Share News

‘ఏఐ’తో రాష్ట్రాభివృద్ధి రయ్‌రయ్‌!

ABN , Publish Date - Oct 27 , 2024 | 04:37 AM

కృత్రిమ మేథ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ)ను అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నట్టు మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

‘ఏఐ’తో రాష్ట్రాభివృద్ధి రయ్‌రయ్‌!

ప్రజా పాలనలోనూ పారదర్శకత

ప్రతి వంద రోజులకూ లక్ష్యాలు

పీ-ఫోర్‌ విధానంతో పేదరిక నిర్మూలన

పెట్టుబడులకు రాష్ట్రంలో సువర్ణావకాశం

పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా

విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు

అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో భేటీ

అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేథ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ)ను అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నట్టు మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ‘వై 2కే’ బూమ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో సమాచార సాంకేతిక(ఐటీ) రంగం అభివృద్ధి చెందిందని తెలిపారు. అదేవిధంగా ఏఐతో ఏపీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించవచ్చని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేశ్‌.. శాన్‌ఫ్రాన్సిస్కోలోని పారిశ్రామికవేత్తలతో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్‌ ఫ్రెండ్లీ విధానాలను వివరించారు. భారత్‌లో రాబోయే 25 ఏళ్లలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన, పారదర్శకమైన పాలనను అందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక తమలాంటి యువ నాయకత్వాన్ని మరింత ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు మంత్రి వర్గంలో 17 మంది కొత్తవారే ఉన్నారన్నారు. విభజిత ఏపీలో ఉత్పాదకరంగం, సంప్రదాయేతర ఇంధనోత్పత్తి, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్‌ రంగాల్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలున్నాయని తెలిపారు. పెట్టుబడిదారులకు రాష్ట్రం సువర్ణావకాశమని పేర్కొన్నారు.

ప్రతి వంద రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకుని ఏపీ సమగ్ర అభివృద్ధికి కృషి సల్పుతున్నామని వివరించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో సంస్కరణలు తెస్తున్నామని మంత్రి లోకేశ్‌ తెలిపారు. నైపుణ్యతతో కూడిన మానవ వనరులను అందించడానికి కృషి చేస్తున్నామని, దీనివల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు సులభతరం అవుతాయని చెప్పారు. కొత్త ఆవిష్కరణల కోసం విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కేజీ టు పీజీ వరకు పాఠ్యాంశాల్లో మార్పులు చేస్తున్నట్టు లోకేశ్‌ వెల్లడించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అక్కిరాజు నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. దీనిలో ఎన్‌విడియా వైస్‌ప్రెసిడెంట్‌ రాము అక్కిరాజు, విప్రో ప్రెసిడెంట్‌ నాగేంద్ర బండారు, న్యూటానిక్స్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ రామస్వామి, దేవ్‌రేవ్‌ సీఈవో ధీరజ్‌ పాండే, గ్లీన్‌ సంస్థ సీఈవో అరవింద్‌ జైన్‌, నెక్సస్‌ వెంచర్స్‌ ఎండీ జిష్ణు భట్టాచార్య, సిస్కో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రవిచంద్ర, సేల్స్‌ ఫోర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రమేశ్‌ రాగినేని, స్పాన్‌ ఐవో సీఈవో రాజా కోడూరి, ఇవాంటి చీఫ్‌ ప్రొడక్షన్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ ముక్కామల, హిటాచీ వంటారా సీఈవో ఆశిష్‌ భరత్‌, గుడుల్‌ క్లౌడ్‌ జనరల్‌ మేనేజర్‌ పునిపొట్టి, వెస్ట్రన్‌ డిజిటల్‌ సీఈవో శేషు తిరుమల, ఈక్వెనిక్స్‌ గ్లోబల్‌ ఎండీ జోషి, త్రీడీగ్లాస్‌ సొల్యూషన్స్‌ సీఈవో బాబు మండవ, పారిశ్రామికవేత్తలు వంశీ బొప్పన, రాజీవ్‌ ప్రతాప్‌, మంత్రిప్రగడ సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.


డ్రైవర్‌ లెస్‌ ట్రక్‌ను ప్రారంభించిన లోకేశ్‌

ఏపీలో పరిశ్రమల స్థాపనకు మెరుగైన ఎకో సిస్టమ్‌ను కల్పించామని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. సరైన ప్రతిపాదనలతో వస్తే.. వెనువెంటనే అనుమతులు, ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ‘ఫాల్కన్‌ ఎక్స్‌’ అనుబంధ సంస్థ బోసన్‌ మోటార్స్‌ రూపొందించిన ఇంటెలిజెంట్‌ ఎలక్ర్టికల్‌ లైట్‌ యుటిలిటీ వెహికల్‌(డ్రైవర్‌ లెస్‌ ట్రక్‌)ను శాన్‌ జోస్‌ మేయర్‌, మల్పిటాస్‌ మేయర్‌లతో కలిసి లోకేశ్‌ ప్రారంభించారు. ఏపీలో పురుడు పోసుకున్న బోసన్‌ మోటార్స్‌ అంతర్జాతీయ స్థాయికి ఎదగడంపై లోకేశ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ఏపీలో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణ వ్యూహాలను ‘ఆన్‌వ్యూ సొల్యూషన్స్‌’ అధినేత జోయల్‌ వివరించారు. ఫాల్కన్‌ ఎక్స్‌ ప్రతినిధులు.. తమ సంస్థ సిరిస్‌ ఏ స్టార్ట్‌పలతో వివిధ రంగాల్లో ఆవిష్కరణలకు సిద్ధంగా ఉందన్నారు. డిజిసెర్ట్‌ సీఈవో అమిత్‌ సిన్హా తమ సంస్థ కార్యకలాపాలను వివరించారు. ఆయా సంస్థల అనుబంధ విభాగాలను ఏపీలో ఏర్పాటు చేయాలని లోకేశ్‌ కోరారు.

Updated Date - Oct 27 , 2024 | 04:37 AM