Share News

ఉద్యమ బాట

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:39 AM

ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఏపీ ఎన్జీవో సంఘాలు, ఉపాధ్యాయ, పెన్షనర్‌, కార్మిక సంఘాలు ఉద్యమ శంఖారావం పూరించాయి. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై మండిపడ్డాయి.

ఉద్యమ బాట

ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరసన

రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో విధులు

జిల్లా, మండల కేంద్రాల్లో ప్రదర్శనలు

కలెక్టరేట్‌, తహసీల్దార్‌ ఆఫీసుల్లో వినతులు

ఏపీజేఏసీ ఉద్యమ కార్యాచరణ మొదలు

22 వేల కోట్ల పెండింగ్‌ బకాయిలు

చెల్లించాలని డిమాండ్‌

పీఆర్సీ అమలు, డీఏ, 30ు ఐఆర్‌కు కూడా

సమస్యలన్నీ పరిష్కరించాలని నినాదాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఏపీ ఎన్జీవో సంఘాలు, ఉపాధ్యాయ, పెన్షనర్‌, కార్మిక సంఘాలు ఉద్యమ శంఖారావం పూరించాయి. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై మండిపడ్డాయి. ఏపీజేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణలో తొలిరోజు, బుధవారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వర్తించారు. సమస్యలు పరిష్కరించాలంటూ భోజన విరామ సమయంలో జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు, మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. పీఆర్సీ, డీఏ బకాయిలు, ఇతర పెండింగ్‌ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.22 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. 12వ పీఆర్సీ కమిషన్‌ వేసినా ఇంతవరకు ఆ పీఆర్సీకి సంబంధించిన పని మొదలు పెట్టలేదని మండిపడ్డారు. నివేదిక ఆలస్యం అవుతున్నందున పెరిగిన ధరలకు అనుగుణంగా 30 శాతం ఐఆర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏపీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హృదయ రాజు కడప నీటి పారుదల శాఖ కార్యాలయం వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు తమ సమస్యల సాధనకోసం అంతా సిద్ధమన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని డిమాండ్‌ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలు విడుదల చేస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ప్రభుత్వం అమలు చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమ కార్యాచరణ విజయవంతమైందని ఏపీజేఏసీ చైర్మన్‌, సెక్రటరీ జనరల్‌ బండి శ్రీనివాసరావు, హృదయరాజు తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏపీజేఏసీ నేతలు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు తిరిగి అక్కడ నిర్వహించిన ఆందోళనలలో పాలు పంచుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరులో ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు, కార్యాలయాల వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. సత్యవేడు, పుత్తూరు డిపోల్లో ఆర్టీసీ ఉద్యోగులూ నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నంద్యాల కలెక్టరేట్‌ వద్ద ఏపీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న చేపట్టబోయే చలో విజయవాడ కార్యక్రమంతో ప్రభుత్వానికి తమ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. విశాఖపట్నంలో ఏపీ జేఏసీ విశాఖ చైర్మన్‌ కె.ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ఫెడరేషన్‌ సభ్యులు ఎన్జీవో హోమ్‌ నుంచి ఊరేగింపు నిర్వహించారు. కాగా, గురు, శుక్రవారాలు కూడా మధ్యాహ్నా భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు నేతలు వివరించారు.

ప్రధాన డిమాండ్లు ఇవీ..

ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా 12వ పీఆర్సీ అమలు చేసే వరకు 1-7-2023 నుంచి 30 శాతం ఐఆర్‌ మంజూరు చేయాలి.

కేంద్రం డీఏ ప్రకటించినట్టుగా రూపాయికి 0.91 పైసలు చొప్పున రాషం కూడా 2023 జనవరి 1, 2023 జూలై 1లలో ఇవ్వాల్సిన రెండు డీఏలను వెంటనే మంజూరు చేయాలి.

పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్‌, సరెండర్‌ లీవులు, ఏపీజీఎల్‌ఐ, మెడికల్‌ బిల్లులు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వెంటనే చెల్లించాలి.

1-7-2018 నుంచి 1-7-2022 వరకు డీఏల బకాయిలను ఉద్యోగులకు, పదవీ విరమణ చేసిన వారికి వెంటనే చెల్లించాలి.

1-9-2004న లేదా అంతకుముందు నియామకం పొందినవారు లేదా నోటిఫికేషన్‌ ప్రకటించాక ఆ తదుపరి నియామకం పొందినవారికి సీపీఎ్‌సకు బదులు ఓపీఎస్‌ అమలు చేయాలి.

గత పీఆర్సీలలో ఉన్నవిధంగానే 70, 75 ఏళ్లు నిండిన పెన్షనర్లకు 7 శాతం-10ు, 12-15ు అదనపు పెన్షన్‌ను పునరుద్ధరించాలి.

అన్ని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్సలు అమలు చేయాలి. ఈహెచ్‌ఎ్‌స కార్డులు జారీ చేయాలి.

ఎన్‌ఎమ్‌ఆర్‌, పార్ట్‌టైమ్‌, ఫుల్‌టైమ్‌ కంటిజెంట్‌, ఎంటీఎస్‌ ఉద్యోగుల జీతాలు పెంచాలి. వారి సర్వీసును రెగ్యులర్‌ చేయాలి.

సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎ్‌సను పునరుద్ధరించాలి.

ప్రతి నెలా 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించాలి.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.

Updated Date - Feb 15 , 2024 | 03:39 AM