సెప్టెంబరులోనూ ఎక్కువే..!
ABN , Publish Date - Sep 01 , 2024 | 03:35 AM
సెప్టెంబరు నెలలో కూడా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ తెలిపారు.
విశాఖపట్నం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): సెప్టెంబరు నెలలో కూడా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ తెలిపారు. వాయవ్య భారతంలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. బిహార్, ఈశాన్య ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలున్నట్లు వెల్లడించారు. సెప్టెంబరులో సాధారణ వర్షపాతం 167.9 మిల్లీమీటర్లుగా ఉంటుందని, ఈ సారి మాత్రం 109 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ‘‘హిమాలయ రాష్ట్రాలు-- ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌తోపాటు.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇది వరదలకు దారితీయవచ్చు. హిమాలయ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదాలున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి’’ అని ఆయన హెచ్చరించారు. సెప్టెంబరులో దక్షిణాదిలో తమిళనాడు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో సాధారణంకంటే తక్కువ వర్షపాతం నమోదు కానున్నట్లు తెలిపారు. కాగా.. ఆగస్టులో తీవ్ర వర్షాభావం నెలకొన్న ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సెప్టెంబరు నెలలో మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ బులెటిన్ తెలిపింది. శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకానున్నట్లు వెల్లడించింది. అయితే దక్షిణ కోస్తాలోని మిగిలిన జిల్లాలు, రాయలసీమలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనావేసింది.