Share News

ముక్కంటీ.. మూడో కన్ను

ABN , Publish Date - Jan 08 , 2024 | 05:38 AM

శతకకారులకు ప్రసిద్ధి పొందిన ఆ ముక్కంటి క్షేత్రంలో ఇప్పుడు ఎటుచూసినా ఆ శాసనసభ్యుని నామస్మరణే! బియ్యం గుప్పిట పట్టినట్టు భూములను కబళిస్తారని ఆయన గురించి తెలిసినవారు చెప్పేమాట! ఆయన నియోజకవర్గంలో ప్రభుత్వ భూములకే గ్యారంటీ లేదు.

ముక్కంటీ.. మూడో కన్ను

భూదందాల నుంచి గ్రావెల్‌ తవ్వకందాకా ఎమ్మెల్యే నామస్మరణే

బియ్యం గుప్పిట పట్టినట్టు ఎక్కడి భూములైనా హస్తగతం

కొందరు రెవెన్యూ సిబ్బంది అండతో కొత్త పుంతలు

పోలీస్‌ బెటాలియన్‌ భూములూ చదును చేసేశారు

పేదలకు భూసేకరణలో పెద్దఎత్తున అక్రమాలు

కాలువ, కుంట, చెరువు పోరంబోకుకూ పట్టాలు

అనుచరుల పేరిట రాయించి.. సర్కారీ పరిహారం

ఆరోపణలున్న తహశీల్దార్ల బదిలీలకు అడ్డుకట్ట

ఏ నియోజకవర్గంపైనా లేనన్ని ఫిర్యాదులు ఇక్కడే..

పరాకాష్ఠకు చేరిన ఆ నేత రాజకీయ అవినీతి

విమానాశ్రయం, ఎలకా్ట్రనిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లు వంటివి ఉండటంతో ముఖ్యనేత నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియను రెవెన్యూ అధికారులు విస్తృతంగా చేపట్టారు. దీంతో భూములకు విలువ బాగా పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు ముఖ్యనేత పావులు కదిపారు. అంతే..బంజరు, పోరంబోకు, కాలువ, కుంట, చెరువు పోరంబోకు, అనాధీనం, గయ్యాలు

కేటగిరీలకు చెందిన భూములకు రాత్రికి రాత్రే అక్రమంగా పట్టాలు పుట్టించారు.!

పేదలకు ఇళ్ల స్థలాల కోసం 63మంది రైతులకు సంబంధించిన 120 ఎకరాల డీకేటీ భూములను అధికారులు సర్వే చేసి గుర్తించారు. సేకరణకు అనుమతిస్తున్నట్టు సంతకాలు తీసుకున్నారు. కరోనా కారణంగా కొంతకాలం ప్రక్రియ ఆగింది. ఆ తర్వాత అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆ ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. అంతే.. అధికారుల స్వరం మారిపోయింది. 120 ఎకరాల్లో 90 ఎకరాలకే లెక్కగట్టి.. మిగతా 30 ఎకరాల్లో కాలువ, రోడ్డు పోరంబోకు భూములు ఉన్నాయని కొత్త వాదనతీసుకువచ్చారు. దీనిపై రైతులు కోర్టుకు వెళ్లడంతో వ్యవహారం పెండింగులో పడింది.

ముఖ్యనేత నియోజకవర్గం మీదుగా పోతున్న జాతీయ రహదారి పక్కన పది ఎకరాల్లో వెంచర్‌ వేస్తున్నారు. దానికోసం భూమిని చదును చేశారు. ఆ పక్కనే ఉన్న పోలీస్‌ బెటాలియన్‌కు చెందిన భూమిని కూడా పనిలో పనిగా చదును చేసేశారు.

