్‌ సర్కార్‌.. 2023 ఖరీ్‌ఫలో సాగునీటి విడుదలపై ముందస్తు ప్రణాళికలను ప్రకటించలేదు. ఆ ఏడాదంతా తీవ్ర వర్షాభావంతో జలాశయాలన్నీ అడుగంటిపోయాయి. దీంతో నిరుడు సకాలంలో సాగునీరు అందక సార్వా, దాళ్వా వరి సాగు బాగా ఆలస్యమయ్యాయి. ఫలితంగా గత డిసెంబరులో మిచౌంగ్‌ తుఫాన్‌తో సార్వా వరి పంట నీటిపాలు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో దాళ్వా వరి సాగు కూడా ఆలస్యమై మొన్న వేసవిలో వరి కోత కోసి అమ్ముకున్న పరిస్థితి. ప్రతికూల వాతావరణంతో ధాన్యం ఉత్పత్తి తగ్గడంతో బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి.

ఏటా తగ్గుతున్న వరి సాగు

రాష్ట్రంలో ఖరీఫ్‌ (సార్వా) సీజన్‌లో 40 లక్షల ఎకరాల్లో, రబీ (దాళ్వా) సీజన్‌లో 20 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగాల్సి ఉంది. కానీ గత ఐదేళ్లుగా వరి సాగు క్రమంగా తగ్గుతోంది. ముఖ్యంగా ఖరీఫ్‌ వరి సాగు గణనీయంగా తగ్గింది. వరి నారుమళ్లకు నీటి గ్యారెంటీ లేకపోవడం, కాలువలు అధ్వానంగా మారడం, వరి సాగు ఖర్చులు పెరిగిపోవడం, ధాన్యానికి గిట్టుబాటు ధర రాకపోవడం, ధాన్యం కొన్న ప్రభుత్వం సకాలంలో రైతులకు నగదు చెల్లింపులు జరపకపోవడం, ముఖ్యంగా కౌలురైతులకు ప్రభుత్వం నుంచి పెద్దగా ప్రోత్సాహకాలు అందకపోవడం వంటి కారణాలతో ఏటేటా వరి సాగు తగ్గుతున్నట్లు రైతులు చెబుతున్నారు. దీని ప్ర భావం బియ్యం ధరలపై పడుతోంది. ఈ పరిస్థితిపై కొత్త ప్రభుత్వం సమీక్ష జరపాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 2023 ఖరీ్‌ఫలో 39.70 లక్షల ఎకరాల సాగు లక్ష్యంలో 32.62 లక్షల ఎకరాల్లోనే వరి సాగైంది. 2023-24 రబీలో 20.50 లక్షల ఎకరాల సాగు లక్ష్యంలో 14.01 లక్షల ఎకరాలకే పరిమితమైంది. 2022-23 రబీ లో 20.77 లక్షల ఎకరాల సాగు లక్ష్యంలో 16.40 లక్షల ఎకరాల్లోనే పండింది. 2022 ఖరీ్‌ఫలో 40.75 లక్షల సాగు లక్ష్యంలో 35.97 లక్షల ఎకరాల్లోనే వరి సాగైంది.

Updated Date - Jun 11 , 2024 | 02:40 AM