Share News

మానవాభివృద్ధికి మెరుగులు ప్రమాణాలు పెంచడానికి నవరత్నాలు

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:58 AM

రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచడానికి తమ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుందని గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు.

మానవాభివృద్ధికి మెరుగులు ప్రమాణాలు పెంచడానికి నవరత్నాలు

పాఠశాలల్లో మౌలికవసతులకు నాడు-నేడు

వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు చర్యలు

సామాజిక భద్రతలో భాగమే దిశ చట్టం

శాసనసభలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం

అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచడానికి తమ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుందని గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. సోమవారం అమరావతి శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ప్రభుత్వం మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచడానికి నవరత్నాలను ప్రారంభించిందన్నారు. సామాజిక, ఆర్థిక, విద్యా సాధికారితపై దృష్టి సారించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసాధారణ పనితీరు, పేదల అనుకూల పథకాలు, విధానాల ద్వారా అందించిన సానుకూల, స్పష్టమైన ఫలితాలు కంటి ముందు కనిపిస్తున్నాయని తెలిపారు. విద్యపై పెట్టుబడి ఎప్పుడూ అత్యధిక రాబడిని ఇస్తుందని నమ్మిన తమ ప్రభుత్వం, ప్రత్యేకంగా ఇప్పటి వరకు రూ.73,417 కోట్లు ఈ రంగంపై ఖర్చు చేసిందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు మన బడి, నాడు-నేడు కార్యక్రమాల ద్వారా రూ.7163 కోట్లు వ్యయం చేశామని తెలిపారు. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థుల ఆకాంక్షలకు మద్దతిస్తూ గత పది నెలల్లో జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద రూ.107.08 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశామన్నారు. సామాజిక భద్రతలో భాగంగానే దిశా చట్టం రూపొందిం చామన్నారు. ‘‘సమాజ పురోగతి అత్యంత దుర్భలమైన, బలహీనుల స్థితిని బట్టి నిర్ణయించబడాలి. అభివృద్ధి అంచులకు దూరంగా ఉన్న వారిని నిజమైన అభివృద్ధి కోసం ఇతరుల స్థాయికి తీసుకురావాల్సి ఉంది’’ అన్న గాఽంధీజీ పలుకులతో గవర్నర్‌ తన బడ్జెట్‌ ప్రసంగం ముగించారు.

Updated Date - Feb 06 , 2024 | 03:58 AM