(తిరుపతి - ఆంధ్రజ్యోతి): శతకకారులకు ప్రసిద్ధి పొందిన ఆ ముక్కంటి క్షేత్రంలో ఇప్పుడు ఎటుచూసినా ఆ శాసనసభ్యుని నామస్మరణే! బియ్యం గుప్పిట పట్టినట్టు భూములను కబళిస్తారని ఆయన గురించి తెలిసినవారు చెప్పేమాట! ఆయన నియోజకవర్గంలో ప్రభుత్వ భూములకే గ్యారంటీ లేదు. ఎక్కడ ఏ భూ దందా జరిగినా ఆయన పేరే వినిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు అత్యధికంగా అవినీతి ఆరోపణలు చేయడం, ఫిర్యాదులకు అంతే లేకపోవడంతో రాష్ట్రమంతా ఆయన ‘ఖ్యాతి’ ఇప్పుడు మారుమ్రోగిపోతోంది. ఇద్దరు తహసిల్దార్ల విషయంలో సీఎంవో నుంచి జిల్లా కలెక్టరు దాకా ఏకం చేసి పారేశారు. కొందరు రెవిన్యూ అధికారుల అండతో విలువైన ప్రభుత్వ, డీకేటీ భూములు అక్రమంగా చేతులు మార్చి.. రూ. కోట్లు పోగేసుకుంటున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు.. ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయడానికి పెద్దఎత్తున భూములు సేకరిస్తోంది. విమానాశ్రయం, ఎలకా్ట్రనిక్‌ మ్యానుఫాక్చరింగ్‌ క్లస్టర్లు వంటివి ఉండటంతో ముఖ్యనేత నియోజకవర్గంలో ఈ ప్రక్రియను విస్తృతంగా చేపట్టారు. ఈ క్రమంలో ఇక్కడి భూములకు విపరీతమైన విలువ పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు ముఖ్యనేత పావులు కదిపారు. ప్రభుత్వ బంజరు, పొరంబోకు భూములు, కాలువ, కుంట, చెరువు పొరంబోకు భూములు, అనాధీనం, గయ్యాళు వంటి అనేక కేటగిరీలకు చెందిన భూములకు అక్రమంగా పట్టాలు జారీ చేస్తున్నారు. తనకు అనుకూలురైన వారి పేరిట పట్టాలు జారీ చేసి, ఆ భూములను పారిశ్రామికవాడల ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియలో ప్రభుత్వానికే అప్పగించి తద్వారా పరిహారం పేరిట అప్పనంగా భారీ మొత్తాలు పొందుతున్నారని చెబుతున్నారు. డీకేటీ పట్టాలు పొందిన వారి పేర్లను రెవిన్యూ రికార్డుల్లో ఇతరుల పేరిట ఇక్కడ మార్చేస్తున్న ఉదంతాలు కోకొల్లలు!

కోట్లు కొల్లగొడుతున్నారు

డీకేటీ పట్టాలు పొంది ఆ తర్వాత సుదూర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి భూములు, వారసులు లేకుండా చనిపోయిన వారి భూముల వివరాలు రెవిన్యూ అధికారులు పక్కాగా సమాచారం సేకరించి వాటి రికార్డులను తారుమారు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే పట్టాలు కేటాయించని బంజరు భూములకు రికార్డులు సృష్టించడం, ముఖ్యనేత సూచించిన పేర్లతో పట్టాలు జారీ చేయడం వంటివి జరుగుతున్నాయి. మాజీ సైనికుల పేరిట కూడా పట్టాలు జారీ చేస్తున్నారు. వీటిలో వెంచర్లు వేసి చుట్టుపక్కల సెటిల్‌మెంట్‌ భూముల సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేసి విక్రయించేస్తున్నారు. ఇటీవల ఓటీఎస్‌ విధానంలో స్థలాలను రిజిస్టర్‌ చేసి విక్రయిస్తున్నారు. డీకేటీ భూముల్లో ఈ దందాలో అటు ముఖ్యనేతకు, ఇటు రెవిన్యూ అధికారులకు రూ. కోట్లు దక్కాయని చెబుతున్నారు. ఇక భూసేకరణపరంగా కూడా ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే అప్పగించి రూ. కోట్లు కొట్టేస్తున్నారు.

ఒకరి మండలానికి ఒకరు.. ఇదే నేత నీతి!

