Share News

నా ఓటు నాకే..

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:20 AM

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ప్రచారంలో భాగంగా వీధుల్లోని హోటళ్లలో దోశలు, బజ్జీలు వేయడం, టీ తయారు చేయడం వంటివి చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు.

నా ఓటు నాకే..

అదే నా చిరకాల కోరిక

నిప్పట్లు విక్రయించే ఉమాదేవి ఎమ్మెల్యేగా నామినేషన్‌

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ప్రచారంలో భాగంగా వీధుల్లోని హోటళ్లలో దోశలు, బజ్జీలు వేయడం, టీ తయారు చేయడం వంటివి చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ‘మీ ఓటు నాకే వేయాలి’ అని కోరుతుంటారు. అయితే.. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం సుభా్‌షరోడ్డు వీధిలోని వెలవలూరి ఉమాదేవి (64) కాస్త భిన్నం. చిన్న హోటల్‌లో నిప్పట్లు (అత్తిరాసాలు) వేసి విక్రయించే ఉమాదేవి.. మాత్రం తన ఓటు తనకే వేసుకోవాలనే కోరికతో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. దీనికోసం రూ.10 వేలు డిపాజిట్‌ కట్టి మదనపల్లె ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఆమె ఇలా నామినేషన్‌ వేయడం ఇది వరుసగా మూడోసారి. కనీసం ఐదో తరగతి కూడా చదవని ఉమాదేవి తన కష్టార్జితంతో బిడ్డలకు పెళ్లిళ్లు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు తనకే వేసుకోవాలనేది ఆమె చిరకాల కోరిక. స్నేహితులు, బిడ్డల ప్రోత్సాహంతో 2014 ఎన్నికల్లో మదనపల్లెలో ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేసిన ఉమాదేవికి 170 ఓట్లు పడ్డాయి. 2019 ఎన్నికల్లో కూడా నామినేషన్‌ వేశారు. అయితే నామినేషన్‌ పత్రంలో తప్పులు ఉండటంతో రిజెక్ట్‌ చేశారు. 2024 ఎన్నికల్లో కూడా ఉమాదేవి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సారి తన నామినేషన్‌ రిజెక్ట్‌ కాకుండా లాయర్‌ ద్వారా నాలుగు సెట్ల పత్రాలు పూర్తి చేయించారు. సోమవారం ఒక సెట్టు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయగా, మరో మూడు సెట్లు బుధవారం ఇవ్వనున్నారు.

- మదనపల్లె టౌన్‌

Updated Date - Apr 24 , 2024 | 03:20 AM