Share News

AP Election 2024: అతివలే నిర్ణేతలు!

ABN , Publish Date - May 03 , 2024 | 05:03 AM

రాష్ట్రంలో కొద్ది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేశ్‌కుమార్‌ మీనా గురువారం విడుదల చేశారు.

AP Election 2024: అతివలే నిర్ణేతలు!

  • 154 స్థానాల్లో మహిళా ఓటర్లే అధికం

  • రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4.14 కోట్లు

  • మహిళలు 2,10,58,615 మంది

  • 2,03,39,851 మంది పురుష ఓటర్లు

  • ట్రాన్స్‌జెండర్లు 3,421, సర్వీసు ఓటర్లు 68,185

  • తుది జాబితా కన్నా 5,94,631 మంది అధికం

  • నమోదులో కర్నూలు టాప్‌, అత్యల్పం అల్లూరి

అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొద్ది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేశ్‌కుమార్‌ మీనా గురువారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 4,14,01,887 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు వెల్లడించారు. జనవరి 22న కేంద్ర ఎన్నికల సంఘం విడుద ల చేసిన తుది జాబితాలో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,08,07256 మంది ఉండగా ఇప్పుడు ఆ ఓటర్ల సంఖ్య 4,14,01,887 కోట్లకు చేరుకుంది. అంటే తుది జాబితాతో పోలిస్తే తాజా జాబితాలో ఓటర్ల సంఖ్య 5,94631 పెరిగింది. తుది ఓటర్ల జాబితాలో ప్రకారం పురుష ఓటర్ల సంఖ్య 2,00,74,322 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 2,03,39,851కి చేరింది. మహిళా ఓటర్లు 2,07,29,452 ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 2,10,58,615కి చేరింది. ట్రాన్స్‌జెండర్‌ ఓటర్ల సంఖ్య గతంలో 3,482 ఉండగా ఇప్పుడు 3,421గా నమోదైంది. సర్వీసు ఓటర్లు 67,434 ఉండగా ఇప్పుడు 68185కి చేరింది. గతంలో కన్నా సర్వీసు ఓటర్ల సంఖ్య పెరిగింది.

ఓటర్ల నమోదులో కర్నూలు టాప్‌

ఓటర్ల తాజా జాబితా ప్రకారం.. రాష్ట్రంలో అత్యధికంగా ఓటర్లున్న జిల్లాల్లో కర్నూలు మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 20,56,203 మంది ఓటర్లు ఉన్నారు. రెండోస్థానంలో ఉన్న అనంతపురంలో 20,20,243 మంది ఉన్నారు. ఇక, విశాఖ జిల్లా మూడోస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 20,16,069 మంది ఓటర్లు ఉన్నారు. అదే విధంగా అత్యల్ప స్థాయిలో ఓటర్లు ఉన్న జిల్లాగా చివరి స్థానంలో.. అల్లూరి సీతారామరాజు జిల్లా నిలిచింది. ఇక్కడ 7,71,478 మంది ఓటర్లు ఉన్నారు.


ఇక్కడ పురుష ఓటర్లే ఎక్కువ

రాష్ట్రంలోని 21 నియోజకవర్గాల్లో మహిళలకంటే పురుషులు అధికంగా ఉన్నారు. టెక్కలి, పాతపట్నం, ఆమదాలవలస, ఎచ్చెర్ల, నరసన్నపేట, రాజాం, చీపురుపల్లి, గాజువాక, పిఠాపురం, పి.గన్నవరం, ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, పత్తికొండ, కోడుమూరు, ఆలూరు, మడకశిర, దర్శి, హిందూపురం, పెనుగొండ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లే అధికంగా ఉన్నారు. ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు రాష్ట్రవ్యాప్తంగా 3,421 మంది ఉండగా.. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 318 మంది ఉన్నారు. కోనసీమ జిల్లాల్లో అత్యల్పంగా 21 మంది ఉన్నారు. ఇక, రాష్ట్రంలో సర్వీసు ఓటర్లు 68,185 మంది ఉన్నారు. సర్వీస్‌ ఓటర్ల నమోదులో శ్రీకాకుళం మొదటి స్థానంలో ఉంది.

మహిళా ఓటర్లే అధికం

రాష్ట్రంలో 26 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది జాబితాలో శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో పురుష ఓటర్లు మహిళా ఓటర్ల కన్నా ఎక్కువగా ఉండగా తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఇక, 154 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.

పెరిగిన ఓటర్లు

2019 సాధారణ ఎన్నికల నాటికి రాష్ట్రంలో 3,94,05,967 మంది ఓటర్లు ఉండగా, 2024 ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ సంఖ్య 4,02,21,450కి చేరింది. తుది ఓటర్ల జాబితా-2024లో ఆ సంఖ్య 4,08,07256 చేరింది. ఇప్పుడు తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో ఆ సంఖ్య 41401887కి చేరింది. మొత్తంగా 5,94,631 మంది ఓటర్లు పెరిగారు.

అత్యధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో భీమిలి తొలిస్థానంలో ఉంది. ఇక్కడ 3,64,304 మంది ఓటర్లు ఉన్నారు. తర్వాత స్థానంలో గాజువాకలో 3,34,399 మంది ఓటర్లున్నారు.

అత్యల్ప సంఖ్యలో ఓటర్లు ఉన్న నియోజకవర్గం పెడన. ఇక్కడ 1,67,622 మంది ఓటర్లు ఉన్నారు. తర్వాత స్థానంలో నరసాపురంలో 1,70,521 మంది ఓటర్లు ఉన్నారు.

అత్యధిక జెండర్‌ రేషియో ఉన్న నియోజకవర్గాల్లో రంపచోడవరం మొదటి స్థానంలో నిలిచింది. ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,101 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రెండో స్థానంలో ఏలూరులో 1091 మంది, గుడివాడలో 1089 మంది ఉన్నారు. అత్యల్ప జండర్‌ రేషియో గిద్దలూరులో నమోదైంది. ఇక్కడ ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 964 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

Updated Date - May 03 , 2024 | 07:42 AM