ముఖ్య నేత నియోజకవర్గం పరిధిలోని రెండు మండలాల తహశీల్దార్లపై తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి. వేరే జిల్లాలో పని చేస్తుండగా, వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాల నమోదులో అక్రమాలకు పాల్పడ్డారని వీరిలో ఒకరిపై ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. అక్రమాలు వాస్తవమేనని తేలడంతో ఎమ్మెల్యే నియోజకవర్గం ఉన్న జిల్లాకు బదిలీ చేశారు. అయితే, తహశీల్దారు పోస్టు నుంచీ డిప్యూటీ తహశీల్దారుగా రివర్షన్‌ ఇచ్చారు. అయితే ఈ ఉత్తర్వులు అమలు కాకుండా ఎమ్మెల్యే సీఎంవో స్థాయిలో ఒత్తిడి తెచ్చి అడ్డుకున్నారని ప్రచారం జరిగింది. తర్వాత కూడా ఫిర్యాదులు అధికంగా వెళ్లడంతో కలెక్టర్‌కు సరెండర్‌ చేసింది. అలాగే, రేణిగుంట తహశీల్దారుపైనా భారీగా అవినీతి ఆరోపణలు కావడంతో ఆయననూ కలెక్టరుకు ప్రభుత్వం సరెండరు చేసింది. అయితే ఈ వ్యవహారంలో కూడా ఎమ్మెల్యే వారిపై చర్యలను అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం వారు కలెక్టరేట్‌లోని సెక్షన్లలో విధులు నిర్వహించాలి. అయితే, తిరిగి తన నియోజకవర్గంలోనే మండల తహశీల్దార్లుగా వారిని నియమించాలని నేత పట్టుబట్టినట్టు సమాచారం. చివరకు చేసేది లేక.. ఒకరి మండలం మరొకరికి మార్చి, తూతూ మంత్రం బదిలీలతో ఆ తహసిల్దార్లను ముఖ్య నేత నియోజకవర్గానికే పంపించారు.

బావమరిది ఆత్మహత్యాయత్నం

తన ఆస్తి కొట్టేసేందుకు అధికారులను అడ్డుపెట్టుకుని ముఖ్య నేత వేధిస్తున్నారంటూ ఆయన సొంత బావమరిది (భార్య తమ్ముడు) ఆత్మహత్యకు యత్నించడం ఏడాది కిందట కలకలం రేపింది. 2022 డిసెంబరు 3న ఈ ఘటన జరిగింది. కత్తితో గాట్లు పెట్టుకుని ఆయన బావమరిది ఆత్యహత్యకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పాతికేళ్లుగా బావ ఆనందం కోసమే తపించానని, బావను ఎమ్మెల్యే చేయడం కోసం సగం ఆస్తిని పోగొట్టుకున్నానని, తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చినందుకు ఇప్పుడు తననే ఇబ్బందులు పెడుతున్నారని ఆయన వాపోయారు. మిగిలిన ఆస్తి కోసం తనను చంపేస్తారా అంటూ పోస్టు చేసిన సెల్ఫీ వీడియోలు సోషల్‌ మీడియాలో అప్పట్లో వైరల్‌ అయ్యాయి.

కాలువ పోరంబోకులో పాగా

ముక్కంటి క్షేత్ర పట్టణంలోని డిగ్రీ కాలేజీకి ఎదురుగా వున్న ఈదులగుంట కాలువ పొరంబోకు భూమి 60 సెంట్ల మేరకు మూడేళ్ల కిందట కబ్జాకు గురైంది. రూ. 6 కోట్ల విలువైన భూమి ఇది. కాలువ పొరంబోకు భూమిని కబ్జా చేసి కమర్షియల్‌ నిర్మాణాలు చేపట్టారు. ఎమ్మెల్యే సన్నిహిత అనుచరుడి పేరు ఈ వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తున్నా.. సూత్రధారి ఎమ్మెల్యేయేనని చెబుతున్నారు.

పోలీస్‌ బెటాలియన్‌ భూమి ఆక్రమణ

పోలీస్‌ బెటాలియన్‌ భూమి ఆక్రమణకు గురి కావడం కీలక నేత కబ్జాల కావ్యంలో హైలెట్‌ అని చెబుతారు. నియోజకవర్గం మీదుగా పోతున్న జాతీయ రహదారి పక్క పది ఎకరాల్లో వెంచర్‌ వేసే ప్రయత్నాలు జరిగాయి. దానికోసం భూమిని చదును చేశారు. పనిలో పనిగా పోలీస్‌ బెటాలియన్‌కు చెందిన భూమిని కూడా కలిపేసుకున్నారు. దాన్ని కూడా చదును చేశారు. ఆలస్యంగా విషయం తెలిసి బెటాలియన్‌ అధికారులు అడ్డుకున్నారు. అయినా కబ్జాదారులు వెంచర్‌ ఏర్పాటు ప్రయత్నాలు విరమించకపోవడం గమనార్హం. కారణం విదితమే!

