Share News

24 గంటల వ్యవధిలో తల్లి, కొడుకు మృతి

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:03 AM

కాకినాడ జిల్లా సామర్లకోటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్తు షాక్‌తో తల్లి మరణించిన 24 గంటల వ్యవధిలోనే కుమారుడు కూడా అదేవిధంగా విద్యుదాఘాతంతో మృతిచెందాడు.

24 గంటల వ్యవధిలో తల్లి, కొడుకు మృతి

ఇద్దరూ ఒకేవిధంగా విద్యుదాఘాతానికి బలి

‘అమ్మ ఇక్కడే మరణించింది’ అని చెబుతున్న కుమారుడికి కూడా విద్యుత్తు షాక్‌

కనిపించకుండా ఉన్న తెగిపోయిన వైరు

కాకినాడ జిల్లా సామర్లకోటలో విషాద ఘటన

సామర్లకోట, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా సామర్లకోటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్తు షాక్‌తో తల్లి మరణించిన 24 గంటల వ్యవధిలోనే కుమారుడు కూడా అదేవిధంగా విద్యుదాఘాతంతో మృతిచెందాడు. విద్యుత్తు వైరు తెగిపడి ఉండి.. కనిపించకుండా పొంచివున్న మృత్యువు ఇద్దరినీ బలి తీసుకుంది. ‘ఇదిగో అమ్మ ఇక్కడే మరణించింది’ అని ఆ ప్రాంతాన్ని చూపిస్తూ బంధువులకు చెబుతున్న క్రమంలో కుమారుడు కూడా విద్యుత్తు షాక్‌తో మరణించడం అందరినీ కలచివేసింది. వివరాల ప్రకారం.. సామర్లకోట పట్టణ పరిధిలో వీర్రాఘవపురంలో చిట్టిమాని పద్మ(40), తన భర్త, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు విశ్వే్‌స(20)తో కలిసి నివాసం ఉంటోంది. భర్త అనారోగ్యం కారణంగా.. పద్మ చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుమారుడు విశ్వేస్‌ రోజువారీ కూలీ పనులకు వెళ్తుంటాడు. పద్మ ఇంటి సమీపంలో విద్యుత్తు స్తంభం నుంచి వచ్చే స్పేవైరు ఒకటి తెగిపోయింది. దీన్ని ఎవరూ గుర్తించలేదు. శనివారం బయటకు వెళ్లిన పద్మ ఆ విద్యుత్తు వైరు దగ్గర పడిపోయి, మృతిచెందింది. సాధారణ మరణంగా భావించి అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం పరామర్శకు వచ్చిన బంఽధువులకు విశ్వేస్‌ తల్లి చనిపోయిన ప్రాంతాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. ఇక్కడే అమ్మ పడిపోయి ఉందని చెప్తూ పొరపాటున జారిపడిపోతుండగా అక్కడి గోడపై ఆనుకోబోయాడు. అప్పటికే అక్కడ కరెంటు స్తంభం నుంచి వస్తున్న స్పేవైరు ఉంది. దాన్ని తాకి విద్యుదాఘాతానికి గురై అతడూ మృతిచెందాడు. దీంతో ఇద్దరూ విద్యుదాఘాతంతో మరణించారని బంధువులు నిర్ధారించుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కృష్ణ భగవాన్‌ తెలిపారు. బాధిత కుటుంబాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం పరామర్శించారు. ఘటనపై సమాచారం అందుకున్న విద్యుత్తు శాఖ అధికారులు స్పేవైరును తొలగించారు.

Updated Date - Oct 21 , 2024 | 04:03 AM