AP Politics: వైఎస్ జగన్-ముద్రగడ మధ్య ఏం జరిగింది.. ఎందుకీ పరిస్థితి..!?
ABN , Publish Date - Jan 12 , 2024 | 04:58 AM
ఎన్నికల ముంగిట సీఎం జగన్‌కు గట్టి షాకే తగిలింది. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీని కాదని... టీడీపీ/జనసేనల్లో ఒక పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది..

జనసేనలోకి ముద్రగడ
జగన్‌కు కాపు ఉద్యమ నేత షాక్!!
వైసీపీలోకే వస్తారని కొంతకాలంగా అధికార పక్షం ప్రచారం
ఆయన ద్వారా టీడీపీ, జనసేన ఓట్లకు
గోదావరిలో గండికొట్టాలని సీఎం ప్లాన్
జాబితాల ప్రకటనతో ముద్రగడ ఫైర్
పైగా గెలవలేరన్న కామెంట్లపై కినుక
2 రోజులున్నా దొరకని జగన్ దర్శనం
ఇది అవమానించడమేనని లోలోపల ముద్రగడ ఆగ్రహం
(కాకినాడ-ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముంగిట సీఎం జగన్‌కు గట్టి షాకే తగిలింది. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీని కాదని... టీడీపీ/జనసేనల్లో ఒక పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాలకు కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. కాపు రిజర్వేషన్ల దగ్గర నుంచి కాపు కార్పొరేషన్లను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసినా ఏరోజూ ఆయన నోరు విప్పలేదు. సరికదా.. ప్రశ్నించిన టీడీపీపైనే తిరిగి విమర్శలు చేస్తూ లేఖాస్త్రాలు విడుదల చేసేవారు. ఈ నేపథ్యంలో పూర్తి వైసీపీ నేతగా ముద్రగడ చలామణీ అవుతున్నారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ముద్రగడ కొంత ఆసక్తిగా ఉన్నారు. తనతోపాటు తనయుడిని కూడా ఎన్నికల బరిలోకి దించాలని ఉవ్విళ్లూరుతున్నారు. వైసీపీ సైతం ఆసక్తి చూపించింది. టీడీపీ, జనసేన ఎన్నికల పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత బలంగా ఉన్నందున టీడీపీ కూటమి వైపు కాపు సామాజికవర్గ ఓట్లు మళ్లకుండా కొంతైనా చీలిక తెచ్చేందుకు జగన్ ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు ముద్రగడను పార్టీలో అధికారికంగా చేర్చుకుని ఎక్కడో చోట సీటు ఇవ్వాలని భావించారు.
జగన్ సన్నిహితుడైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తరచూ ముద్రగడతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఆయన తనయుడికి కాకినాడ ఎంపీ టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. ముద్రగడ సైతం జిల్లాలో పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట సీట్లలో ఎక్కడో చోట పోటీ చేయడానికి సానుకూలత చూపారు. ఈలోపు జగన్ అక్కడ సిటింగ్ ఎమ్మెల్యేలను తప్పించి కొత్త ఇన్‌చార్జులను ప్రకటించారు. దీంతో ముద్రగడ మనస్తాపం చెందారు. ఇటీవల తాడేపల్లి వెళ్లి అక్కడే రెండు రోజులు మకాం వేశారు. కానీ జగన్ అపాయింట్‌మెంట్ దొరకలేదని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అటు పార్టీ జిల్లా పరిశీలకుడు మిథున్‌రెడ్డి నుంచి కూడా సరైన స్పందన రాకపోవడం, తన వద్దకు వీరెవరూ రాకపోవడంతో ముద్రగడ నొచ్చుకున్నట్లు సమాచారం. వైసీపీకి ఇంతకాలం పరోక్షంగా సహకరించినా.. ఇదేనా ఇచ్చే మర్యాద అని గుర్రుగా ఉన్నట్లు ఆయన వర్గంలో ప్రచారం జరుగుతోంది. ఈ అవమానం నేపథ్యంలో వైసీపీకి దూరంగా ఉండాలని ముద్రగడ నిర్ణయించారు.
దారి అటేనా..!
బుధ, గురువారాల్లో జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ స్వగృహానికి తాడేపల్లిగూడెం జనసేన నేతలు వచ్చి ఆయన్ను కలిశారు. జగ్గంపేట టీడీపీ ఇన్‌చార్జి జ్యోతుల నెహ్రూ గురువారం వెళ్లి సమావేశమయ్యారు. బయటకు సాధారణ భేటీ అని నేతలు చెబుతున్నా టీడీపీ, జనసేనల్లో ఎందులో చేరాలనేదానిపై విడివిడిగా చర్చలు జరిపినట్లు సమాచారం. జనసేనలో చేరేందుకు దాదాపుగా నిర్ణయించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇదే విషయమై ముద్రగడ తనయుడు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనల్లో ఏదో ఒక పార్టీలో తాము చేరే అవకాశం ఉందన్నారు. వైసీపీలోకి వెళ్లడానికి తన తండ్రి ఆసక్తిగా లేరని చెప్పారు. ఈసారి కచ్చితంగా పోటీలో ఉంటామని, త్వరలోనే నిర్ణయం ఉంటుందన్నారు. అన్నింటికీ సిద్ధపడి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నామని తెలిపారు.
నా ఇంటికి వైసీపీ వాళ్లు రావొద్దు!
తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ జిల్లా పరిశీలకుడు మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.. ముద్రగడతో చర్చించడానికి సిద్ధమయ్యారు. కానీ ఆయన తిరస్కరించినట్లు తెలిసింది. వైసీపీ నుంచి ఎవరూ తన ఇంటికి రావద్దని ఘాటుగానే చెప్పినట్లు సమాచారం. ఆయన ఆ పార్టీపై కోపంగా ఉండడానికి కారణముంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముద్రగడ పోటీ చేసినా ఫలితం ఉండదని వైసీపీ పెద్దలు వ్యాఖ్యానించడంతో ఆయన నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను బుజ్జగించడానికి రాజ్యసభకు పంపుతామని వైసీపీ నాయకత్వం ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.