చెరువులు, గుట్టలు గుల్ల

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గ్రావెల్‌ తవ్వకాలు, రవాణా, విక్రయాల దందాలో కూడా అధికార పార్టీ కీలక నేత పేరు పెద్దఎత్తున ప్రచారంలో వుంది. నియోజకవర్గం మీదుగా పూతలపట్టు-నాయుడుపేట ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుండడంతో భారీ పరిమాణంలో గ్రావెల్‌ అవసరమవుతోంది. దీన్ని అవకాశంగా తీసుకున్న వైసీపీ ముఖ్యనేత కేవలం గ్రావెల్‌ దందాలోనే రూ.వంద కోట్లు ఆర్జించినట్టు సమాచారం. ఆ క్రమంలో శ్రీకాళహస్తి మండలం ఊరందూరు సమీపంలోని గుంటకిందపల్లి చెరువును పూర్తిగా తవ్వేశారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం అలాగే కైలాసగిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణం పేరిట ముక్కంటి దేవస్థానానికి చెందిన గుట్టలన్నీ తవ్వేసి బోడి చేశారన్న ఆరోపణలున్నాయి.

భూముల్లో 30 ఎకరాలు కోత

ముఖ్యనేతకు, రెవెన్యూ అధికారుల మధ్య బలమైన బంఽధం ఉందని నిన్నటిదాకా కొందరికే తెలుసు. ఓ భూదందా యత్నంతో ఇప్పుడు మొత్తం లోకానికి తెలిసిపోయింది. 2019 డిసెంబరులో పేదలకు ఇళ్ల స్థలాల కోసం 120 ఎకరాల డీకేటీ భూములు సేకరించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. దీనికోసం 63మంది రైతులకు సంబంధించిన 120 ఎకరాల డీకేటీ భూములను అధికారులు సర్వే చేసి గుర్తించారు. 2020 ఫిబ్రవరిలో రైతులకు నోటీసులు జారీ చేశారు. భూములు సేకరిస్తున్నట్టుగా రైతుల సంతకాలు కూడా తీసుకున్నారు. కొవిడ్‌ కారణంగా కొంతకాలం ఆ ప్రక్రియ ఆగిం ది. తిరిగి 2022 అక్టోబరులో మళ్లీ నోటీసులు జారీ చేశా రు. ఈ క్రమంలో ముఖ్యనేత రంగంలోకి దిగారు. అంతే.. అధికారుల స్వరం మారిపోయింది. 63మంది రైతులకు చెందిన 120 ఎకరాల్లో భౌతికంగా ఉన్నది 90 ఎకరాలేనని, తగ్గిన 30 ఎకరాల్లో కాలువ, రోడ్డు పొరంబోకు భూములు ఉన్నాయని కొత్త వాదన తీసుకువచ్చారు. 2006లో తమకు పట్టాలు ఇచ్చినప్పటి నుంచీ సాగు చేస్తున్నామని, కాలువ పొరంబోకు, రోడ్డు పొరంబోకు ఉంటే తమకు పట్టాలు ఎలా ఇచ్చారని రైతులు నిలదీశారు. పలువురు రైతులు న్యాయస్థానాన్నీ ఆశ్రయించారు. దీంతో మొత్తం వ్యవహారం పెండింగులో పడింది. 30 ఎకరాల కోత వెనుక కీలక నేత, రెవిన్యూ అధికారుల చేతివాటం ఉందని, ఆ భూములను తనకు కావాల్సిన వారి పేరిట పట్టాలు జారీ చేసి ఆ భూములకు పరిహారం పొందే కుట్ర చేశారని ఆరోపణలున్నాయి.

Updated Date - Jan 08 , 2024 | 05:38 AM