Share News

నంద్యాల వైద్యుడికి జాతీయ పురస్కారం

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:38 AM

నంద్యాలకు చెందిన ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణుడు డాక్టర్‌ చిత్తులూరి మధుసూదనరావుకు జాతీయ స్థాయి జీవన సాఫల్య పురస్కారం (లైఫ్‌ టైం ఆచీవ్‌మెంట్‌ పురస్కారం)ను భారతదేశ చెవి, ముక్కు, గొంతు వైద్యుల సంఘం అందజేసింది.

నంద్యాల వైద్యుడికి జాతీయ పురస్కారం

తొలి తెలుగు వైద్యుడు కావడం విశేషం

నంద్యాల టౌన్‌, జనవరి 7: నంద్యాలకు చెందిన ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణుడు డాక్టర్‌ చిత్తులూరి మధుసూదనరావుకు జాతీయ స్థాయి జీవన సాఫల్య పురస్కారం (లైఫ్‌ టైం ఆచీవ్‌మెంట్‌ పురస్కారం)ను భారతదేశ చెవి, ముక్కు, గొంతు వైద్యుల సంఘం అందజేసింది. ఆదివారం బెంగుళూరులో దేశం నలుమూలల నుంచి వచ్చిన మూడు వేల మంది వైద్యుల సమక్షంలో, నాలుగు రోజులుగా జరుగుతున్న 75వ జాతీయ చెవి, ముక్కు, గొంతు వైద్యుల సదస్సులో బంగారు పతకం, అవార్డు సైటేషన్‌ (పురస్కార ప్రశంసా పత్రం) ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు. సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ శంకర్‌ మెడికేరి, కార్యదర్శి డాక్టర్‌ కౌశల్‌షేథ్‌, బెంగుళూరు జయదేవ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మంజునాథ్‌, సదస్సు నిర్వాహక చైర్మన్‌ డాక్టర్‌ విజయేంద్ర, నిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ సునీల్‌ నారాయణ దత్‌ ఈ పురస్కారాన్ని డాక్టర్‌ మధుసూదన్‌రావుకు అందజేశారు. మూడు దశాబ్దాలకుపైగా ప్రతి ఏటా పేదలకు ఉచిత శస్త్ర చికిత్సల నిర్వహణతో పాటు, పేద విద్యార్థులకు వడ్డీ రహిత రుణాల పంపిణీ, హిందూ స్మశాన వాటికల అభివృద్ధి, కళాక్రీడల అభివృద్ధి కోసం చేసిన కృషికి ఈ పురస్కారం అందిస్తున్నామని ప్రశంసాపత్రంలో పేర్కొన్నారు. ఈ జాతీయ అత్యున్నత పురస్కారం తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అందుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా డాక్టర్‌ మధుసూదన్‌రావుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుల ఫోరం చైర్మన్‌ డాక్టర్‌ జి.రవికృష్ణ, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జయచంద్ర నాయుడు, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఫణిధర్‌, రామకృష్ణా విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ జి.రామకృష్ణారెడ్డి, గురురాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ పి. దస్తగిరిరెడ్డి తదితర ప్రముఖులతో పాటు కళారాధన, లయన్స్‌ క్లబ్‌, రోటరీ క్లబ్‌ ప్రతినిదులు, పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Updated Date - Jan 08 , 2024 | 12:38 AM