Share News

మున్సిపల్‌ చర్చలు విఫలం

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:17 AM

మున్సిపల్‌ కార్మికుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంత్రులు బొత్స సత్యనారాయణ,

మున్సిపల్‌ చర్చలు విఫలం

సమాన పనికి సమాన వేతనంపై కార్మిక సంఘాల పట్టు

సాధ్యం కాదన్న మంత్రులు, సజ్జల

17 దాకా సమ్మె ఆపండి.. ఈలోపు సమస్యలు పరిష్కరిస్తామని హామీ

సమ్మె మరింత ఉధృతం చేస్తామన్న సంఘాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మున్సిపల్‌ కార్మికుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, ఏపీ మున్సిపల్‌ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ పోరుమావిళ్ల సుబ్బారాయుడితోపాటు ఆయా మున్సిపల్‌ కార్మికుల సంఘాల నేతలు చర్చల్లో పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు వచ్చిన కార్మిక సంఘాల నేతలు మంత్రులు వచ్చేదాకా మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. సమావేశం ప్రారంభంకాగానే ప్రధాన డిమాండ్లను చెప్పాలని మంత్రి బొత్స అడిగారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, నాన్‌ పీహెచ్‌ కేటగిరి ఉద్యోగులకూ హెల్త్‌ అలవెన్స్‌ రూ.6 వేలు ఇవ్వాలని, మున్సిపల్‌ కార్మికులను క్రమబద్ధీకరించాలనే ప్రఽధాన డిమాండ్లను కార్మిక సంఘాల నేతలు మంత్రుల ముందుంచారు. సమాన పనికి సమాన వేతనంపైగాని, పర్మినెంట్‌ చేసే విషయంపైగాని సీఎం జగన్‌ హామీ ఇవ్వలేదని మంత్రులు, సజ్జల బుకాయించే ప్రయత్నాలు చేయగా, జగన్‌ ఇచ్చిన హామీకి సంబంధించి వీడియోను కార్మిక సంఘాల నేతలు ప్రదర్శించారు. మీ డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పిన మంత్రులు.. కొంత విరామం ఇచ్చి తర్వాత మరోసారి సమావేశమయ్యారు. ఆ తర్వాత సజ్జల మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం సాధ్యం కాదని, అలా ఇస్తే ఆప్కో్‌సలో ఉన్న 90 వేల మంది ఉద్యోగులు కూడా అడుగుతారని చెప్పారు. మిగతా సమస్యలకు సంబంధించి కొన్ని జీవోలను వెంటనే ఇస్తామని, మరికొన్ని జీఓలను మళ్లీ అమలు చేస్తామన్నారు. ఈ నెల 17 దాకా సమ్మె విరమించాలని, ఈలోపు సమస్యలను పరిష్కరిస్తామని మంత్రులు సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు. అయితే కార్మిక సంఘాలు మాత్రం సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె నుంచి వెనక్కి తగ్గేదిలేదని తెగేసి చెప్పారు.

జగన్‌ చెప్పినవే అమలు చేయమన్నాం

మున్సిపల్‌ కార్మికులు ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్నామని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు చెప్పారు. 8 రోజులుగా మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేస్తున్నారని, చర్చలకు పిలిచిన మంత్రులు ఉదయం ఒక రకంగా సాయంత్రం మరో రకంగా మాట్లాడారని అన్నారు. ఈరోజు నుంచి విద్యుత్‌, నీటి సరఫరా కూడా నిలిపేస్తామన్నారు. సమ్మెను ఈ నెల 17 దాకా వాయిదా వేయాలని మంత్రులు కోరారని, అయితే అది సాధ్యం కాదన్నారు.

సమ్మె విరమించాలని కోరాం: మంత్రి సురేశ్‌

మున్సిపల్‌ కార్మికులను సమ్మె విరమించాలని కోరామని, వారి డిమాండ్లలో కొన్నింటికి జీఓలు విడుదల చేయాలని నిర్ణయించామని మున్సిపల్‌ పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. నాన్‌ పీహెచ్‌ కేటగిరి ఉద్యోగులకు రూ.6 వేల ఆక్యుపెన్సీ హెల్త్‌ అలవెన్సు ఇస్తామన్నారు. మరికొన్ని అంశాలపై మరోసారి చర్చలు జరపాలని, అప్పటి వరకు సమ్మె విరమించాలని కోరామన్నారు. సమ్మె ఇబ్బందులున్నచోట ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - Jan 03 , 2024 | 07:19 AM