Share News

తరలి వస్తున్నారు!

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:07 AM

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథ మహారథులు హాజరవుతున్నారు. అనేక మంది ప్రముఖులు మంగళవారమే విజయవాడ చేరుకున్నారు.

తరలి వస్తున్నారు!

విజయవాడ చేరుకున్న అమిత్‌షా, నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు

రజనీకాంత్‌ను తోడ్కొని వచ్చిన రామ్మోహన్‌ నాయుడు

పది దేశాల దౌత్యాధికారులు, బడా పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం

చంద్రబాబు ఫోన్‌కు స్పందించని జగన్‌

అమరావతి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథ మహారథులు హాజరవుతున్నారు. అనేక మంది ప్రముఖులు మంగళవారమే విజయవాడ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో గన్నవరం చేరుకున్నారు. వీరికి విమానాశ్రయంలో లోకేశ్‌, పురందేశ్వరి, సీఎం రమేశ్‌ తదితరులు స్వాగతం పలికారు. అమరావతి నిర్మాణం, పెట్టుబడుల పరంగా సహకారం అవసరమైన నేపథ్యంలో... పలు దేశాల కాన్సులేట్‌ జనరల్స్‌, హై కమిషనర్లను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. జపాన్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్‌ దౌత్యాధికారులు మంగళవారమే విజయవాడ చేరుకున్నారు. మొత్తం పది దేశాల దౌత్యాధికారులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు ‘మెగా స్టార్‌’ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు విజయవాడకు విచ్చేశారు. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు స్వయంగా తీసుకొచ్చారు. జాతీయ స్థాయిలో భారీ సంఖ్యలో పారిశ్రామికవేత్తలకు కూడా ఆహ్వానం పలికారు. అమరావతిలో ఏర్పాటైన ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ‘విట్‌’ వైస్‌ ప్రెసిడెంట్‌ జీవీ సెల్వమ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ కూడా హాజరు కానున్నారు. బిహార్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ సీఎంలు నితీశ్‌ కుమార్‌, ఏక్‌నాథ్‌ షిండే, మోహన్‌ యాదవ్‌తోపాటు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పలువురు ఎన్డీయే నేతలు, కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు.

వైసీపీ దూరం...

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకుంది. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్‌ను ఆహ్వానించినా ఆయన స్పందించలేదు. జగన్‌ను స్వయంగా ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించినప్పటికీ ఆయన ఫోన్‌లో అందుబాటులోకి రాలేదని టీడీపీ వర్గాలు తెలిపాయి. వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానాలను పంపారు. అయితే, ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని వైసీపీ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

Updated Date - Jun 12 , 2024 | 03:08 AM